అది కూడా భారం అనుకుంటే ఎలా: సాయి కుమార్

ABN , First Publish Date - 2020-04-20T23:33:43+05:30 IST

కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని..

అది కూడా భారం అనుకుంటే ఎలా: సాయి కుమార్

కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని నటుడు సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘‘వెంటిలేటర్ కంటే మాస్క్ మంచిది. ఐసీయూ కంటే ఇల్లు మంచిది. చికిత్స కన్నా నివారణే ఉత్తమం.’’ అని ట్వీట్ పోస్ట్ చేశారు. అంతేకాదు తన సందేశాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు. 


‘‘అందరికీ నమస్కారం. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే.. నడిచే దేవుళ్లై ఎవరు వచ్చినా, ఎప్పుడొచ్చినా, విసుగు, విరామం లేకుండా కరోనా పాజిటివ్ రోగుల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వైద్యులం కాదు మనం. క్షేత్ర పాలకులై దేవాలయంలాంటి ఈ సమాజాన్ని కరోనా నుంచి రక్షించడమే కర్తవ్యంగా మన కుటుంబాల కోసం వారి కుటుంబాలకు దూరంగా రోడ్లపై నిలబడి డ్యూటీలు చేస్తున్న పోలీసులం కాదు. స్వచ్ఛాగ్రహులై ఇల్లు, వాకిలి విడిచి ఊరు, వాడా, పరిసరాలను శుభ్ర పరిచి కరోనాను ఊడ్చి పారేయడానికి చమోటోడ్చి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులం కాదు మనం. ఊరు కాని ఊళ్లో రాష్ట్రం కాని రాష్ట్రంలో పని చేస్తూ ఈ లాక్‌డౌన్‌లో చిక్కికుపోయి బిక్కు బిక్కుమని బతుకుతున్న వలస కార్మికులం కాదు మనం. ప్రజా సేవకులై, ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా కరోనాను కట్టడి చేయడమే ధ్యేయంగా అహో రాత్రులు పని చేస్తున్న ప్రధానులం, ముఖ్యమంత్రులం, ప్రజాప్రతినిధులం కాదు మనం. అదృష్టవంతులం. నీడ పట్టున కూర్చుని, కాలు మీద కాలు వేసుకుని, వేడి వేడి కాఫీలు, టీలు తాగుతూ కావాల్సినవి వండించుకుని తింటూ.. టీవీలో ప్రోగ్రాంలు, నెట్‌లో సినిమాలు చూస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైకులు కొడుతూ, కామెంట్లు పెడుతూ మన ఇంట్లో మన వాళ్లతో దర్జాగా ఉంటున్న అదృష్టవంతులం. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది కూడా మనం భారం అనుకుంటే ఎలా. ఇంట్లో ఉండటమే మన బాధ్యత. అదే మనకు మన దేశానికి భద్రత.’’ అంటూ సాయి కుమార్ సూచించారు. 



Updated Date - 2020-04-20T23:33:43+05:30 IST