పరేష్‌ రావల్‌ ఇక... నాటకాధిపతి

ABN , First Publish Date - 2020-09-20T18:27:43+05:30 IST

మెత్తగాపాకే ఆక్టోపస్‌లా గమ్మత్తుగా నటించే పరేష్‌ రావల్‌.. కొత్త పదవిలో నటిస్తాడో.. జీవిస్తాడో చూడాలి. ఇప్పుడాయన నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాకు ఛైర్మన్‌..

పరేష్‌ రావల్‌ ఇక...  నాటకాధిపతి

మెత్తగాపాకే ఆక్టోపస్‌లా గమ్మత్తుగా నటించే పరేష్‌ రావల్‌.. కొత్త పదవిలో నటిస్తాడో.. జీవిస్తాడో చూడాలి. ఇప్పుడాయన నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాకు ఛైర్మన్‌.. 


పరేష్‌ రావల్‌ తెలుగు తెరకు బాగా పరిచయం ఉన్న నటుడు. వెంకటేశ్‌ ‘క్షణక్షణం’ నుంచి చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ వరకు తెలుగులో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెరపై తాము కాకుండా పాత్రలు మాత్రమే కనపడేలా నటించగల అరుదైన నటుల్లో ఆయన ఒకరు. ప్రతిష్టాత్మక ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’కు ఛైర్‌పర్సన్‌గా ఇటీవల నియమితులైన ఆయన గురించి తెలుసుకుందాం..


ముంబయిలో పుట్టిపెరిగిన పరేష్‌ రావల్‌ది గుజరాతీ బ్రాహ్మణ కుటుంబం. బాంబే యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. నటనంటే చిన్నప్పటి నుంచీ ఎంతో ఆసక్తి. కాలేజీ రోజుల నుంచే నాటకాలు వేయడం ప్రారంభించారు. 1984లో ‘హోలి’ చిత్రంలో సహాయక నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించారు. 1986లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘నామ్‌’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత ప్రధాన విలన్‌ పాత్రల్లో వంద చిత్రాల వరకూ నటించారు. 


పద్మశ్రీ  గ్రహీత

ప్రియదర్శన్‌ ‘హీరాఫేరీ’ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి అర్థవంతమైన హాస్య పాత్రలను ఆయన కోసమే సృష్టించడం మొదలైంది. విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌గా అనేక భాషా చిత్రాల్లో పరేష్‌ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అడపాదడపా నాటకాల్లో నటిస్తూ థియేటర్‌పై తన మక్కువను చాటుకున్నారు. అదే ఆయన్ని నేడు ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’కు ఛైర్‌పర్సన్‌గా చేసింది. ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే పరేష్‌ రావల్‌ బహు భాషా కోవిదుడు. హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లిష్‌లలో చక్కగా మాట్లాడగలరు. ‘వో చోక్రి’, ‘సర్‌’ చిత్రాలకుగాను ఉత్తమ సహాయక నటుడిగా జాతీయ అవార్డులను పొందారు. నటనా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో ఆయన్ని సత్కరించింది. బీజేపీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికలలో అహ్మదాబాద్‌ ఈస్ట్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. మోదీ జీవిత చరిత్రను తెరకెక్కించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆయన మోదీ వీరాభిమాని.


లింగం మామ

‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ చూసిన వారందరూ లింగం మామ నటనకు ఫిదా కావాల్సిందే.  ఇంకా చిరంజీవితో కలిసి ‘బావగారు బాగున్నారా’, ‘రిక్షావోడు’లో నటించారు. రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘క్షణక్షణం’, ‘గోవిందా గోవిందా’, ‘మనీ’, ‘మనీ మనీ’లు ఆయనలోని విలక్షణ నటుడిని వెలికి తీశాయి. పవన్‌ కల్యాణ్‌ ‘తీన్మార్‌’ లోనూ అలరించారు. ‘అవును, చాలా ఏళ్లవుతోంది, తెలుగు సినిమాల్లో నటించి’ అని పరేష్‌ గుర్తుచేసుకుంటారు. ‘హైదరాబాద్‌ మంచి నగరం, సినిమాల్లో ఉన్నా లేకపోయినా నాటకాలు వేయడానికి ఇక్కడికి వస్తూనే ఉంటాను. కళారాధకులు ఈ నగరంలో ఎక్కువ. దక్షిణ సినీ పరిశ్రమ చాలా క్రమశిక్షణగా, వ్యవస్థీకృతంగా ఉంటుంది..’ అంటాడాయన. 



