ఇక సమంత- సామ్‌ జామ్‌

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ఓటీటీలో టాక్‌ షో చేయనున్నారు. ‘ఆహా’ ఓటీటీ కోసం ‘సామ్‌జామ్‌’ అనే షోను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ షో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రసారమవుతుంది. ఈ షోకు సంబంధించిన......

ఇక సమంత- సామ్‌ జామ్‌

(చిత్రజ్యోతి బ్యూరో): టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ఓటీటీలో టాక్‌ షో చేయనున్నారు. ‘ఆహా’ ఓటీటీ కోసం ‘సామ్‌జామ్‌’ అనే షోను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ షో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రసారమవుతుంది. ఈ షోకు సంబంధించిన ప్రొమో ఆవిష్కరణ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ‘‘ కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఏడు నెలలు ఇంటికే పరిమితం కావటం వల్ల చీకటి గదిలో ఉన్నట్లు అనిపించేది. ఈ షో వల్ల బయటకు వచ్చా. అరవింద్‌ గారు షో గురించి చెప్పినప్పుడు సవాల్‌గా అనిపించింది. రంగంలో దిగిన తర్వాత లోతు తెలిసింది. వాస్తవానికి షో కన్నా యాక్టింగ్‌ చాలా ఈజీ. ఇది నాకు ఒక ఎక్స్‌టెన్షన్‌..’’ అని సమంతా పేర్కొన్నారు. ఈ టాక్‌ షోను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని నిర్మాత అల్లు అరవింద్‌ వెల్లడించారు.


‘‘ ఈ టాక్‌ షో గతంలో చూసిన షోలు, ఇంటర్వ్యూల మాదిరిగా ఉండదు. దీనిలో కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే ఉండవు. సమాజంలోని సమస్యలను ప్రశ్నించటం.. ప్రతిభను ప్రొత్సహించటం వంటి అంశాలు కూడా ఉంటాయి. ఆహా ఓటీటీని ఒక మెట్టు ఎక్కించటానికి ఈ షో ఉపకరిస్తుంది. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేది ఈ నెల 13న జరిగే భారీ ఈవెంట్‌లో తెలియజేస్తాం..‘’ అని అల్లు అరవింద్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను చేసిన రియాలిటీ షోలతో పోలిస్తే ఇది చాలా భిన్నమైనదని దర్శకురాలు నందినీరెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘నేను ‘ఢీ’లాంటి రియాలిటీ షో చేశాను. కానీ పీసీఆర్‌ రూంలోకి ఎప్పుడూ వెళ్లలేదు. ఈ షో కోసం మొదటిసారి పీసీఆర్‌లో కూర్చున్నా. దర్శకురాలిగా అనుభవం ఉన్నప్పటికీ ఈ షో విషయంలో ఒత్తిడి ఫీలయ్యా ’’ అని ఆమె పేర్కొన్నారు. హిందీలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’, ‘కాఫీ విత్‌ కరణ్‌’, ‘నాచ్‌బలే’ వంటి షోలు నిర్వహించిన ఫాతిమా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  చిరంజీవి, అల్లుఅర్జుజూఏ, విజయ్‌ దేవరకొండ, తమన్నా, రష్మిక మందన్నా, క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ వంటి స్టార్లు ఈ షోలో సందడి చేయనున్నారు. 


మామ పేరు కోసం... 

బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా వెళ్లడానికి మావయ్య ముఖ్య కారణం. ఆయన ఆ షోకి ప్రత్యేక ఆకర్ణణ. ఆ బాధ్యత నాపై పెట్టినప్పుడు చేయగలనా లేదా అని భయమేసింది. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. అయితే ఆయన పేరు ఎక్కడా తగ్గించకూడదని వరుసగా మూడు రోజులు అన్ని ఎపిసోడ్స్‌ చూసి ప్రిపేర్‌ అయ్యా. తెలుగు డైలాగ్‌లు బట్టీ కొట్టాను. ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా షో చేశానని చాలామంది ప్రశంసించారు.  ఇది కూడా ఓ ఛాలెంజ్‌ అనే చెప్పాలి’’ అని బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం గురించి సమంత  చెప్పారు. 



Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST