థియేటర్లు తెరవడానికి కొందరు సిద్ధం!

ABN , First Publish Date - 2020-05-14T11:12:58+05:30 IST

షరతులకు లోబడి థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ ఎగ్జిబిటర్‌, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ ట్రెజరర్‌ విజేందర్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణలో తనతో పాటు దాదాపు 40 మంది థియేటర్‌...

థియేటర్లు తెరవడానికి కొందరు సిద్ధం!

షరతులకు లోబడి థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ ఎగ్జిబిటర్‌, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌  ట్రెజరర్‌ విజేందర్‌ రెడ్డి చెప్పారు.  తెలంగాణలో  తనతో పాటు దాదాపు 40 మంది థియేటర్‌ యజమానులు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆయన తెలిపారు. అయితే థియేటర్‌ యజమానులకు, లీజ్‌ తీసుకొన్న వాళ్లకీ ఈ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయని  విజయేందర్‌ రెడ్డి చెప్పారు. ఒక ఎగ్జిబిటర్‌గా ఆయన తన సొంత అభిప్రాయం వెల్లడిస్తూ ‘‘జనం వస్తారో రారో అనే భయంతో లీజుదారులు థియేటర్లు తెరవడానికి వెనుకంజ వేస్తున్నారు. మాకు అలాంటి భయాలు లేకపోవడంతో ఓపెన్‌ చెయ్యడానికి  సిద్ధంగా ఉన్నాం. థియేటర్‌ తెరిచినా, మూసినా నేను ప్రతి నెలా లక్షా అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. కొంతమంది లీజుదారులు సిబ్బంది జీతాల్లో కోత విధించినా నేను ఎప్పటిలాగా పూర్తి జీతం చెల్లిస్తున్నాను.


అందుకే ప్రభుత్వం అనుమతిస్తే థియేటర్‌ను నడపడానికి  సిద్ధంగా ఉన్నా. చిన్న సినిమాలను సైతం నా థియేటర్‌లో పర్సంటేజ్‌ పద్దతిలో ఆడడానికి నేను రెడీ.  వచ్చే ఆదాయంలో పన్నులు పోను మిగతాది  చెరి సగం పంచుకొంటాం. దీని వల్ల నాకు వచ్చే నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది అయితే లీజుదారులు మాత్రం  వెంటనే థియేటర్లు ఓపెన్‌  చేయడానికి  సిద్ధంగా లేరు. షూటింగ్స్‌ మొదలై, కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాక ఆ పని చేస్తే బాగుంటుందని వాళ్ల అభిప్రాయం. మాకూ, లీజుదారులకు మధ్య ఉన్న తేడా ఇదే! ప్రభుత్వం ఆదేశిస్తే  సీటుకీ సీటుకీ మధ్యలో గ్యాప్‌ ఉంచడానికి కూడా  థియేజర్‌ యజమానులు సిద్ధంగా ఉన్నారు. అలాగే శానిటైజేషన్‌  విషయంలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాం.  టిక్కెట్‌ కౌంటర్ల దగ్గర, క్యాంటీన్‌లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటాం.  మరో విషయమేమింటే థియేటర్‌ తెరవగానే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని మేం అనుకోవడం లేదు.  క్రమంగా పెరుగుతారు.  ప్రేక్షకులు పూర్తి స్థాయిలో రావడానికి రెండు మూడు నెలలన్నా పడుతుంది’’ అన్నారు విజేందర్‌ రెడ్డి. నష్టాల నుంచి తప్పించుకోనేందుకు కొందరు లీజుదారులు  థియేటర్లకు తిరిగి యజమానులకు అప్పగించే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు.

Updated Date - 2020-05-14T11:12:58+05:30 IST