సాయ్‌లెన్స్‌.. రావి కొండలరావు

ABN , First Publish Date - 2020-07-29T10:50:41+05:30 IST

సాయ్‌లెన్స్‌.. సాయ్‌లెన్స్‌.. ఎవరా చెప్పింది.. రావి కొండలరావు ఇక లేరని!! తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన ఉంటారు. తెలుగు కథ, నాటకం గురించి మాట్లాడుకునేవారు ఉన్నంతకాలం రావి కొండలరావు నిక్షేపంగా చిరంజీవే...

సాయ్‌లెన్స్‌.. రావి కొండలరావు

రావి కొండలరావు : (1932-2020)

సాయ్‌లెన్స్‌.. సాయ్‌లెన్స్‌.. ఎవరా చెప్పింది.. రావి కొండలరావు ఇక లేరని!! తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన ఉంటారు. తెలుగు కథ, నాటకం గురించి మాట్లాడుకునేవారు ఉన్నంతకాలం రావి కొండలరావు నిక్షేపంగా చిరంజీవే! మాట్టాడకండి మరి.. ఎక్కణ్నుంచీ వస్తారో అంతా! ఇదేనా మర్యాద? రావి కొండలరావు లెజెండరీ గురించి చెప్పుకోవాలంటే బోలెడన్ని విశేషాలు. కావాలంటే మచ్చుకు కొన్ని చూడండి..


ఏ పాత్రనైనా ఒకే విధంగా పోషించే నటులు కొందరు ఉన్నారు. అయితే పాత్రల స్వభావాన్ని బట్టి డైలాగ్‌ మాడ్యులేషన్‌ మార్చుకొవడం రావి కొండలరావు ప్రత్యేకత అని చెప్పాలి. ఆయన నటించిన పాత్రలు చిన్నవే అయినా ఎంతో సహజంగా వుండి ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేవి. సంభాషణలకు మేనరిజం జోడించి చెప్పడం ఆయన ప్రత్యేక శైలి. ఉదాహరణకు.. ‘నిర్దోషి’ (1967) సినిమాలో ఆయన సంగీత ప్రియుడైన డాక్టర్‌ పాత్ర వేశారు. అందులో ఆయనకనిపించినప్పుడల్లా.. ‘‘రామచిలుకనొకటి పెంచి, ప్రేమమీర మాటలాడే’’ అని పాడుతూ ఉంటారు. దీనికి స్ఫూర్తి మద్రాసులో తానెరిగిన ఓ డాక్టర్‌ మ్యానరిజమేనని ఆయన చెప్పేవారు. కూనిరాగం తీస్తూ పలకరించే ఆ డాక్టర్‌ను కొండలరావు అనుకరించిన తీరు సూపర్‌హిట్‌ అయింది. అలాగే తాతినేని రామారావు దర్శకత్వలో ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘బ్రహ్మచారి’ (1968) సినిమాలో కూడా కొండలరావు డాక్టరుగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆ సినిమాలో రావు సాహెబ్‌ పరంధామయ్య (నాగభూషణం) మనవణ్ని రక్త పరీక్ష ద్వారా గుర్తించే డాక్టరు పాత్ర ధరించారు. కళ్లజోడు సవరించుకుంటూ ‘‘మీ అబ్బాయి రామకృష్ణ రక్తమున్నూ, ఆ బిడ్డ యొక్క రక్తమున్నూ, అనగా ఇద్దరి రక్తమున్నూ పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చూడగా తేలినదేమనగా.. నౌ కమింగ్‌ టు పాయింట్‌... ఒక్కటే! ఏమియూ సందేహము లేదు’’ అంటూ ఆయన చెప్పే విధానం నవ్వులు పూయించింది.


చావు పద..

