నాన్నకు చెప్పడానికి బాత్రూమ్‌లో రిహార్సల్స్‌ చేశా!

ABN , First Publish Date - 2020-05-12T05:27:08+05:30 IST

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథాయాస్‌ బోయ్‌తో తాప్సీ ప్రేమలో ఉన్నారనే మాట ఇప్పటికి కాదు, ఎప్పటిదో! ముంబయ్‌ మీడియాకి తల్లి నిర్మల్‌ జీత్‌ పన్నుతో...

నాన్నకు చెప్పడానికి బాత్రూమ్‌లో రిహార్సల్స్‌ చేశా!

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథాయాస్‌ బోయ్‌తో తాప్సీ ప్రేమలో ఉన్నారనే మాట ఇప్పటికి కాదు, ఎప్పటిదో! ముంబయ్‌ మీడియాకి తల్లి నిర్మల్‌ జీత్‌ పన్నుతో కలిసి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నానని అంగీకరించారామె. అయితే... మథాయాస్‌ బోయ్‌ పేరు మాత్రం చెప్పలేదు. తన జీవితంలో (డేటింగ్‌ చేసిన) అబ్బాయిల గురించి తల్లికి తెలియదన్నారు. ప్రేమ, డేటింగ్‌, రిలేషన్‌షిప్‌ గురించి తాప్సీ పన్ను మాట్లాడుతూ ‘‘ఓ అబ్బాయి విషయంలో నేను కచ్చితమైన అభిప్రాయంతో లేనప్పుడు తల్లిదండ్రులకు చెప్పడం ఎందుకు? అందుకనే, నా జీవితంలో అబ్బాయిల గురించి వాళ్లకు తెలియదు. నేను వందశాతం స్థిర అభిప్రాయానికి వచ్చినప్పుడు చెప్తా. మీడియా అడిగినప్పుడు నేనేదీ దాచలేదు. ఎందుకంటే... అబద్దాలు చెప్పడం, నిజం దాచడానికి కథలు చెప్పడం నాకు కష్టమైన పని. ఇప్పుడు నా జీవితంలో ఎవరున్నారో నా కుటుంబానికి తెలుసు. అందుకని, అందరి ముందు చెప్పడానికి నేనేమీ భయపడను. నేను పెళ్లి చేసుకోవాలని అమ్మానాన్న కోరుకుంటున్నారు. కానీ, పెళ్లి చేసుకోమని ఎప్పుడూ చెప్పలేదు’’ అన్నారు.


అమ్మ ఓకే అంది కానీ...

కథానాయికగా అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినదీ తాప్సీ గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఏదీ దాచలేదు. మోడలింగ్‌ చేస్తున్నప్పుడు నటించే అవకాశం వచ్చింది. ‘కథానాయికగా చేసే అవకాశం వచ్చింది. ప్రయత్నించి చూస్తా’ అని చెప్పా. అమ్మకు ఏ సమస్య లేదు. కానీ, నాన్నకు ఎలా చెప్పాలి?  ఏ విధంగా ఒప్పించాలి? అనేది సమస్య. నాన్నకు చెప్పడానికి నేను బాత్రూమ్‌లో రిహార్సిల్స్‌ చేశా. అమ్మ ఎంతో మద్దతు ఇచ్చింది. ఇంటి ఖర్చులకు నాన్న ఇచ్చిన డబ్బుల్లో కొంత దాచేది. దాంతో తొలి ఫొటోషూట్‌ చేయించుకున్నా. అందుకోసం, ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుండి నోయిడా వెళ్లాం’’ అని వివరించారు. సోషల్‌ మీడియాలో తన పోస్టుల కింద ప్రతి కామెంట్‌నూ తల్లిదండ్రులు చదువుతారని, తాను వద్దని చెప్పినా వినరనీ వెల్లడించారామె. తన కంటే చెల్లెలు షగున్‌ పన్ను అమ్మానాన్న మాట ఎక్కువ వింటుందనీ, వాళ్లు చెప్పిన పనులు చేస్తుందనీ, బాధ్యతగా ఉంటుందనీ తాప్సీ తెలిపారు.


తాప్సీని చూసి ఆశ్చర్య పోతుంటా!

నిర్మల్‌జీత్‌ పన్ను

తెరపై తాప్సీని చూస్తే తాను ఆశ్చర్య పోతుంటానని నిర్మల్‌జీత్‌ పన్ను తెలిపారు. చిన్నతనంలో తాప్సీకి నటన రాదని తెలిపారు. ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నతనం నుండి తాప్సీ డ్యాన్స్‌ బాగా చేసేది. కానీ, యాక్టింగ్‌ పురుగు మాత్రం తనలో లేదు.   అయితే, ఇప్పుడు తను నటించిన సినిమాలు చూస్తుంటే... ఇంత చక్కగా నటించడం ఎలా వచ్చిందా? అని ఆశ్చర్య పోతుంటాను. కథానాయికగా తాప్సీకి అవకాశం వచ్చినప్పుడు మా ఆయనతో నేనేమీ చెప్పలేదు. సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత, తాప్సీయే స్వయంగా వాళ్ల నాన్నతో మాట్లాడి, ఒప్పించింది. నాకు మా అమ్మాయిపై నమ్మకం ఎక్కువ. నేను టెన్షన్‌ పడతానని కెరీర్‌ స్టార్టింగ్‌లో తన ఇబ్బందులు ఏవీ నాకు చెప్పలేదు’’ అన్నారు. తాప్సీ గురించి వచ్చే ప్రతి వార్తను చదవుతానని ఆమె అన్నారు. ఇక, కూతురి పెళ్లి గురించి నిర్మల్‌జీత్‌ మాట్లాడుతూ ‘‘ఆ విషయం తాప్సీతో మాట్లాడాను. అయితే... జీవితంలో సెటిల్‌ అవ్వాలని అనుకున్నప్పుడు అవుతుంది. పెళ్లి చేసుకోమని నేను ఒత్తిడి చేయడం లేదు’’ అన్నారు.

Updated Date - 2020-05-12T05:27:08+05:30 IST