బాలీవుడ్ ట్విట్టర్ వార్ వెనుక ఉన్న వీరులు వీరే!

ABN , First Publish Date - 2020-09-29T02:56:18+05:30 IST

ఒకప్పుడు నిరసన కార్యక్రమాలు రోడ్లపై మాత్రమే జరిగేవి. కానీ రోజురోజుకూ

బాలీవుడ్ ట్విట్టర్ వార్ వెనుక ఉన్న వీరులు వీరే!

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు నిరసన కార్యక్రమాలు రోడ్లపై మాత్రమే జరిగేవి. కానీ రోజురోజుకూ ఈ ట్రెండ్ మారుతోంది. కరోనా కారణంగా ప్రస్తుతం దేశంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు లేవు. దీంతో నిరసన కార్యక్రమాలకు ట్విట్టర్ వేదికగా మారిపోయింది. రోడ్డుపై నిరసనల్లో ప్లకార్డులు ఏ విధమైన పాత్ర పోషిస్తాయో.. ట్విట్టర్‌లో హ్యాష్‌టాగ్‌లు అదే విధమైన పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో మంచి జరిగినా, చెడు జరిగినా ఏదో ఒక హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవడం మాత్రం ఆనవాయితీగా వస్తోంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్ననాటి నుంచి ట్విట్టర్‌ ఇండియాలో రోజుకో హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. కంగనా రనౌత్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి ట్విట్టర్‌లో హ్యాష్‌టాగ్‌ వార్ మొదలైంది. ట్విట్టర్ ఖాతాను ఏ రోజు ఓపెన్ చేసినా సరే.. బాలీవుడ్‌కు సంబంధించి ఏదో ఒక హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో దర్శనమిస్తూనే ఉంటుంది. 


ఈ నిరసన కార్యక్రమాలను ట్విట్టర్‌లో అసలు ఎవరు మొదలుపెడుతున్నారు? ఈ హ్యాష్‌టాగ్‌ల వెనుక ఎవరు ఉంది ఎవరు? ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నవారే సోషల్ మీడియాలలో ఇటువంటి అనవసర హ్యాష్‌టాగ్‌లను ట్రెండింగ్ చేస్తారని చాలా మంది భావిస్తుంటారు. ఇలా అనుకున్న వారంతా పొరపాటు పడినట్టే. ఎందుకంటే ట్విట్టర్‌లో సామాజిక అంశాలపై హ్యాష్‌టాగ్‌లను పెట్టి ట్రెండింగ్ చేసే వారిలో అత్యధిక శాతం మంది విద్యావంతులే ఉన్నారు. ఉన్నతమైన ఉద్యోగాల్లో పనిచేస్తూనే వీరు దేశంలో నెలకొన్న సమస్యలపై ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తున్నారు. ఈ ట్విట్టర్ హ్యాష్‌టాగ్‌ల వెనుక ఉన్న కొంతమంది గురించి తెలుసుకుందామా..   

 

దీపక్ శర్మ(32).. ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న దీపక్ శర్మకు ట్విట్టర్‌లో 1.2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈయన నిత్యం ఏదో ఒక హ్యాష్‌ట్యాగ్‌తో ఎవరో ఒకరిపై విరుచుకుపడుతుంటారు. తాజ్ మహల్ వద్ద శివచాలీసాను జపించారని 2015లో జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేపై శర్మ దాడికి దిగారు. ఇక ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను దూషిస్తూ ట్వీట్లు చేయడంతో ట్విట్టర్ సంస్థ ఈయన ఖాతాను సస్పెండ్ కూడా చేసింది. దీపక్ శర్మ గతంలో వివిధ అంశాలకు సంబంధించి ఆన్‌గ్రౌండ్‌లో క్రియాశీలకంగా పనిచేసేవారు. అయితే తన తల్లి ఆరోగ్యం బాగోకపోవడంతో ఢిల్లీ నుంచి స్వరాష్ట్రమైన యూపీకి వచ్చేశారు. ఇక ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆయన తన నిరసనలను తెలుపుతున్నారు.