నిర్మాత, దర్శకుడు పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించిచూడు’లో నాగేశ్వరరావు తండ్రిగా ఒక స్కూల్‌ మాస్టారు పాత్రలో కొండలరావు నటించారు. ఆ సినిమా చేసే సమయానికి ఆయన వయసు 30 ఏళ్లు. ఆ పాత్ర కోసం ముళ్లపూడి వెంకటరమణ సలహాపై పుల్లయ్య దగ్గరకు వెళ్లిన రావి కొండలరావును చూసి.. ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. తన సహజ ధోరణిలో.. ‘‘ఫస్ట్‌ గెటవుట్‌. నీకు బుద్థి లేదా? ఆ రమణకి బుద్ధి లేదా? లేకుంటే నాకు బుద్ధి లేదా? నువ్వు నాగేశ్వరరావుకి తండ్రివా? అయామ్‌ నాట్‌ ఎ ఫూల్‌. ప్లీజ్‌ గో’’ అన్నారు. వెంటనే ఆయన రమణ దగ్గరకు వెళ్లి ఆ విషయం చెప్తే.. ‘మీ తెలుగు మాస్టారును అనుకరిస్తూ డైలాగ్స్‌ చెప్తావు కదా. ఆ మిమిక్రీ ఆయన ముందు చెయ్యి’ అన్నారాయన. వెంటనే కొండలరావు పుల్లయ్య వద్దకు వెళ్లి.. తెలుగు మాస్టర్‌లా యాక్టింగ్‌ చేసి చూపించారు. దాంతో ఆయన ‘‘చావు పద’’ అంటూ విగ్గుల షాపు వద్దకు తీసుకెళ్లారు పుల్లయ్య. అంటే తండ్రి పాత్ర ఖరారైందన్నమాట! ఆ సినిమాలో ఆయన పలికే ‘‘సాయ్‌లెన్స్‌’’ అనే ఊత పదం అందరినీ అలరించింది. 


ఆ కథనే అటు ఇటు మార్చి...

విజయావారి ‘మిస్సమ్మ’ సినిమాలో పెళ్లికాని ఇద్దరు నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగ సంపాదన కొసం భార్యాభర్తలుగా నటిస్తూ చివరకు పెళ్లిచేసుకుంటారు. రావి కొండలరావు ఈ నేపథ్యాన్ని తీసుకొని ఇద్దరు పెళ్లైన యువతీ యువకులు అనివార్యమైన పరిస్థితుల్లో అవివాహితులుగా చెప్పుకొని ఉద్యోగంలో చేరడం అనే పాయింట్‌తో కథ అల్లితే, దాన్ని బాపు, రమణలు ‘పెళ్లిపుస్తకం’ (1991)గా మలిచారు. సినిమాలో.. గుమ్మడి వెనకాల నుంచుని, ఆయన మాటలకు అభినయించే బాబాయి వేషంతో అందరి ప్రశంసలు పొందారు. ఈ సినిమాకుగాను.. రావి కొండలరావుకు ఉత్తమ కథారచయితగా, ముళ్లపూడికి ఉత్తమ సంభాషణల రచయితగా నందులు దక్కాయి.


ఓరేయ్‌ గాడిదా..

‘ప్రేమించి చూడు’ సినిమాలో కొండలరావు.. ఏఎన్నార్‌ తండ్రి పాత్ర వేశారు. ఒక సీన్‌లో నాగేశ్వరరావును ఉద్దేశించి.. ‘‘ఒరేయ్‌ గాడిదా! ఎక్కడరా తిరుగుతున్నావు?’’ అని అడగాలి. ఆ సన్నివేశంలో నటించేందుకు కొండలరావు సందేహిస్తే.. ‘‘ఈ సన్నివేశంలో తండ్రి కొడుకును మందలింపుగా ప్రశ్నిస్తున్నాడు. అంతే తప్ప అక్కినేనిని కొండలరావు గాడిదా అనట్లేదు’’ అంటూ ఏఎన్నార్‌ భుజం తట్టి ప్రోత్సహించారు. దాంతో కొండలరావు ఆ పాత్రలో విజృంభించారు. అలాగే మరో సినిమాలో ఎస్వీఆర్‌ను.. ‘ఒరేయ్‌ ఒరేయ్‌.. మళ్లీ చుట్ట మొదలెట్టావేంట్రా?’ అని తిట్టే సీన్‌ ఉంది. కొండలరావు తటపటాయిస్తుంటే ఎస్వీఆర్‌ ఆయన వద్దకు వెళ్లి.. ‘‘పంతులూ.. ఎందుకయ్యా భయం? ఫ్రీగా చెయ్‌’’ అన్నారు. ‘‘ఫ్రీగా చేయట్లేదండీ. డబ్బులు ఇస్తున్నారండీ’’ అంటూ రావి కొండలరావు తనదైన శైలిలో జోక్‌ చేశారు. అంతే.. సెట్టంతా నవ్వుల సందడి!