చిన్న కుటుంబం

‘మేమిద్దరం మాకిద్దరు’ అన్నది పరేష్‌ రావల్‌ కుటుంబానికి చక్కగా సరిపోతుంది. పరేష్‌ ధర్మపత్ని స్వరూప్‌ సంపత్‌. ప్రముఖ బాలీవుడ్‌ నటి, టీవీ ఆర్టిస్ట్‌, అధ్యాపకురాలు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘యేజో హై జిందగీ’ ద్వారా ఆమె సుపరిచితురాలే. 1979లో ‘మిస్‌ ఇండియా’ కిరీటాన్ని సొంతం చేసుకున్న సుందరీమణి. ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో భారత్‌ తరపున పాల్గొంది. ‘ఉరి, ది సర్జికల్‌ స్ట్ట్రయిక్స్‌’ లోనూ కీలకపాత్ర పోషించింది స్వరూప్‌. పరేష్‌ నటించే రంగస్థల నాటకాల్లో స్వరూప్‌ నటిస్తుంటుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు... అనిరుఽధ్‌, ఆదిత్య. చిన్న కొడుకు ఆదిత్య లండన్‌, న్యూయార్స్‌లలోని ప్రముఖ సంస్థలలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అతడు రూపొందించిన ‘ది క్వీన్‌’ నాటకం న్యూయార్క్‌ ఇన్నోవేటివ్‌ థియేటర్‌ అవార్డు సాధించింది. ఇటీవల ఓటీటీ లో విడుదలైన ‘బాంబ్‌ఫాడ్‌’ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు.



నాటకాలపై మక్కువ

బాలీవుడ్‌లో ‘ఓ ఛోక్రీ’, ‘సర్‌’, ‘మొహ్రా’ ఇటీవలి ‘టైగర్‌ జిందా హై’ చిత్రాల్లోని పాత్రలు పరేష్‌ రావల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘ఓ నటుడిగా ఎప్పుడూ విశ్రమించకూడదు. విభిన్నమైన పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. ఛాలెంజింగ్‌ పాత్రలకే నా ఓటు’ అని చెప్పే  పరేష్‌కు నాటక రంగం అంటే చాలా ఇష్టం. ‘కిషన్‌ వర్సెస్‌ కన్హయా’ నాటకాన్ని గత పదేళ్ల నుంచి వివిధ నగరాలలో ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకాన్ని ‘ఓఎంజీ’ పేరుతో అక్షయ్‌కుమార్‌ కృష్ణ పాత్ర ఽధారణలో సినిమా తీసినా ఇంకా ప్రదర్శించాలనే ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయట. ‘నాటకంలో వీక్షకుడి చూపులన్నీ నటుడిపైనే ఉంటాయి. పరిసరాలపై కాదు’ అందుకే డ్రామా ఎంతో సంతృప్తినిచ్చే మాధ్యమం అని తేల్చి చెబుతారు పరేష్‌ రావల్‌. సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించి తెలుగులోనూ పునర్నిర్మితమైన ‘ఓఎంజీ’ కి పరేషే నిర్మాత కావడం విశేషం. 


అభిరుచులు

హాబీలు: పుస్తక పఠనం, సంగీతం, యాత్రలు, యోగా

అభిమాన నటులు: ఓంపురి, అమితాబ్‌ బచ్చన్‌, మార్ల్లన్‌ బ్రాండో

అభిమాన దర్శకులు: ప్రియదర్శన్‌, కేతన్‌ మెహతా, రాజ్‌కుమార్‌ సంతోషి

పుస్తకం: ఒన్‌ ఫ్ల్యు ఓవర్‌ ది కుకూస్‌ నెస్ట్‌

Updated Date - 2020-09-20T18:27:43+05:30 IST