నటరత్న ‘సర్దార్ పాపారాయుడు’కి 40 ఏళ్ళు

ABN , First Publish Date - 2020-10-30T04:28:19+05:30 IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ నటించిన 'సర్దార్ పాపారాయుడు' చిత్రం అక్టోబర్ 30తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు

నటరత్న ‘సర్దార్ పాపారాయుడు’కి 40 ఏళ్ళు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ నటించిన 'సర్దార్ పాపారాయుడు' చిత్రం అక్టోబర్ 30తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. నటరత్న యన్టీఆర్ నటజీవితంలో మరపురాని మరచిపోలేని అనేక చిత్రాలున్నాయి. వాటిలో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన 'సర్దార్ పాపారాయుడు' ఒకటి. 'అడవిరాముడు' ఘనవిజయం తరువాత యన్టీఆర్ మాస్ మసాలా చిత్రాలలోనే అధికంగా నటించారు. యన్టీఆర్ సొంత చిత్రాలలో తప్ప, మిగిలిన అన్నిటా ఆయన మాస్ మసాలలతోనే సాగారు. యన్టీఆర్ లోని మహానటుడు కనుమరుగై పోయారు అంటూ విమర్శలూ వినిపించాయి. ఆ సమయంలో యన్టీఆర్ ద్విపాత్రాభినయంతో దాసరి రూపొందించిన 'సర్దార్ పాపారాయుడు' మరోమారు నటరత్నలోని మహానటుణ్ణి వెలికి తీసింది. 'నభూతో నభవిష్యతి' అన్న రీతిలో నందమూరి నటన సాగింది. అందుకే ఈ నాటికీ అభిమానుల మదిలో 'సర్దార్ పాపారాయుడు' గూడు కట్టుకొనే ఉంది. 


ప్రముఖ నిర్మాత దర్శకుడు క్రాంతి కుమార్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై 'సర్దార్ పాపారాయుడు' చిత్రాన్ని నిర్మించారు. అభిరుచి గల నిర్మాతగా పేరున్న క్రాంతి కుమార్ ఓ జర్మన్ మూవీలో ప్రపంచ యుద్ధ ఖైదీగా పట్టుపడ్డ ఓ పోరాట యోధుడు జైలు నుండి విడుదలైన తరువాత తన కుటుంబాన్ని కలుసుకోవడం కోసం తపించే కథ క్రాంతి కుమార్ ను కట్టిపడేసింది. దాసరితో కలసి, ఆ కథను తెలుగు నేపథ్యానికి అనువుగా మలిచారు. కథ విషయానికి వస్తే -  ఓ దేశభక్తుడు కొందరి వల్ల దేశద్రోహిగా ముద్రపడి జైలు శిక్ష అనుభవించి, తనను అన్యాయంగా జైలుకు పంపిన వారు సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారని గ్రహిస్తాడు. వారిపై పగసాధించాలన్న ఆవేశంలో నేరస్థుడు అన్న పేరు తెచ్చుకుంటాడు. అతణ్ణి చట్టానికి అప్పగించాలని కంకణం కట్టుకొన్న పోలీస్ అధికారి తన కన్నకొడుకే అని తెలుసుకుంటాడు. చివరకు లోకానికి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని ఆ దేశభక్తుడు కన్నుమూయడంతో 'సర్దార్ పాపారాయుడు' కథ ముగుస్తుంది. తెలుగునేలపై పోరాట యోధునిగా పేరున్న 'సర్వాయి పాపన్న' ను తలపించేలా ఈ చిత్రానికి 'సర్దార్ పాపారాయుడు' అన్న టైటిల్ ను నిర్ణయించడం గమనార్హం!. 'సర్దార్ పాపారాయుడు'లో కమర్షియల్ ఎలిమెంట్స్ వీడకుండానే, ఉదాత్తమైన కథను తెరకెక్కించారు దాసరి. కొడుకు పాత్రధారితో అభిమానులకు కావలసిన ఆటాపాటా చూపించారు. చక్రవర్తి స్వరకల్పనలో శ్రీశ్రీ, రాజశ్రీ, వేటూరి, దాసరి రాసిన పాటలు ఎంతగానో అలరించాయి. 


యన్టీఆర్‌కు తెలుగు అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. అలాగే దేశస్వరాజ్యం కోసం పోరాడిన తెలుగువీరులు అన్నా ఆయనకు ఎంతో గౌరవం. అలాంటి వీరుల్లో అల్లూరి సీతారామరాజు అంటే ప్రత్యేక అభిమానం. 1955లోనే యన్టీఆర్ 'అల్లూరి సీతారామరాజు'గా నటించాలని ఆశించారు. అందుకు తగ్గ గెటప్స్ కూడా తీయించుకున్నారు. అయితే నటునిగా ఆయన బిజీగా ఉండడంతో ఎప్పటికప్పుడు 'అల్లూరి' పాత్ర పోషణ  వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత 1974లో హీరో కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' సినిమా తెరకెక్కించడంతో యన్టీఆర్ తన అభిలాషను వదలుకున్నారు. అయితే దాసరి నారాయణరావుకు ఎలాగైనా యన్టీఆర్ తో అల్లూరి పాత్ర పోషింపచేయాలన్న తపన ఉండేది. ఆ తపనతోనే ఇందులో ఓ బుర్రకథ నేపథ్యంలో ఓ నాలుగు నిమిషాలు తెరపై యన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజుగా చూపించారు దాసరి. యన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు తెరపై అల్లూరి పాత్రలో కనిపించినా, అంతకు ముందు ఎందరు ఆ పాత్రను పోషించినా, వారిని మరపించేలా అభినయించడం విశేషం.


యన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో షూటింగ్ స్పాట్ కు రాగానే, దాసరి నారాయణరావు ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలోనే తనను ఎంతగానో అభిమానించి, ఆరాధించే తెలుగువారి రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచన యన్టీఆర్ మదిలో మెదిలింది. ఆ ఆలోచన నుండి వచ్చిన సత్సంకల్పమే ప్రజాసేవ చేయాలన్న అభిలాష. తత్ఫలితంగానే ఒకటిన్నర సంవత్సరాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పురుడు పోసుకున్న కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే అఖండ విజయం సాధించింది. ఆ తరువాత 'తెలుగుదేశం' పార్టీ విజయయాత్ర గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అప్పటి నుంచీ ఇప్పటికీ తెలుగునేలపైనే కాదు భారత రాజకీయాల్లోనూ యన్టీఆర్ పేరు మారుమోగుతూనే ఉంది.


ఈ సినిమాలో జ్యోతిలక్ష్మి చీరకట్టింది అనే సాంగ్ ను ఈ చిత్రం విడుదలైన యాభై రోజుల తరువాత జోడించారు. 1980 అక్టోబర్ 30న విడుదలైన 'సర్దార్ పాపారాయుడు' ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అప్పట్లో రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 300 రోజులు ప్రదర్శితమయింది. ఇందులో మోహన్ బాబు బ్రిటిష్ అధికారిగా కాసేపు కనిపించారు. ఈ సినిమాను అనుకరిస్తూ ఆ తరువాత పలు చిత్రాలు రూపొందడం విశేషం. ఈ చిత్రాన్ని హిందీలో 'సర్ఫరోష్' పేరుతో జితేంద్ర హీరోగా రీమేక్ చేశారు. ఈ నాటికీ 'సర్దార్ పాపారాయుడు' పేరు వినగానే అభిమానుల మది ఆనందంతో ఉప్పొంగిపోతూనే ఉంటుంది. Updated Date - 2020-10-30T04:28:19+05:30 IST