‘అయలాన్‌’ చిత్రంలో నటిస్తున్నా: రకుల్‌

ABN , First Publish Date - 2020-06-29T20:57:48+05:30 IST

శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ‘అయలాన్‌’ చిత్రం నుంచి తాను వైదొలగలేదని, షూటింగ్‌కు సక్రమంగా హాజరవుతున్నానని అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు.

‘అయలాన్‌’ చిత్రంలో నటిస్తున్నా: రకుల్‌

శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ‘అయలాన్‌’ చిత్రం నుంచి తాను వైదొలగలేదని, షూటింగ్‌కు సక్రమంగా హాజరవుతున్నానని అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. శివ కార్తికేయన్‌, ఇషా కోప్పికర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, యోగిబాబు తదితరులు నటిస్తున్న చిత్రం ‘అయలాన్‌’ ఈ చిత్రానికి ‘ఇండ్రు నేట్రు నాళై’ చిత్రాన్ని అందించిన రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌కు రకుల్‌ సక్రమంగా హాజరుకావటం లేదని, కరోనా వైరస్‌ సాకుగా చెప్పి షూటింగ్‌లకు రావటమే లేదని, దీంతో ఆ చిత్రం నుంచి ఆమెను తొలగించనున్నారని సామాజిక ప్రసార మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లను దర్శకుడు రవి కుమార్‌, నటి రకుల్‌ తీవ్రంగా ఖండించారు. 


దర్శకుడు రవికుమార్‌ మాట్లాడుతూ రకుల్ర్‌పీత్‌ సింగ్‌ షూటింగ్‌కు సక్రమంగా హాజరై సన్ని వేశాలు చక్కగా పండించేందుకు కృషిచేసి యూనిట్‌ సభ్యులందరికీ సహకరించారని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిందే తప్ప ఆమె వల్ల కాదని వివరణ ఇచ్చారు. రకుల్‌ తన ట్విట్టర్‌లో దేశమంతటా కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయని, ఈ సమయంలో ఎక్కడ షూటింగ్‌ జరిగిందీ, తానెక్కడకు వెళ్లిందీ పుకార్లు పుట్టించినవారే స్పష్టం చేయాలన్నారు. తనకు మద్దతుగా దర్శకుడు రవికుమార్‌ ట్వీట్‌ చేసినందుకు ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు.

Updated Date - 2020-06-29T20:57:48+05:30 IST