ముంబైలో హీట్ పుట్టిస్తున్న పాయల్ ఘోష్ ట్వీట్

ABN , First Publish Date - 2020-10-01T02:29:53+05:30 IST

పాయల్‌ఘోష్‌ సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు వస్తున్నాయని మహారాష్ట్ర గవర్నర్‌ను ..

ముంబైలో హీట్ పుట్టిస్తున్న పాయల్ ఘోష్  ట్వీట్

పాయల్‌ఘోష్‌ సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు వస్తున్నాయని మహారాష్ట్ర గవర్నర్‌ను కూడా కలిశారు. ఆమె పోరాటానికి కంగనా రనౌత్‌ జత కలిశారు. చివరకు ముంబై పోలీసులు అనురాగ్‌ కశ్యప్‌కు నోటీసులు జారీచేశారు. 


బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీచేశారు. నటి పాయల్‌ ఘోష్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కశ్యప్‌ను విచారించేందుకు ముంబైలోని వెర్సోవా పోలీసులు సమన్లు పంపించారు. గురువారం ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీసు్ల్లో ఆదేశించారు.


దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్‌ ఘోష్ కొద్దిరోజుల క్రితం ఆరోపించారు. అంతేకాదు.. ముంబైలోని వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అనురాగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 కింద కేసులు పెట్టారు వెర్సోవా పోలీసులు. ఆయనకు నోటీసులు పంపించారు.


కశ్యప్‌ ఏడేళ్ల క్రితం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పాయల్‌ ఘోష్‌ ఆరోపించారు. 2013లో వెర్సోవాలోని యారీ రోడ్డులో కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేసినట్లు పాయల్‌ ఆరోపించారు. తనకు ఓ స్టోరీ చెబుతానని తన గదిలోకి తీసుకెళ్లిన అనురాగ్ కశ్యప్.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఆ సమయంలో అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్‌వెట్‌' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని చెప్పారు. ఆ సినిమాలో నటించాలనుకుంటే తాను ఏం చేసినా కాదనవద్దని పాయల్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టు పాయల్ పేర్కొన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇదే విషయం పేర్కొన్నారు. దీంతో.. ఏడేళ్ల క్రితం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. 


మరోవైపు.. అనురాగ్‌పై ఫిర్యాదు చేసినందుకు తనకు పలువురి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్  వస్తున్నాయని పాయల్ తెలిపారు. అంతేకాదు.. ఫిర్యాదు చేసిన అనురాగ్ కశ్యప్‌ను విచారించకుండా తనను పోలీసులు వేధిస్తున్నారని పాయల్ ఘోష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైద్య పరీక్షల పేరుతో తన క్లయింట్‌ను వెర్సోవా పోలీసులు వేధిస్తున్నారని పాయల్ ఘోష్ లాయర్ కూడా వెల్లడించారు. 


ఈ నేపథ్యంలోనే... పోలీసులు అనురాగ్‌కు అండగా నిలుస్తున్నారని, తన పిటిషన్‌పై స్పందించడం లేదని మంగళవారం పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ రక్షణ కల్పించమని.. గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కోరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటిగిరీ భద్రతను కల్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ తన సమస్యను సావధానంగా విన్నారని, తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారని గవర్నర్‌ను కలిసిన తర్వాత పాయల్‌ చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కూడా పాయల్‌ ఘోష్‌ కోరారు. 


మరోవైపు.. ఈ ఇష్యూలో కంగనారనౌత్‌ కూడా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా మహారాష్ట్ర సీఎంపైనా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పైనా తీవ్రమైన విమర్శలు చేశారు. అనురాగ్‌ కశ్యప్‌ ఎంత నీచుడో పాయల్‌ఘోష్‌ ఫిర్యాదు చేసినా, చెప్పినా.. పోలీసులు ఏమీ చేయడం లేదని, కానీ హర్యానాకు చెందిన యూట్యూబర్‌ను మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ఈ ట్వీట్‌ కూడా ముంబైలో హాట్‌ పుట్టించింది. 


ఇక.. కశ్యప్ చాలా మంచి వాడని.. కావాలనే పాయల్ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొందరు హీరోయిన్లు, సినీ ప్రముఖులు కూడా అనురాగ్‌కు మద్దతుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉంటే.. ముంబై పోలీసులు కశ్యప్‌కు నోటీసులు ఇవ్వడంపై పాయల్ ఘోష్ స్పందించారు. ముంబై పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్‌ చేశారు. 


- సప్తగిరి గోపగోని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-01T02:29:53+05:30 IST