వెండితెర ఆటగాళ్లు

ABN , First Publish Date - 2020-09-24T07:16:32+05:30 IST

బొమ్మ బాగా ఆడాలి... చిత్రసీమలో ప్రతి ఒక్కరి కోరిక! మా హీరో బాగా ఆడాలి... మా హీరోయిన్‌ బాగా ఆడాలి...

వెండితెర ఆటగాళ్లు

బొమ్మ బాగా ఆడాలి...

చిత్రసీమలో ప్రతి ఒక్కరి కోరిక!

మా హీరో బాగా ఆడాలి...

మా హీరోయిన్‌ బాగా ఆడాలి...

పరిశ్రమలో కొంతమంది కోరిక!

ఎందుకంటే?

ఆ హీరో హీరోయిన్లు...

వెండితెరపై ఆటగాళ్లు!

వాళ్లు బాగా ఆడితేనే...

సినిమా బావుంటుంది!

విజయ బావుటా 

ఎగరేస్తుంది!


తెలుగు తెరకు క్రీడా నేపథ్య చిత్రాలు కొత్త కాదు. ఇంతకు ముందు కొందరు తారలు వెండితెరపై ఆటగాళ్లుగా కనిపించారు. ‘గురు’లో వెంకటేశ్‌ బాక్సింగ్‌ కోచ్‌గా కనిపించారు. ‘తమ్ముడు’లో పవన్‌కల్యాణ్‌, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో రవితేజ కిక్‌ బాక్సర్లుగా నటించారు. ‘ఒక్కడు’లో మహేశ్‌ బాబు, ‘భీమిలి కబడ్డీ జట్టు’లో నాని కబడ్డీ క్రీడాకారులుగా సందడి చేశారు. ‘సై’లో నితిన్‌ రగ్బీ ఆడారు. ‘పడి పడి లేచె మనసు’లో శర్వానంద్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’లో ఆయన అథ్లెట్‌! ‘జెర్సీ’లో నాని, ‘మజిలీ’లో నాగచైతన్య, ‘డియర్‌ కామ్రేడ్‌’లో రష్మికా మందన్నా, ‘కౌసల్యా  కృష్ణమూర్తి’లో ఐశ్వర్యా రాజేశ్‌ క్రికెట్‌ క్రీడాకారులుగా కనిపించారు. సుమంత్‌ నటించిన ‘గోల్కొండ హైస్కూల్‌’, ప్రకాశ్‌ రాజ్‌ ‘ధోనీ’ క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలే. త్వైకాండో నేపథ్యంలో దివంగత కథానాయకుడు శ్రీహరి ‘భద్రాచలం’ చేశారు. ఇప్పటికే తెలుగులో క్రీడా నేపథ్యంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. అందుకే  ఇప్పటివరకూ తెరకెక్కని క్రీడల మీద కొందరు హీరోలు, హీరోయిన్లు, దర్శక-నిర్మాతలు దృష్టి సారించారు. కొత్త క్రీడలను ప్రేక్షక లోకానికి పరిచయం చేయనున్నారు. ఇంకొందరు క్రీడా నేపథ్యంలో కొత్త కథలు చెప్పడానికి సిద్ధమయ్యారు. తెరపై అసలు సిసలైన ఆటగాళ్లుగా కనిపించడం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.


ఛలో ఛలో... హాకీ కోర్టులో!

హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠీ మొన్నామధ్య కొన్ని రోజులు ఉదయాన్నే హాకీ కోర్టుకు వెళ్లి ప్రాక్టీస్‌ చేశారు. సందీప్‌ కిషన్‌ హాకీ ప్రాక్టీస్‌తో పాటు సిక్స్‌ ప్యాక్‌ చేశారు. బరువు తగ్గారు. వీళ్లిద్దరూ ఇంత కష్టపడినది ఓ సినిమా కోసమే. హాకీ నేపథ్యంలో డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. అదీ సంగతి! ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.


ఇద్దరూ బాక్సర్లే!

ఇప్పుడు బాక్సింగ్‌ నేపథ్యంలో తెలుగులో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫైటర్‌’ ఒకటి. కిరణ్‌ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా మరొకటి. ఈ యువ హీరోలు ఇద్దరూ బాక్సర్లుగా నటిస్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాలు షూటింగు జరుపుకుంటున్నాయి. 