ఏమేవ్‌ అనే దాకా వచ్చావూ..

సూర్యకాంతం, రావి కొండల రావు దాదాపు పది సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. బయట ఆవిడ ఈయన్ను తమ్ముడూ అని పిలిచేవారు. ఈయన ఆవిడను ‘అక్కగారూ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఒకసారి అలాగే ఒక సీన్‌లో రావి కొండలరావు సూర్యకాంతాన్ని ‘ఏమేవ్‌ ఇదుగో’ అని పిలిస్తే.. ‘ఏం నాయనా? ఏమేవ్‌ అనే దాకా వచ్చావు?’ అని సూర్యకాంతం సరదాగా అన్నారు. 


పెద్ద పెద్ద పాత్రలు

రావి కొండలరావు వయసులో చిన్నవారైనా వేసినవన్నీ ‘పెద్ద’ పాత్రలే. అంటే తండ్రి, బాబాయి.. ఇలాగన్నమాట. తనకన్నా వయసులో పెద్దవారైన నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ వంటివారికి తండ్రి పాత్రలు వేశారాయన. అదే సమయంలో.. తనకన్నా పెద్దవారైన పుష్పవల్లి, సూర్యకాంతం, ఎస్‌.వరలక్ష్మి, భానుమతి వంటివారికి భర్తగా చాలా పాత్రలు వేశారు. ఇదో విచిత్రం అని గుర్తుచేసుకునేవారాయన.


కృష్ణకు స్కూటర్‌ నేర్పి..

తేనెమనసులు సినిమాలో రాధాకుమారికి వేషం వచ్చింది. రావి కొండలరావుకు మాత్రం వేషం లేదు. కానీ, ఆమెను దింపడానికి ఆయన హైదరాబాద్‌లోని సారథీ స్టూడియో్‌సకు రోజూ వెళ్లేవారు. ఆమెను దింపాక అక్కడే కాసేపు ఉండి కాలక్షేపం చేసేవారు. ఆ సినిమాలో హీరో కృష్ణ స్కూటర్‌ నడపాలి. కానీ ఆయనకేమో రాదు. దీంతో ఆదుర్తి సుబ్బారావు ఆ పని రావి కొండలరావుకు అప్పజెప్పారు. ఆయన దగ్గర కృష్ణ చాలా తొందరగా స్కూటర్‌ నేర్చుకున్నారు.


ఒరేయ్‌ కోటీ..

‘ఓయ్‌’ సినిమాలో రావి కొండలరావు, రాధా కుమారి భార్యాభర్తలుగా వేశారు. ఒక సీన్‌లో ఆమె ఆయనను ‘ఒరేయ్‌ కోటీ’ అని పిలివాలి. ఆ సినిమా డైరెక్టర్‌ ఆమెతో.. ‘అమ్మా, కొండలరావుగారిపై మీకు ఏమైనా కోపం ఉంటే తీర్చేసుకోండి’ అన్నారని, ఆ సినిమా మొత్తం ఆమె తనను అలాగే పిలిచిందని, పాత్రలు చక్కగా పండాయని.. రావి కొండలరావు అందరికీ సరదాగా చెప్పేవారు. ఆవిడ వెళ్లిపోయాక.. ఆయన సంతోషం సగమైంది! తర్వాత అప్పుడప్పుడూ కొన్ని సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేవారేగానీ మునుపటి ఉత్సాహం ఉండేది కాదు. ఇప్పుడు ఏ లోకాల్లోనో తన జీవితభాగస్వామిని కలిసి ఆనందంగా ఉండి ఉంటారు. అలాగే ఉండాలని ఆశిద్దాం!!


