భోజ్‌పురి టు పార్లమెంట్‌

ABN , First Publish Date - 2020-10-18T15:47:09+05:30 IST

రవికిషన్‌... బిగ్‌బాస్‌ రన్నరప్‌.. టీవీ పర్సనాలిటీ. భోజ్‌పురి సూపర్‌స్టార్‌... టాలీవుడ్‌లో విలన్‌... ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడు... జీవితం తిప్పిన ప్రతి మలుపునూ

భోజ్‌పురి టు పార్లమెంట్‌

రవికిషన్‌... బిగ్‌బాస్‌ రన్నరప్‌.. టీవీ పర్సనాలిటీ. భోజ్‌పురి సూపర్‌స్టార్‌... టాలీవుడ్‌లో విలన్‌... ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడు... జీవితం తిప్పిన ప్రతి మలుపునూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ పయనిస్తున్నాడు. ప్రస్తుత. లోక్‌సభలో గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తూ దమ్మున్ననాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు...


‘చిన్నప్పుడు స్కూల్‌ అంటే అస్సలు నచ్చేది కాదు. వెళితే లేట్‌గా వెళ్లేవాడిని.. లేకపోతే డుమ్మాకొట్టేవాడిని. టీచర్లు నా ప్రవర్తనను చూసి విసిగిపోయేవారు. పార్లమెంటులో అడుగుపెట్టిన తరవాతే తెలిసింది చదువుకు ఉన్న శక్తి ఏమిటో. ఇప్పుడు ఆఫీసుకు అందరికంటే ముందు వచ్చి, అందరూ వెళ్లిపోయాక వెళుతున్నా. స్కూల్‌ రోజులలోని నిర్లక్ష్యం నాకు క్రమశిక్షణను నేర్పింద’ని అంటారు 51 ఏళ్ల రవి కిషన్‌.


తండ్రి పూజారి...

రవీంద్ర శ్యామ్‌నారాయణ్‌ శుక్లా అలియాస్‌ రవి కిషన్‌ పుట్టింది ముంబయిలోని శాంతాక్రూజ్‌లో. కుటుంబంలోని అయిదు మంది పిల్లల్లో తను ఆఖరువాడు. వాళ్ల నాన్న పూజారి, సోదరుడితో కలిసి పాల వ్యాపారం చేస్తుండేవాడు. అన్నదమ్ములిద్దరికీ గొడవ రావడంతో పాల వ్యాపారం మూతపడింది. వేరే దారిలేక కుటుంబంతో సహా ఉత్తరప్రదేశ్‌లోని సొంతూరు జౌన్‌పూర్‌కి వచ్చేశాడు తండ్రి. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించాలని అనుకున్నాడు. అప్పటికి రవి వయసు పదేళ్లు. 

అందమైన ముంబయిని ఎందుకు వదిలేశారో ఆ చిన్న బుర్రకి అర్థం కాలేదు. ఆ పల్లె వాతావరణం నచ్చేది కాదు. స్కూలంటే మరీ చిరాకు. ముంబయి గురించి కలలు కంటూ సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ముఖ్యంగా అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల్ని బాగా చూసేవాడు. అక్కడ రామ్‌లీల నాటకాలు ఎక్కువ వేసేవారు. ఓసారి సీతగా వేషం కట్టాడు. మంచి పేరొచ్చింది. కానీ తండ్రేమో నాటకాలను కట్టిపెట్టి పాల వ్యాపారం చేయమనేవాడు. ‘ఆ పని మాత్రం చేయన’ని రవి మొండికేస్తే వీపు విమానం మోత మోయించేవాడు. 


ఇంటి నుంచి పారిపోయి...

రవి సినిమాల పిచ్చి గురించి తల్లికి తెలుసు. అతడికి పదిహేడేళ్ల వయసప్పుడు అమ్మ ఇచ్చిన అయిదు వందల రూపాయలతో ముంబయికి పారిపోయి వచ్చేశాడు. చిన్నప్పుడు నివసించిన 10 -  12 చదరపు అడుగుల ఇంటికే వెళ్లాడు. స్నేహితుల సహాయంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1992లో ‘పీతాంబర్‌’ అనే ఓ బీగ్రేడ్‌ బాలీవుడ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ పాత్రకు అతడు అందుకుంది అయిదు వేల రూపాయలే. అదే అతడి తొలి సంపాదన. సినిమాల్లో నత్త నడకలా ప్రయాణం సాగింది. భోజ్‌పురిలో అవకాశం వచ్చింది. బాలీవుడ్‌ తెరపై వెలిగిపోవాలనుకున్నాడు. కానీ గాడ్‌ఫాదర్లు లేరు. ఎన్నేళ్లు గడిచినా నిలదొక్కుకోవడమే కష్టమైంది. ఎటూ తేల్చుకోలేక అమ్మకి ఫోన్‌ చేశాడు. వాళ్ల మాతృభాష అవధికి భోజ్‌పురికి దగ్గర పోలికలు ఉంటాయి. ‘నీ సొంతూరు ప్రజల కోసం భోజ్‌పురిలో నటించమ’ని సలహా ఇచ్చింది తల్లి. అలా 2003 నుంచి భోజ్‌పురిలో నటించడం మొదలుపెట్టాడు. అక్కడ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఆయా ప్రాంతాల్లో పుట్టిన పిల్లలకి రవికిషన్‌ పేరును పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అతడి పాపులారిటీ ఏమిటో. 


