లాక్‌డౌన్ విధించగానే చైతూ, నేను పరిగెత్తాం: సమంత

ABN , First Publish Date - 2020-07-31T20:08:18+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని ప్రముఖ కథానాయిక సమంత బాగా వినియోగించుకుంటోంది.

లాక్‌డౌన్ విధించగానే చైతూ, నేను పరిగెత్తాం: సమంత

లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని ప్రముఖ కథానాయిక సమంత బాగా వినియోగించుకుంటోంది. యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టింది. అలాగే తన ఇంటిపై వ్యవసాయం కూడా చేస్తోంది. వాటికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తను వ్యవసాయం చేయడానికి గల కారణాలను వివరిస్తూ సమంత తాజాగా ఓ వీడియో చేసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 


`ప్రతి ఒక్కరూ సృజనాత్మకంగా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారు. కొందరు డ్యాన్స్ చేస్తారు. కొందరు ఆర్ట్, వంట చేయడం వంటి పనులు చేస్తారు. నేను అలాంటివి చేయలేను. అయితే నేను కూడా కాస్త భిన్నమైన పని ఎంచుకున్నా. నేను దేని గురించి చెబుతున్నానో మీకు తెలుసనుకుంటున్నా. దానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇప్పటికే మీకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాను. అయితే ఈ తోటపని ఎందుకు ఎంచుకున్నానో మీకు చెప్పాలనుకుంటున్నా. లాక్‌డౌన్ గురించి తెలిసిన తర్వాత అందరిలాగానే మేం ఆశ్చర్యపోయాం. చైతూ, నేను వెంటనే సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కు పరిగెత్తాం. తెచ్చుకున్న సరుకులు ఎన్ని రోజులు వస్తాయో లెక్క పెట్టుకునే వాళ్లం. అవి అయిపోయిన తర్వాత ఏమి చేయాలోనని భయపడేవాళ్లం. ఈ విపత్కర పరిస్థితి నాకో పాఠం నేర్పింది. మనకు కావాల్సిన ఆహారాన్ని మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. దాంతో నేను స్వయంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టా` అంటూ సమంత ఆ వీడియోలో పేర్కొంది. 




Updated Date - 2020-07-31T20:08:18+05:30 IST