పాటలతో క్రిస్మస్ కానుక అందిస్తోన్న 'ప్రాణం' కమలాకర్.
ABN , First Publish Date - 2020-11-18T22:26:50+05:30 IST
సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ కానుకగా `కమనీయమైన`, `రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్` అనే రెండు గాస్పల్ సాంగ్స్ (సువార్త పాటలు)ను కంపోజ్ చేశారు.

సంగీత దర్శకుడు కమలాకర్ పేరు చెప్పగానే ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం..’ పాట గుర్తొస్తుంది. ఆ చిత్రంలోని ఆయన సంగీతానికి ఎంత గుర్తింపు వచ్చిందంటే, ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరు అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు తీసిన ‘వాన’ కూడా కమలాకర్ కెరీర్‌లో ఒక మెమరబుల్ మూవీ. ఆ సినిమాలోని `ఎదుట నిలిచింది చూడు.., `ఆకాశ గంగ..` లాంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని మైమరిపిస్తూనే ఉన్నాయి. ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ కానుకగా `కమనీయమైన`, `రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్` అనే రెండు గాస్పల్ సాంగ్స్ (సువార్త పాటలు)ను కంపోజ్ చేశారు. ఈ పాటలు ప్యాషన్ ఫర్ క్రైస్ట్ జోష్వాషేక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలై ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా ..
సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్ మాట్లాడుతూ - ``క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నా సంగీత దర్శకత్వంలో డివోషనల్ టచ్ ఉండేలా రెండు అద్బుతమైన పాటల్నికంపోజ్ చేశాను. మామూలుగానే ఒక హీరో పాటకి మంచి సంగీతం చేస్తుంటాం. అయితే దేవుడు మనందరికీ అల్టిమేట్ హీరో కాబట్టి లిరికల్, సింగింగ్, రిథమ్, మిక్సింగ్ వంటి విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ఫుల్ ఫోకస్డ్‌గా పూర్తి డివోషనల్ టచ్ వచ్చేలా కంపోజ్ చేశాను. ఈ పాటల కోసం ఈ కోవిడ్ టైమ్‌లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమిళనాడు మదురై, కేరళ నుండి రిథమ్ సెక్షన్, కేరళ నుండి కొరియోగ్రాఫర్స్ ని పిలిపించి రికార్డ్ చేశాం. మాములుగా సినిమా పాటలకి రీచ్ ఎక్కువగా ఉంటుంది. అయితే గాస్పల్ సాంగ్స్‌లో ఈ రెండు పాటలకి ఎక్స్‌ట్రార్డనరీ రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు పాటలకు జోష్వా షేక్ గారే ప్రొడ్యూస్ చేశారు. ఔట్ పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్‌గా ది బెస్ట్ ఉండేలా ప్లాన్ చేశాం. ఇండియాలోనే ది బెస్ట్ వైలెనిస్ట్ దీపక్ పండిట్, సితార్ వాదనలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పుర్భయాన్ చటర్జీ లాంటి ఫేమస్ టెక్నీషన్స్ తో వర్క్ చేయించాం. ఈ అవకాశం ఇచ్చిన జోష్వా షేక్ గారికి ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నాను`అన్నారు.