సినిమాలు వదిలేసి.. సేవ చేస్తానంటున్న హీరోయిన్

ABN , First Publish Date - 2020-10-09T22:37:25+05:30 IST

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ... సినీ నటి సనా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తాను సినిమాలు చేయనని ప్రకటించింది. సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.

సినిమాలు వదిలేసి.. సేవ చేస్తానంటున్న హీరోయిన్

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ... సినీ నటి సనా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తాను సినిమాలు చేయనని ప్రకటించింది. సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి ఓ పెద్ద లేఖలో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇక నుంచి తాను సమాజ సేవలో తరిస్తానని.. సృష్టకర్త ఆదేశాలను అనుసరిస్తానని తెలిపింది. తన ఫాలోవర్లను ఉద్దేశిస్తూ  హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పెద్ద నోట్‌ను రాసింది. గత కొన్ని రోజులుగా తన జీవితంపై తీవ్ర ఆలోచనల్లో ఉన్నట్టు ఆ లేఖలో ఆమె తెలిపింది. ఇది తన జీవితపు కీలకమైన దశ అని ఆమె చెప్పింది. తన జీవితపు అసలైన పరమార్థాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపింది. డబ్బు, పేరు కోసమేనా ఈ జీవితమని తనలో తాను ప్రశ్నించుకున్నట్టు లేఖలో రాసింది. అవసరార్థుల కోసం.. నిస్సహాయుల కోసమే తన జీవితమని పేర్కొంది. చావును ఎదుర్కోక తప్పదా, చనిపోయాక ఏం జరుగుతుందనే ఈ రెండు ప్రశ్నలు  గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నాయని తెలిపింది. ‘వాటికి సమాధానం వెతుక్కొనే పనిలో పడ్డాను. ఈ ప్రపంచంలోకి రావడం వెనక అసలు కారణం... మరణం తర్వాత చక్కని జీవితాన్ని పొందడమే. ఈ ఆలోచనల అనంతరం ఈ సినీ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నా. సమాజ సేవలో ముందుకు సాగాలనకుంటున్నా’ అని లేఖలో పేర్కొంది. 
అమూల్ మచో ‘యే తో బడా తోయింగ్’ యాడ్‌తో సనా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం పలు తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్ 6లో గట్టి పోటీనిచ్చి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ‘జయహో’ సినిమాలో కూడా నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటించింది. 


ఇదిలా ఉంటే సినీ పరిశ్రమను వదిలి ఆధ్యాత్మిక, సేవామార్గంలో నడిచిన సినీ తారలు గతంలోనూ ఉన్నారు. ఆ జాబితాలో అను అగర్వాల్, బర్ఖా మదన్, దంగల్ నటి జైరా వాసిమ్, సోఫియా హయత్ ఉన్నారు. అంతేగాక బాలీవుడ్ లెజెండరీ నటుడు వినోద్ ఖన్నా కూడా ఒకానొక సమయంలో సినిమాలకు దూరమై ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టారు.  

Updated Date - 2020-10-09T22:37:25+05:30 IST