రీమేక్ చేయాలంటే ఆ ఫీలింగ్ రావాలి: దిల్‌రాజు

ABN , First Publish Date - 2020-02-04T00:46:12+05:30 IST

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో‌హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జాను’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల

రీమేక్ చేయాలంటే ఆ ఫీలింగ్ రావాలి: దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో‌హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జాను’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రీమేక్‌ చిత్రాలకు మీరు వ్యతిరేకమా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫీలింగ్ రావాలి అన్నారు. ఈ ఏడాది మూడు సినిమాలు రీమేక్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కాదు.. దిల్ సినిమా నుండి స్క్రిప్ట్‌లో కూర్చునేవాడిని. అలా ట్రావెల్ చేస్తే ఆ మేజిక్ బాగుంటుంద‌ని నేను ఎప్పుడూ రీమేక్‌ల గురించి ఆలోచించ‌లేదు. మ‌ధ్య‌లో ‘ప్రేమ‌మ్‌’, ‘బెంగ‌ళూర్ డేస్’ చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నాను. వాటిని చూసిన‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. ముఖ్యంగా ‘బెంగళూరు డేస్’ సినిమా రీమేక్ చేయ‌డానికి చాలా వ‌ర్క‌వుట్ చేశాను. అప్పట్లో నాని, శ‌ర్వా ఇద్ద‌రూ ఆ సినిమాలో చేస్తామ‌ని చెప్పారు. అయితే మూడో క్యారెక్ట‌ర్ ఎందుక‌నో మాకు సంతృప్తిని ఇవ్వలేదు. సరే! ఎందుక‌లే అని డ్రాప్ అయ్యాం. త‌ర్వాత ‘ప్రేమ‌మ్’ చేద్దామ‌ని అనుకుంటే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ.. ‘అన్నా! నేను రీమేక్ చేసుకుంటా’ అన్నాడు. స‌రేనని అప్పుడు కూడా కామ్ అయ్యాను. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫీలింగ్ రావాలి. ఈ సినిమాను మ‌నం మిస్ అవ‌కూడ‌ద‌నే ఫీలింగ్ వ‌చ్చిన‌ప్పుడే రీమేక్ చేయాలి. యాదృచ్చికంగా ఈ ఏడాది 3 సినిమాలు రీమేక్ చేస్తున్నాం. త‌మిళ ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’గా రీమేక్ చేస్తుంటే.. తెలుగులో హిట్ట‌యిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. అలాగే హిందీ చిత్రం ‘పింక్‌’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఈ మూడు హార్ట్ ట‌చింగ్ మూవీస్‌. దేనికి అదే ప్ర‌త్యేక‌మైన సినిమా.


‘జాను’ విష‌యానికి వ‌స్తే.. త‌మిళ చిత్రం ‘96’ టీజ‌ర్‌ను చూడ‌గానే ఆస‌క్తిగా అనిపించింది. అప్ప‌టి నుండి నేను దాన్ని ఫాలో అవుతూ వ‌చ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి ద్వారా నిర్మాత‌ను సంప్ర‌దించాను. ప్రివ్యూ చూశాను. నేను, హ‌రి సినిమా చూశాం. నాకు త‌మిళ్ పెద్ద‌గా అర్థం కాదు.. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు విప‌రీత‌ంగా ఎక్కేసింది. థియేటర్ బ‌య‌ట‌కు రాగానే.. అక్క‌డే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాల‌నుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది..’’ అని తెలిపారు. 

Updated Date - 2020-02-04T00:46:12+05:30 IST