ఒకపక్క సీబీఐ.. మరోపక్క ఈడీ.. రియా తాజా నిర్ణయం ఏంటంటే..

ABN , First Publish Date - 2020-08-07T16:35:44+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై...

ఒకపక్క సీబీఐ.. మరోపక్క ఈడీ.. రియా తాజా నిర్ణయం ఏంటంటే..

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై రియా చక్రవర్తి ఎట్టకేలకు స్పందించింది. ఈడీ నోటీసుల ప్రకారం రియా నేడు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయని, సుప్రీంలో తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడాన్ని వాయిదా వేయాలని ఈడీని రియా కోరింది. ఇప్పటికే సీబీఐ రియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.


ఈడీ.. సుశాంత్ రాజ్‌పుత్ కేసులో తాజాగా మరో ఇద్దరికి కూడా సమన్లు పంపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీకి సమన్లు పంపిన ఈడీ నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టం చేసింది. సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా నోటీసులు పంపిన ఈడీ రేపటిలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. 


ఇదిలా ఉంటే.. తనపై బీహార్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మహారాష్ట్రకు బదిలీ చేయలని కోరుతూ రియా చక్రవర్తి వేసిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో గత బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న బిహార్‌ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు.


కృష్ణ కిషోర్‌ సింగ్‌ తరపు న్యాయవాది వాదిస్తూ మహారాష్ట్ర పోలీసులు సాక్ష్యాలను రూపుమాపాలని చూస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించి బిహార్‌ పోలీసులతో సహకరించాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర తరపున హాజరైన న్యాయవాది వాదిస్తూ సుశాంత్‌ ఆత్మహత్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం బిహార్‌ పోలీసులకు లేదన్నారు. వాదనలను విన్న సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-08-07T16:35:44+05:30 IST