బహుముఖ మేధావిని కోల్పోయాం 

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమతో రావి కొండలరావుగారికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన ఆకస్మిక మరణం దిగ్ర్భాంతికి గురి చేసింది. నేను హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళ నుండి ఆయనతో పలు చిత్రాల్లో నటించా. ‘చంటబ్బాయి’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ మంచి నటుడినే కాదు గొప్ప రచయితను, పాత్రికేయుణ్ణి, ప్రయోక్తను కోల్పోయింది. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. రావి కొండలరావుగారు, ఆయన సతీమణి రాధాకుమారి జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ 

చిరంజీవిఆయన సేవలు అజరామరం 

‘‘రావి కొండలరావుగారి మరణం సినీ రంగానికి లోటు. ఆయన అందించిన బహుముఖ సేవలు అజరామరం. నాటక రచయితగా, నటుడిగా రంగస్థలానికీ... పాత్రికేయునిగా సినీ జర్నలిజానికి చేసిన సేవలు మరువలేనివి. సినీ రంగంలో ఎన్నో మలుపులను అక్షరబద్ధం చేశారు. చిత్రసీమలో నటుడిగా, కథా రచయితగా తన ముద్ర వేశారు. ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి రచయితగా ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. అన్నయ్య చిరంజీవిగారి చిత్రాలు ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘చంటబ్బాయ్‌’ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు అందరికీ గుర్తే. గతేడాది ఒక పుస్తకావిష్కరణ సభలో వారిని కలిసినప్పుడు సినీ రంగ ప్రస్థానం, మలుపుల గురించి మాట్లాడుకున్నాం. రావి కొండలరావుగారి కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’’

పవన్‌ కల్యాణ్‌.ఆయన ఆల్‌-రౌండర్‌ 

‘‘వయసుతో సంబంధం లేకుండా నాకు సన్నిహితులైన వ్యక్తి రావి కొండలరావు. మా మాటల్లో, మేం చేసిన అల్లరిలో వయసు తెలిసేది కాదు. అంత గొప్ప వ్యక్తి. ఆయన జర్నలిస్ట్‌, రైటర్‌, యాక్టర్‌... అన్నీ. ఆయనో ఆల్‌-రౌండర్‌. ఎక్కువ కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటుల్లో ఆయన ఒకరు. మరింత గౌరవం పొందాల్సిన వ్యక్తి. అందుకు అర్హత ఉన్న వ్యక్తి. చాలా సింపుల్‌గా ఉండే గొప్ప మనిషి. ‘బృందావనం’, ‘పెళ్లి పుస్తకం’, ‘మిస్టర్‌ పెళ్ళాం’... ఇలా చెప్పుకొంటూ వెళితే నాకు సంబంధించిన ప్రతి సినిమాలోనూ ఆయన ఉన్నారు. కో-యాక్టర్‌గానే కాదు... అంతకు మించిన అనుబంధం మా మధ్య ఉంది. మా ఇద్దరి మధ్య స్నేహాన్ని సినిమాల్లో ప్రేక్షకులు చూసినది చాలా తక్కువ. అతని చుట్టూ ఉన్న వ్యక్తులెవరూ బాధపడటం నేను చూడలేదు. కరోనా సమయంలో ఆయన తుదిశ్వాస విడిచి వెళ్ళడం బాధాకరం. నేను వెళ్ళి ఆయన దగ్గర నిలబడే అవకాశం లేనందుకు బాధపడుతున్నా. ఇప్పుడు భౌతిక దూరం పాటించాలనే సంగతి ప్రజలందరికీ తెలిసిందే. నా మనసు ఎంత బాధపడుతుందో నాకే తెలుసు’’ 