సల్మాన్‌ఖాన్‌ ‘తేరేనామ్‌’తో హిందీలో మంచి పేరుతెచ్చుకున్నాడు. హిందీ బిగ్‌బాస్‌ 1లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. రియాల్టి షోలలో కూడా చేశాడు. బిజీ స్టార్‌ అయ్యాడు. వెనక్కి చూడాల్సిన అవసరమే రాలేదు. భోజ్‌పురి, హిందీ, తెలుగు, కన్నడం, గుజరాతీ, తమిళం... ఇలా పలు భాషల్లో ఇప్పటికి దాదాపు 400 చిత్రాల్లో నటిస్తూ చక్కటి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర అయినా అందులో పూర్తిగా వొదిగి పోవడమే రవికిషన్‌ నైజం. అదే అతడిని ఇంకా సినిమాల్లో నిలబెట్టింది. ఇప్పుడు రాజకీయాల్లో అసలుసిసలైన విలన్లను తట్టుకుని.. ఈ విలన్‌ ఎలా నిలబడతాడో చూడాలి మరి. 


రేసు గుర్రం విలన్‌

మద్దాలి శివారెడ్డి... ‘రేసుగుర్రం’లో  ఏ క్షణంలో ఆ పాత్ర చేశాడో కానీ.. అదే పేరు తెలుగు నేలపై స్థిరపడింది. ఆ చిత్రంలో నటించి ఆరేళ్లు దాటి పోయినా రవికిషన్‌ కన్నా శివారెడ్డిగానే ఇక్కడి ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. ‘కిక్‌ 2’, ‘సుప్రీమ్‌’, ‘రాధ’, ‘ఎంఎల్‌ఏ’, ‘సాక్ష్యం’, ‘సైరా నరసింహారెడ్డి‘ ... ఇలా అనేక తెలుగు సినిమాల్లో విలన్‌గా అవకాశాలు కొట్టేశాడు. నేడు టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన విలన్లలో రవికిషన్‌ ఒకరు. 


పుట్టుకతోనే రాజకీయాలు

‘ఉత్తరప్రదేశ్‌, బిహార్లలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకి రాజకీయాలు అర్థం అవుతాయి. ఇక్కడ రిక్షావాలా కూడా రోజూ పూర్తి దినపత్రిక చదివి తన చుట్టూ జరుగుతోన్న పరిణామాల్ని అర్థం చేసుకుంటాడు’ అని చెప్పే రవికిషన్‌ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున తన జౌన్‌పూర్‌ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు గోరఖ్‌పూర్‌ నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆప్తుడిగా పేరుతెచ్చుకున్నాడు.


ప్రేమ వివాహం

స్నేహితురాలు ప్రీతిని ప్రేమవివాహం చేసుకున్నాడు రవి కిషన్‌. ఈ జంటకు ముగ్గురు కూతుళ్లు, ఒక బాబు. 

పరిశ్రమలో సైఫ్‌ అలీ ఖాన్‌ మంచి మిత్రుడు. గత పద్దెనిమిదేళ్లుగా వీళ్ల స్నేహం కొనసాగుతోంది.

జౌన్‌పూర్‌ సమీపంలోని బైసూయిన్‌ వీళ్ల స్వగ్రామం. కేవలం ఇరవై కుటుంబాలు నివసించే కుగ్రామం ఇది. ఇక్కడే రవికిషన్‌ తల్లిదండ్రులు నివసిస్తున్నారు. వీరి కోసం అక్కడ పెద్ద మొహల్లా నిర్మించాడు రవి. ఈ దారిలో వెళ్లే పర్యాటకులు సూపర్‌స్టార్‌ రవికిషన్‌ ఇల్లు అంటూ ఫోటోలు తీసుకుంటుంటారట.

ముంబయిలోని తన చిన్న నాటి ఇంటిని కూడా కొనుగోలు చేసి విస్తరించాడు.

శివ భక్తుడు. బాగా డ్యాన్స్‌ చేస్తాడు. 

ఆడపిల్లలపై అరాచకాలు చేసే వారికి వణుకుపుట్టించే కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించాలి... నేను కూడా తండ్రినే..’ అంటూ  లోక్‌సభలో డిమాండ్‌ చేశాడు.

Updated Date - 2020-10-18T15:47:09+05:30 IST