‘నాకూ, వాళ్లకు మధ్య దయచేసి గొడవలు పెట్టకండి..’

ABN , First Publish Date - 2020-02-14T21:17:24+05:30 IST

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన మాజీ భార్య రేణూదేశాయ్‌కు, తన పిల్లలకు హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనిచ్చారనే

‘నాకూ, వాళ్లకు మధ్య దయచేసి గొడవలు పెట్టకండి..’

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన మాజీ భార్య రేణూదేశాయ్‌కు, తన పిల్లలకు హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనిచ్చారనే వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పుణె నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రేణు కోసం పవన్ ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేశారని కొన్ని వెబ్‌సైట్లు రాశాయి (ఆంధ్రజ్యోతి కాదు) . ఈ వార్త బాగా వైరల్ కావడంతో సోషల్ మీడియా ద్వారా రేణు స్పందించారు. ఆ ఫ్లాట్‌ను తన కష్టార్జితంతో కొనుకున్నానని, దానికి తన మాజీ భర్తకు ఎలాంటి సంబంధమూ లేదని ఆమె ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. 


`నిన్నటి నుంచి నాకు మీడియా నుంచి, స్నేహితుల నుంచి ఎన్నో మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్లు చెప్పింది విని నాకు చాలా బాధనిపించింది. అందుకే ఈ వివరణ...

నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా ఎంతగానో శ్రమిస్తున్నాను. పోరాటం చేస్తున్నాను.

నేనిప్పటివరకూ కనీసం మా తండ్రి నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయమూ ఆశించలేదు. 


అలాగే,  నా మాజీ భర్త నుంచి కూడా ఇప్పటివరకూ ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసత్య వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టూ, ప్రచారం చేస్తున్నట్టూ ఇప్పుడు హైదరాబాద్‌లో మా ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ భంగం కలిగుతుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ, నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధమూ ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. ఒక వార్త నిజమో, కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడకోసమో ప్రచురించి ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా? ప్రజలు ఈ అసత్య వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం చెదిరిపోదా? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది. ఎంతలా చితికిపోతుంది.


దయచేసి ఆలోచించండి.. ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లుల జీవన గమనానికీ, పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి` అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-02-14T21:17:24+05:30 IST