రాజేంద్రప్రసాద్‌సినీ చరిత్రకారుడు ఆయన

రావికొండలరావుతో నాకు  అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తొలిసారిగా వైజాగ్‌లో వంశీ అవార్డుల సభలో కలుసుకొన్నప్పుడు ‘సాహిత్యంలో మీకు ఏ పాటి పరిచయం ఉంది?’ అని అడిగారు. కొన్ని వేల పుస్తకాలు అని చెప్పాను. మరి పాటలు ఎందుకు రాస్తున్నారని అడిగితే పాటంటే నాకు ప్రాణం అని చెప్పాను. ఆయన మురిసిపోయారు. అప్పటినుంచీ తరచూ కలుసుకొనేవాళ్లం. ఇటీవల ఆయనకు ఫోన్‌ చేసి ఎలా ఉన్నారని అడిగితే ‘ఏముందండీ కోవిడ్‌లో ఉన్నాం’ అని  చమత్కారంగా సమాధానమిచ్చారు.  తెలుగు చిత్రరంగం స్వర్ణయుగపు రోజులకు రావికొండలరావే సాక్షి.  ఆ నాటి తెలుగు చిత్రసీమ విశేషాలను భావితరాలకు అందించిన సినీ చరిత్రకారుడు కూడా ఆయనే’ 

భువనచంద్రసరదా మనిషి

తెలుగు సినీ నిర్మాతల చరిత్ర రాసేటప్పుడు వీఏకే రంగారావు, రావికొండలరావు వాస్తవాలను నిర్భయంగా రాసేందుకు హెల్ప్‌ చేశారు. ఎప్పుడూ సరదాగా మాట్లాడడం ఆయనకు అలవాటు. నటుడిగా, రచయితగా, మంచి మనిషిగా నేను అభిమానించే వ్యక్తి రావికొండలరావు.  

మురారిపెద్ద దిక్కును కోల్పోయా

రావికొండలరావు హాస్యానికి మరోపేరు. చురుకుదనం ఆయన ఊపిరి. తెలుగు సినీ రంగం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. మూడు దశాబ్దాలకు పైగా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను పాటలు రాసిన  ’బృందావనం’ చిత్రానికి రావికొండలరావు నిర్మాణ సారథ్యం వహించారు.  కమల్‌ నటించిన ‘నమ్మవర్‌’ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు అందులో ఓ పాత్రకు రావికొండలరావు చేత ఒప్పించి డబ్బింగ్‌ చెప్పించాను. హైదరాబాద్‌ ఎప్పుడు వెళ్ళినా ఆయన్ని కలిసేవాణ్ణి. మొన్నీమధ్య రావికొండలరావు నాకు  ఫోన్‌ చేసి హైదరాబాద్‌కు వస్తే తప్పకుండా కలువమని, చూడాలని ఉందని చెప్పారు. ఆయనతో మాట్లాడిన చివరి మాటలు అవే. 

వెన్నెలకంటి శత్రువులు లేని వ్యక్తి!

‘‘రావి కొండలరావు నా మనసుకి చాలా దగ్గరైన మనిషి. నేను దర్శకుడైన తర్వాత ప్రతి సినిమాలోనూ ఆయన ఉన్నారు. మా ఇద్దరి మధ్య అంతగా అనుబంధం ఉండేది. షూటింగ్‌లు ఉన్నా లేకపోయినా విజయా స్టూడియోలో వారంవారం కలిసేవాళ్లం. ఆ సంస్థలో ‘బృందావనం’, ‘భైరవద్వీపం’ చిత్రాలకు ఇద్దరం కలిసి పనిచేశాం. సినిమా విషయం పక్కన పెడితే ఆయన గొప్ప మనిషి. ఏదైనా విమర్శ చేయాలన్నా సెన్సాఫ్‌ హ్యూమర్‌తో విమర్శించేవాడు. వ్యక్తిగతంగా ఆయనకు ఒక్క శత్రువు కూడా లేరు. కొండలరావు ఆకాల మరణం నాకెంతో బాధ కలిగించింది’’

సింగీతం శ్రీనివాసరావు Updated Date - 2020-07-29T10:50:41+05:30 IST