ఈసారి ‘ట్రాప్’ అంటోన్న పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-10-27T23:14:52+05:30 IST

దర్శకుడు పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి నుంచి సినిమా వస్తుంది అంటే చాలు.. ఓ వర్గపు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. సమాజంలో

ఈసారి ‘ట్రాప్’ అంటోన్న పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి

దర్శకుడు పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి నుంచి సినిమా వస్తుంది అంటే చాలు.. ఓ వర్గపు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలనే హైలెట్‌ చేస్తూ.. పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి సినిమాలు తెరకెక్కిస్తుంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చూసిన ఎవరైనా ఇది అంగీకరించాల్సిందే. సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను,  రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను ఇప్పటి వరకు తెరకెక్కించిన ఆయన ఇప్పుడు రొమాంటిక్ సోష‌ల్ థ్రిల్ల‌ర్‌ అంటూ ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్‌గా 'హ‌నీట్రాప్‌' అని ఫిక్స్‌ చేశారు. భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.వి వామ‌న రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాదు ఆయన ఈ చిత్రానికి క‌థ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. సాయి ఋషి, తేజు అనుపోజు హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా న‌టుడు శివ కార్తిక్ కీల‌క‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ  రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుందని తాజాగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.


ద‌ర్శ‌కుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్ర‌ముఖ రంగస్థ‌ల నాట‌క ర‌చ‌యిత, మిత్రుడు వామ‌నరావు మంచి క‌థ‌ వినిపించారు. నేను చేసిన జోనర్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటూ క‌మర్షియ‌ల్ అంశాల‌తో ఆడియ‌న్స్ అల‌రించే స‌బ్జెక్ట్ కావ‌డంతో ద‌ర్శ‌క‌త్వ‌ భాద్య‌త‌లు స్వీక‌రించ‌డం జ‌రిగింది. ఈ చిత్రం ద్వారా స‌త్యానంద్ గారి శిష్యుడు సాయి ఋషి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అలాగే వ‌ల‌స చిత్రంలో న‌టించిన తేజు అనుపోజు హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌ల్ఫ్ మూవీలో ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించిన శివ‌కార్తిక్ మ‌రో మంచి పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే నిర్మాత వామ‌న‌రావు  కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ప్ర‌తి ఒక్కరినీ ఆలోచింప‌జేసే క్లాసిక్ ట‌చ్ ఉన్న‌ స‌బ్జెక్ట్ కావ‌డంతో ఓ రొమాంటిక్ క్రైమ్ కథలాగే  మూడు సిరీస్‌లుగా  రూపొందించే ఆలోచ‌న‌లో ఉన్నాం. న‌వంబ‌ర్ నుంచి షూటింగ్‌ ప్రారంభించబోతున్నాం.." అని తెలపగా.. యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్ కావ‌డంతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సునీల్ కుమార్‌కి ఈ కథ వినిపించడం జ‌రిగింది. ఆయన త‌ప్ప‌కుండా ఈ క‌థ‌కి న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని ఆశిస్తున్నాను. మంచి టీమ్ కుదిరింది. త‌ప్ప‌కుండా అంద‌రినీ ఆలోచింప‌జేసే ఒక మంచి సినిమా అవుతుంది అని తెలిపారు నిర్మాత వివి వామ‌నరావు.

Updated Date - 2020-10-27T23:14:52+05:30 IST