సాలూరి వారి సంగీతం.. తెలుగు వారందరిదీ
ABN , First Publish Date - 2020-10-11T03:53:17+05:30 IST
తన స్వరకల్పనతో తెలుగువారిని విశేషంగా అలరించిన సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. అక్టోబర్ 11న సాలూరి రాజేశ్వరరావు జయంతి
తన స్వరకల్పనతో తెలుగువారిని విశేషంగా అలరించిన సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. అక్టోబర్ 11న సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన స్వరకల్పనలోని మధురామృతాన్ని మననం చేసుకుందాం. బృందావనం అందరిదీ అయినట్టు, అందులోని గోవిందుడు అందరివాడే అయినట్టు సాలూరి రాజేశ్వరరావు సంగీతం తెలుగు వారందరిదీ. ఇక ఆ మధురామృతం తరతరాలు మననం చేసుకుంటూనే ఉన్నాయి. ఆ మననంలో మన మనస్సులో మల్లెల మాలలు ఊగుతున్నాయి.
నిజమే... సాలూరి వారి సంగీతం వింటే ఎవరి మనసుననైనా మల్లెల మాలలు ఊగ వలసిందే. చిత్రకథకు అనువుగా ఆయన పేర్చే బాణీలు వీనులకు విందు చేస్తూ తరతరాలకూ తరగని మధురామృతాన్ని మన సొంతం చేశాయి. సాలూరి వారి సంగీతం ఈ తరం వారిని సైతం పులకింప చేస్తూనే ఉంది. ఆయన పాటలను ఎంతోమంది నవతరం సంగీత దర్శకులు రీమిక్స్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఆయన పంచిన మధురామృతం ఈ నాటికీ సంగీతాభిమానులకు సంతోషం పంచుతూనే ఉంది. భావి సంగీతకళాకారులు ఆయన పాటలతోనే సాధన చేస్తూ సాగుతున్నారు.