బ్రిటీషర్లు.. ప్రపంచానికి ఎన్నో నేర్పారు: పూరీ జగన్నాథ్

ABN , First Publish Date - 2020-11-14T17:11:04+05:30 IST

మంచి విషయాలను శత్రువుల నుంచైనా నేర్చుకోవచ్చని, బ్రిటీషర్ల నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌.

బ్రిటీషర్లు.. ప్రపంచానికి ఎన్నో నేర్పారు: పూరీ జగన్నాథ్

మంచి విషయాలను శత్రువుల నుంచైనా నేర్చుకోవచ్చని, బ్రిటీషర్ల నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `బ్రిటీష్` గురించి మాట్లాడారు. 


`మనందరికీ బ్రిటీష్ అంటే పడదు. సరే.. గతం గత:.. దాన్ని వదిలేద్దాం. కానీ బ్రిటీష్ వాడి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇవాళ యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్రిటీషర్ల జనాభా కేవలం 6.5 కోట్లు. ఇప్పుడే అంత తక్కువగా ఉంటే.. 16వ శతాబ్దంలో వారి జనాభా 50 లక్షలు కూడా ఉండదు. అందులో నావికులు, సైనికులు అందరూ కలిసి 50 వేలు కూడా ఉండరు. అయినా రాయల్ నేవీ అనేవారు. పరిమాణం ప్రకారం చూస్తే వారి కంటే మన దేశం 13 రెట్లు పెద్దది. అయినా వాళ్లు వచ్చి మనదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఎలా..? మనం హిమాలయాలు ఎక్కి అవతల ఏముందో చూడం. సరదాగా శ్రీలంక కూడా వెళ్లం. నూతిలో కప్పలం. కానీ, అతి తక్కువ జనభా ఉన్న చిన్న దేశం నుంచి బ్రిటీష్ వాళ్లు వచ్చి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. 22 దేశాలను తప్ప ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలను పాలించారు. ప్రపంచంలో అందరికీ షర్టు, ఫ్యాంటూ వేయడం నేర్పారు. ఇంగ్లీష్ నేర్పారు. ఆక్రమించిన దేశాలన్నింటినీ సొంత దేశాల్లా భావించి అభివృద్ధి చేశారు. రోడ్లు వేశారు. రైల్వే ట్రాక్‌లు వేశారు. నట్లు, బోల్టులతో సహా అన్నింటినీ లండన్ నుంచే తెచ్చి అన్ని దేశాల్లో పరిశ్రమలు స్థాపించారు. కార్లు, ట్రామ్‌లు, తుపాకులు, షిప్‌యార్డులు, విమానాశ్రయాలు నెలకొల్పారు. తము ఆక్రమించుకున్న దేశాల్లో చాలా మందిని లండన్ పంపించి బారిష్టర్ చదవించారు. వ్యవస్థను అర్థం చేసుకోనేలా చేశారు. కొన్ని వందల దేశాలకు లండన్ నుంచి రోజూ కొన్ని వందల షిప్‌లు ప్రయాణించేవి. ఇన్ని చేయాలంటే బిట్రీష్ వాడికి ఎంత కసి ఉండాలి. ఎంత విజన్ ఉండాలి.


ఇలా అన్ని దేశాల కోసం వాళ్లు చేసిన అప్పులు, ప్రతి దేశంలోనూ స్థానిక ప్రజల స్వాతంత్ర్య పోరాటం, రెండో ప్రపంచ యుద్ధంలో ఎదురు దెబ్బల కారణంగా వారికి చిరాకు వచ్చింది. అందువల్ల ఒక్కో దేశానికి వరుసగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ పోయారు. అయితే ఒక్క దేశ ప్రజలు మాత్రం..`మాకు స్వాతంత్ర్యం వద్దు. మమ్మల్ని పాలించండి. లేదంటే మా దేశంలో అభివృద్ధి ఆగిపోతుంద`ని అడిగారు. దాంతో ఆ ఒక్కదేశాన్ని ఆధీనంలో ఉంచుకుని తము అనుకున్న విధంగా అభివృద్ధి చేసి 1997లో స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లిపోయారు. ఆ దేశం హాంకాంగ్. అందుకే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందింది. బ్రిటీష్ వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది అడ్మినిస్ట్రేషన్. మనం పది ఊళ్లలో పది ఆఫీసులు పెట్టినా సరిగ్గా పనిచేయలేకపోతున్నాం. అలాంటిది, వందల దేశాలను పాలించాలంటే మాటలు కాదు. వాళ్లు ఎంత క్రమశిక్షణగా పనిచేశారో అర్థం చేసుకోండి. మంచి విషయం మన శత్రువులో ఉన్నా నేర్చుకోవాలి. మనం బ్రిటీషర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చ`ని పూరీ పేర్కొన్నారు. 



Updated Date - 2020-11-14T17:11:04+05:30 IST