మన కథలు... మన దర్శకులు... హిందీ సినిమాలు!

ABN , First Publish Date - 2020-07-16T05:16:22+05:30 IST

తెలుగోడు రాసిందీ, తీసిందీ... బాలీవుడ్‌ బాబులకు నచ్చుతోంది! ఇన్నాళ్ళూ కథలు పట్టుకువెళ్ళారు...

మన కథలు... మన దర్శకులు... హిందీ సినిమాలు!

తెలుగోడు రాసిందీ, తీసిందీ...

బాలీవుడ్‌ బాబులకు నచ్చుతోంది!

ఇన్నాళ్ళూ కథలు పట్టుకువెళ్ళారు...

ఇప్పుడు సృష్టికర్తలనూ తీసుకువెళుతున్నారు!!

దాంతో ముంబయ్‌లో, హిందీ సినిమా అడ్డాలో...

యాక్షన్‌ అండ్‌ కట్‌ చెప్పేది మాత్రం తెలుగు బిడ్డ!!!

హిందీ సినిమాలు అయిప్పటికీ... తెలుగు రీమేకులను

తెలుగు దర్శకుల చేతిలో పెట్టడమే బాలీవుడ్‌ నయా ట్రెండ్‌!


గతేడాది (2019లో) బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన టాప్‌3 సినిమాలలో ‘కబీర్‌ సింగ్‌’ ఒకటి. తెలుగులో విజయ్‌ దేవరకొండకు స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన ‘అర్జున్‌రెడ్డి’కి అది రీమేక్‌. అంతేనా? ‘అర్జున్‌రెడ్డి’తో దర్శకుడిగా పరిచయమైన సందీ్‌పరెడ్డి వంగా, హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ తీశారు. మళ్ళీ సేమ్‌ మేజిక్‌ క్రియేట్‌ చేయాలంటే... ఒరిజినల్‌ తీసిన దర్శకుడి వల్లే సాధ్యమవుతుందని హీరో షాహిద్‌ కపూర్‌ భావించడంతో, నిర్మాతలు రీమేక్‌ రైట్స్‌తో పాటు సందీ్‌పను తమతో ముంబయ్‌ తీసుకువెళ్ళారు. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘జెర్సీ’. నాని క్రికెటర్‌గా నటించిన ‘జెర్సీ’కి హిందీ రీమేక్‌. దీనికీ ఒరిజినల్‌ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరిని తీసుకువెళ్ళారు. 


అగ్ర దర్శకులూ...

చిన్న చిత్రాలే కాదు.... తెలుగులో అగ్ర తారలు నటించిన భారీ చిత్రాల కథలూ హిందీకి వెళుతున్నాయి. దర్శకులు కూడా! అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘డీజే... దువ్వాడ జగన్నాథమ్‌’ను హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయు. టైగర్‌ ష్రాఫ్‌ లేదా వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయట. ఒరిజినల్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ చెంతకు డైరెక్షన్‌ ఛాన్స్‌ వచ్చిందని వినికిడి. హిందీలో రీమేక్‌ అవుతున్న మరో సినిమా ‘భాగమతి’. తెలుగులో అనుష్క పోషించిన పాత్రను హిందీలో భూమీ పెడ్నేకర్‌ పోషించనున్నారు. ‘భాగమతి’ పేరును ‘దుర్గావతి’గా మార్చారు. కానీ, దర్శకుణ్ణి మాత్రం మార్చలేదు. అశోక్‌ను తీసుకువెళ్లారు.


నిర్మాతలూ మనోళ్ళే!

మన కథలు, దర్శకులను హిందీకి తీసుకువెళుతున్న నిర్మాతలలో కొందరు తెలుగువాళ్లు ఉండటం గమనార్హం. షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ని హిందీ నిర్మాత అమన్‌ గిల్‌తో కలిసి అల్లు అరవింద్‌, ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ‘గజనీ’తో దర్శకుడు ఏఆర్‌ మురుగదా్‌సను హిందీకి పరిచయం చేసింది అల్లు అరవిందే. తర్వాత దక్షిణాదిలో విజయవంతమైన తన చిత్రాలను హిందీలో రీమేక్‌ చేయడం ప్రారంభించారు మురుగదాస్‌. హిందీ నిర్మాత కులదీప్‌ రాథోడ్‌తో కలిసి ‘హిట్‌’, బీఆర్‌ చోప్రా ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డీజే’, బోనీ కపూర్‌తో కలిసి ‘ఎఫ్‌ 2’ను ‘దిల్‌’ రాజు రీమేక్‌ చేయనున్నారు. తెలుగులో చిత్రాన్ని విజయవంతంగా మలచిన దర్శకులకు తమ కథపై అవగాహన ఉండటంతో పాటు కథలో ఆత్మను చెడగొట్టకుండా, హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీయగలరని నిర్మాతల ప్రగాఢ విశ్వాసం. కథలు, దర్శకులు, నిర్మాతలు... వెరసి బాలీవుడ్‌లో తెలుగోడి జెండా మళ్లీ రెపరెపలాడుతోంది.


కథ ఒక్కటే... పరిచయాలు రెండు!

కరోనాకి ముందు... ఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించిన చిన్న సినిమాలలో విష్వక్‌సేన్‌ ‘హిట్‌: ద ఫస్ట్‌ కేస్‌’ ఒకటి. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్‌ అవుతోంది. ఈ కథకు విలక్షణ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ ఓకే చెప్పారు. హిందీలోనూ చిత్రాన్ని తెరకెక్కించేది తెలుగు దర్శకుడే... శైలేష్‌ కొలను. తొలి చిత్రం  విజయంతో పాటు హిందీలోనూ దర్శకుడిగా పరిచయమయ్యే అవకాశాన్ని అందుకున్నారాయన. ఈ జాబితాలో చేరిన మరో యువ దర్శకుడు రితేష్‌ రాణా. ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీ సింహా, సత్య, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో అతను ‘మత్తు వదలరా’ తీసి విజయం అందుకున్నారు. అదీ హిందీలో రీమేక్‌ కానుంది. ఇంకా నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలు కాలేదు. కానీ, హిందీ వెర్షన్‌ స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశారని సమాచారం. హిందీలోనూ రితేష్‌ రాణా తెరకెక్కించనున్నారు.

Updated Date - 2020-07-16T05:16:22+05:30 IST