కీర్తీ షూటర్‌ 

కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రలో నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’. ఓ గిరిజన యువతి షార్ప్‌ షూటర్‌గా ఎలా ఎదిగిందీ? అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకున్నదీ? అనేది చిత్రకథాంశం! గిరిజన యువతిగా డీ-గ్లామర్‌ లుక్‌లో కీర్తీ సురేశ్‌ నటించినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సినిమా టీజర్‌ విడుదలైంది. ఇందులో కీర్తీకి కోచ్‌గా జగపతిబాబు నటించారు. 



విలుకాడు

విలువిద్య నేపథ్యంలో యువ కథానాయకుడు నాగశౌర్య ఓ చిత్రం చేస్తున్నారు. దీని కోసం ఆయన ఎయిట్‌ ప్యాక్‌ చేశారు. అంతే కాదు... బాడీని ఫిట్‌గా మెయింటైన్‌ చేయడం కోసం ఏడెనిమిది రోజులు  ఆయన మంచినీళ్లు కూడా తాగడం మానేశారు. ఆఖరుకి ఉమ్మును సైతం మింగడం లేదట! ఈ నెల 18న హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ మొదలైంది. సంతోశ్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


కబడ్డీ...కబడ్డీ!

గోపీచంద్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో ఇద్దరూ కబడ్డీ కోచ్‌లుగా నటిస్తుండటం విశేషం. తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌ అయితే... గోపీచంద్‌ ఆంధ్రా కబడ్డీ కోచ్‌! కథ పరంగా ఆటలో పోటీ పడినా... ప్రేమలో ఒక్కటవుతారట! హీరో హీరోయిన్లు మధ్య ఆటతో పాటు ప్రేమ పాటలతో దర్శకుడు సంపత్‌ నంది ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.


బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా!

నిజ జీవితంలో హీరో సుధీర్‌బాబు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో స్టేట్‌ లెవల్‌లో ఆడారు. ఒకానొక సమయంలో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు. త్వరలో వెండితెరపైనా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఒకప్పుడు తనతో కలిసి ఆడిన పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో సుధీర్‌బాబు హీరోగా నటించనున్నారు. దీనికి ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కించనున్నారు. 



మల్లీశ్వరి కథతో.. 

వెయిట్‌ లిఫ్టింగ్‌లో దేశానికి కాంస్య పతకం అందించిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి జీవితకథతో తెలుగులో ఓ చిత్రం రూపొందుతోంది. కోన వెంకట్‌ కథ అందిస్తుండటంతో పాటు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజనారెడ్డి దర్శకురాలు.  మల్లీశ్వరి పాత్రలో నటించనున్న కథానాయికగా రకుల్‌, అంజలి పేర్లు వినిపించాయి. కానీ, చిత్రబృందం అధికారికంగా నటీనటుల వివరాలు ప్రకటించలేదు. అలాగే నాగచైతన్య కోసం దర్శకుడు వెంకీ అట్లూరి క్రీడా నేపథ్యంలో ఓ కథ రాస్తున్నట్టు వినికిడి. తెలుగు, తమిళ భాషల్లో ఆది పినిశెట్టి క్రీడా నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నట్టు సమాచారం. 



బాలీవుడ్‌లో బడా స్టార్లూ...!

హిందీ చిత్రసీమలోనూ క్రీడా నేపథ్యంలో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. క్రికెట్‌లో దేశానికి తొలి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌ దేవ్‌ టీమ్‌ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ... దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ‘83’ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు. ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ రహీమ్‌ బయోపిక్‌ ‘మైదాన్‌’లో అజయ్‌ దేవగణ్‌ నటించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ఆమె పాత్రలో పరిణితీ చోప్రా నటిస్తున్నారు. ముందు ఆ పాత్రకు శ్రద్ధా కపూర్‌ని అనుకున్నారు. కొన్ని రోజులు ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు.


కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. తర్వాత పరిణీతి చోప్రా వచ్చారు. నటుడు సోనూ సూద్‌ మరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు బయోపిక్‌ నిర్మిస్తున్నారు. టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా జీవితాన్ని తెరకెక్కించడానికి హిందీ నిర్మాత రోనీ స్ర్కూవాలా సన్నాహాలు చేస్తున్నారు. మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’లో ఆమె పాత్రను తాప్సీ పోషిస్తున్నారు. ‘రష్మీ రాకెట్‌’ అని మరో స్పోర్ట్స్‌ సినిమా చేస్తున్నారామె. గుజరాత్‌లోని కచ్‌ నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. క్రీడా నేపథ్యంలో మరికొన్ని చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.

Updated Date - 2020-09-24T07:16:32+05:30 IST