ఈ హ్యాష్‌ట్యాగ్ వార్‌ వెనుక ఉన్న మరో ప్రముఖ వ్యక్తి ప్రశాంత్ పటేల్ ఉమ్రా. ఈయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పీకే సినిమాలో దేవుళ్లను కించపరిచారని అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీలపై ప్రశాంత్ పటేల్ లీగల్ యాక్షన్ తీసుకున్నారు. తప్పుడు వార్తలను ఎక్కువగా ప్రచారం చేస్తారనే ఆరోపణలు ఈయనపై చాలానే ఉన్నాయి. ట్విట్టర్‌ ద్వారా దేశంలో ద్వేషాన్ని ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారంటూ రెండేళ్ల క్రితం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఆబ్రీన్ రాజ్యభలో ప్రశాంత్ పటేల్‌పై ఆరోపణలు చేశారు. తాను మాత్రం ఇలాంటి ఆరోపణలను లెక్కచేయనని ఆయన అంటున్నారు. నిజాన్ని బట్టబయలు చేయడమే తన పని అని ప్రశాంత్ పటేల్ చెబుతున్నారు. 


తాను రోడ్డుపైకి వచ్చి నిరసన చేయనని.. కానీ ట్విట్టర్ ద్వారా దేశంలో నెలకొన్న సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తానన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం ప్రశాంత్ భూషన్ ట్విట్టర్‌లో అనేక హ్యాష్‌టాగ్‌లతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌లో జరుగుతున్న ఈ హ్యాష్‌టాగ్ వార్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తాను బాలీవుడ్ సినిమాలు చూడనని.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అభిమానిని కూడా కాదన్నారు. అయినప్పటికి నిజం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో తాను ట్విట్టర్ ద్వారా సుశాంత్ అంశాన్ని లేవనెత్తుతున్నానన్నారు. కాగా.. ప్రశాంత్ పటేల్‌కు ట్విట్టర్‌లో 1.8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 


ఇక మీరట్‌కు చెందిన స్కిన్ డాక్టర్ నీలమ్ సింగ్(32) కూడా ఈ ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌ల వార్ వెనుక కీలకంగా ఉన్నారు. నీలమ్ సింగ్‌ ట్విట్టర్ ఖాతాకు 3.25 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్‌లో చేరిన సమయంలో తనకు రాజకీయాలు, మతం తదితర విషయాలపై ఏ మాత్రం అవగాహన లేదని నీలమ్ సింగ్ చెబుతున్నారు. అయితే కల్చరల్ మార్క్సిజమ్, డబుల్ స్టాండర్డ్స్ తనను ట్విట్టర్ వేదికగా స్పందించేలా చేశాయన్నారు. ఒక సాధారణ వ్యక్తి కంటే డాక్టర్‌గా తాను పెట్టే ట్వీట్లకు ఎక్కువ స్పందన వస్తుందని నీలమ్ సింగ్ చెబుతున్నారు. ఇటీవల #HappyBirthdayCharsiAnurag అని నీలమ్ పెట్టిన ట్వీట్ పెద్ద దుమారమే రేగింది. చార్సీ అనగా.. నిత్యం డ్రగ్స్‌ను తీసుకునే వాడని అర్థం. ఈ హ్యాష్‌టాగ్‌పై స్పందించాలంటూ అనురాగ్‌ను చాలా మంది బలవంతం కూడా చేశారు. 


పైన చెప్పిన వారు మాత్రమే కాకుండా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేసేవారు, ఇతర ఉన్నతమైన ఉద్యోగాల్లో పనిచేసే అనేక మంది ఈ హ్యాష్‌టాగ్ వార్‌లను వెనుక నుంచి నడుపుతున్నారు. ఈ హ్యాష్‌టాగ్‌ల కారణంగా పామరులకు కూడా అనేక విషయాలపై ఒక అవగాహన వస్తోంది. దేశంలో తాజాగా ఏ అంశంపై చర్చ జరిగినా సరే.. వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆ అంశం ట్రెండింగ్‌లో ఉంటోంది. 

Updated Date - 2020-09-29T02:56:18+05:30 IST