‘ఒగ్గేసిపోకే అమృతా’ పాట వెనకున్న కథను శ్యామ్‌

ABN , First Publish Date - 2020-11-06T10:10:06+05:30 IST

‘‘పాటను ఒక కథలా చెప్పటం.. అప్పటి దాకా జరిగిన కథంతా ఆ పాటలో వచ్చేలా వివరించటం ఒక ఛాలెంజ్‌. నాకు దొరికిన అలాంటి ఒక పాటే...

‘ఒగ్గేసిపోకే అమృతా’ పాట వెనకున్న కథను శ్యామ్‌

కాస్లర్ల శ్యామ్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ‘అల వైకుంఠపురములో’ ‘రాములో రాములా’ పాట రచయిత అంటే చాలా మందికి తెలుస్తుంది. ఒక ప్రధానమైన సన్నివేశాన్ని పాటలో అందంగా చెప్పటంలో శ్యామ్‌కు సినీ పరిశ్రమలో మంచి పేరు ఉంది. తాజాగా ‘ సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా కోసం ఆయన రాసిన పాట ‘ఒగ్గేసిపోకే అమృతా’. ఆ పాట వెనకున్న కథను శ్యామ్‌ వివరించారు. 


‘‘పాటను ఒక కథలా చెప్పటం.. అప్పటి దాకా జరిగిన కథంతా ఆ పాటలో వచ్చేలా వివరించటం ఒక ఛాలెంజ్‌. నాకు దొరికిన అలాంటి ఒక పాటే ‘ఒగ్గేసిపోకే అమృతా’. ఈ సినిమాలో హీరోకు కొన్ని కచ్చితమైన సిద్ధాంతాలుంటాయి. హీరోయిన్‌ అమృత పరిచయం అయిన తర్వాత వాటిని వదిలేసుకుంటాడు. తమాషా ఏమిటంటే- అమృత హీరో సిద్ధాంతాలు నమ్మటం మొదలుపెడుతుంది.  ‘నేను చెప్పిన ఫిలాసఫీనే నా కొంప ముంచింది’ అని హీరో అనుకొనే సందర్భం కోసం రాసిన పాట ఇది. ఇది చాలా చిత్రమైన సందర్భం. అందుకే హీరోయిన్‌ అమృత పేరుతో పాట మొదలెట్టా!  ‘ఒగ్గేసిపోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా’ అన్న హుక్‌లైన్‌ రాశా.  ఆ తర్వాత హీరో ఆలోచన బట్టి ‘బల్బ్‌ కనిపెట్టినోడికే బతుకు సిమ్మసీకటైపోయిందే, సెల్లుఫోను కంపెనోడికే సిమ్ముకార్డే బ్లాకయ్యిపోయిందే’ అంటూ పల్లవి రాశాను. ఈ పాటలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం మన రోజువారి జీవితంలో వచ్చే పదాలు. ఫైవ్‌ స్టార్‌ చాక్‌లెట్‌, ఫెవికాల్‌, గూగుల్‌, సిమ్‌కార్డ్‌, బ్రైట్‌ ఫ్యూచర్‌ లాంటి ఇంగ్లీషు పదాలను పాట కోసం ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే కాలేజీల్లో ఇలాంటి పదాలను అందరూ ఎటువంటి సంకోచం లేకుండా ఉపయోగించేస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించటం వల్ల మనం చెప్పాలనుకున్న భావం సూటిగా చేరిపోతుంది. నా పాటకు సంగీత దర్శకుడు మంచి ట్యూన్‌ ఇచ్చారు. ఇప్పటి దాకా ఈ పాటకు 40 లక్షల వ్యూస్‌ వచ్చాయి. 


‘‘నేను చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా. 300కిపైగా పాటలు రాశా. ఇవన్నీ ఒక ఎత్తు. రాములో రాములా.. పాట మరొకెత్తు. నాకు ‘2019 బాగా కలిసొచ్చింది. ‘ఎఫ్‌2’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘అల వైకుంఠపురములో’, ‘వెంకీ మామా’, ‘భీష్మ’, ‘ప్రతి రోజూ పండగే’ లాంటి సినిమాల్లో పాటలు రాసే అవకాశమొచ్చింది. పాట సందర్భంతో పాటుగా దర్శకుల ఆలోచనా బలం కూడా రచయితకు చాలా అవసరం. దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి పనిచేసిన తరవాత నా పనితీరులో, రాసేపద్ధతిలో చాలా తేడా వచ్చింది..’’

Updated Date - 2020-11-06T10:10:06+05:30 IST