ఓటీటీ తెరపైకి అల్లు అర్జున్ ఎంట్రీ... వెయిట్ చేయాలి!
ABN , First Publish Date - 2020-11-14T05:16:52+05:30 IST
‘‘తెలుగులో నలుగురు అగ్ర దర్శకులైన సుకుమార్, హరీశ్ శంకర్, సురేందర్‌రెడ్డి, వంశీ పైడిపల్లి... ‘ఆహా’లో షోలు చేయబోతున్నారు. నేను ఈ నలుగురితోనూ పని చేశా’’ అని అల్లు అర్జున్ అన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘అల్లు అర్జున్...

‘‘తెలుగులో నలుగురు అగ్ర దర్శకులైన సుకుమార్, హరీశ్ శంకర్, సురేందర్‌రెడ్డి, వంశీ పైడిపల్లి... ‘ఆహా’లో షోలు చేయబోతున్నారు. నేను ఈ నలుగురితోనూ పని చేశా’’ అని అల్లు అర్జున్ అన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘అల్లు అర్జున్ సమర్పించు ఆహా గ్రాండ్ రివీల్ ఈవెంట్’ జరిగింది. అందులో ఈ విషయం వెల్లడించారు. అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆహా’ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ ‘ఆహా’లో రాబోయే షోలు... ‘రుద్రవీణ’, ‘కంబాలపల్లి కథలు’, ‘కుబూల్ హై’, ‘కుడి ఎడమైతే’, ‘తోడేళ్ళు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’, ‘సూపర్ ఓవర్’, ‘లెవన్త్ అవర్’, ‘మైదానం’, ‘బియాండ్ టెక్ట్స్ బుక్’, ‘మేజ్’, ‘అన్యాస్ ట్యుటోరియల్’ ప్రచార చిత్రాలను ప్రదర్శించారు. అంతకు ముందు జూపల్లి రామారావు మాట్లాడుతూ ‘‘ప్రతి తెలుగు వీక్షకుడికి వినోదం అందించడమే మా లక్ష్యం. మా యాప్‌ను ఆరు మిలియన్ల కంటే ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
18 మిలియన్ యునిక్ యూజర్లు ఉన్నారు. రోజుకి రూపాయి... ఏడాదికి రూ. 365 చెల్లించి ‘ఆహా’ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. దీపావళి సందర్భంగా దానిపై రూ. 100 ఆఫర్ ఇస్తున్నాం’’ అని అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఎలా ఉన్నాయో... రేపు ఓటీటీ అనేది డిజిటల్ ఇండస్ట్రీగా ఎదుగుతుంది. దాన్ని మా నాన్నగారు (అల్లు అరవింద్) తెలుగుకు తీసుకురావడం, అచ్చమైన తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రారంభం కావడం గర్వంగా ఉంది. ఈ ఓటీటీ వేదిక కంటెంట్‌కి సంబంధించినది. నా స్నేహితుడు రామ్ జూపల్లి, వాళ్ల ఫ్యామిలీకి చెందిన మైహోమ్ గ్రూప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇండస్ట్రీలోకి ప్రవేశించాలని ఉందని చెప్పారు. మా నాన్నకూ ఇటువంటి ఐడియా ఉందని మేమంతా కలిశాం. మాకు ఇలా చేయాలని కోరిక ఉంది. చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఇవాళ ‘ఆహా’ ఇంతలా ఎదగడానికి జూపల్లి కుటుంబానికి మాపై ఉన్న నమ్మకమే కారణం. అల్లు కుటుంబాన్ని జూపల్లి కుటుంబం ఎంతోగానో నమ్మింది’’ అని చెప్పారు. ‘ఓటీటీ తెరపైకి అల్లు అర్జున్ ఎంట్రీ ఎప్పుడు?’ అని నవదీప్ ప్రశ్నించగా... ‘వెయిట్ చేయాలి. సర్‌ప్రైజ్ కింద వస్తున్నాం’ అని అల్లు అర్జున్ సమాధానమిచ్చారు.