ఇప్పుడు వద్దు... వెయిట్‌ చేద్దాం

ABN , First Publish Date - 2020-07-28T05:56:50+05:30 IST

కరోనా రక్కసి తీవ్రంగా తన ప్రభావం చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో థియేటర్లు అప్పుడే తెరవడం అంత శ్రేయస్కరం కాదనీ, ఒకవేళ తెరిచినా 25 శాతం సీటింగ్‌ సామఽర్థ్యంతో థియేటర్లు నడపడం కష్టమని...

ఇప్పుడు వద్దు... వెయిట్‌ చేద్దాం

కరోనా రక్కసి తీవ్రంగా తన ప్రభావం చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో థియేటర్లు అప్పుడే తెరవడం అంత శ్రేయస్కరం కాదనీ,  ఒకవేళ తెరిచినా 25 శాతం సీటింగ్‌ సామఽర్థ్యంతో థియేటర్లు నడపడం కష్టమని సినీ ప్రముఖులు చెప్పారు. ఆగస్టు నుంచి థియేటర్లు ఓపెన్‌ అవుతాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కొందరు ప్రముఖుల స్పందన ఇది.


ప్రభుత్వంతో చర్చిస్తాం

కరోనా ఉధృతి తగ్గే వరకూ థియేటర్లు తెరవకుండా ఉండడమే మంచిది. సౌత్‌ కొరియా, చైనా దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గాక థియేటర్లు తెరిచారు. కొరియాలో రోజుకి 20-30 కేసులు, చైనాలో 50-60 కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా అక్కడ థియేటర్ల ఆక్యుపెన్సీ అంతగా లేదు. కొరియాలో తప్ప ఎక్కడా కలెక్షన్లు బాగోలేదు. నిత్యావసరాలైన రెస్టారెంట్లు, సెలూన్లు, బట్టల షాపులకే ఎవరూ వెళ్లడం లేదు. ఈ సమయంలో థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు క్యూ కడతారని నేననుకోను. ఒకవేళ తెరిస్తే జనాలు గుమిగుడతారు. దాంతో కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్‌ అంటారు. నిర్మాతలు నష్టాల పాలవుతారు. కొంతమంది నిర్మాతలు మినహా మిగిలిన వారు ఎవరూ ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాలనుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఫ్రీ కరెంట్‌, పన్నులు రాయితీ, జీఎస్టీలో తగ్గింపు వంటి సౌకర్యాలు కల్పిస్తే ఆలోచిస్తాం. అయినా ఆగస్ట్‌లో థియేటర్లు తెరుస్తారా లేదా, ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయాన్ని త్వరలో ప్రభుత్వంతో చర్చిస్తాం.  

డి. సురేశ్‌బాబు


ఆ ఖర్చులు కూడా రావు

ఏదైనా విపత్తుల వల్ల 30 రోజులకు మించి థియేటర్లు మూత పడితే కార్పొరేషన్‌  టాక్స్‌లో 50 శాతం తగ్గించవచ్చని మున్సిపల్‌ యాక్ట్‌లో ఉంది. అలా యూజర్‌ ఛార్జీలు తగ్గించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాం.   సింగిల్‌ థియేటర్స్‌కు ఎంత కరెంట్‌ వినియోగిస్తే అంతే బిల్లు చెల్లించే విధానం తీసుకురావాలి. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఇతర టాక్సులు తొలగించాలనీ, జీఎస్టీ విషయంలో కూడా సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేం సమర్పించిన వినతిపత్రం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను బట్టి దక్షిణాదిన సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లు తెరవాలా, వద్దా అన్నది ఆలోచిస్తాం. ఎందుకంటే 25 శాతం సీటింగ్‌ సామర్ధ్యంతో ధియేటర్లు నడిపితే శానిటైజ్‌ ఖర్చులు కూడా రావు. 

కాట్రగడ్డ ప్రసాద్‌,

దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు


నిర్మాతలు ఒప్పుకొంటారా?

వీలయినంత త్వరగా థియేటర్లు తెరవాలని మాకూ ఉంది. కానీ ఇది తొందరపడి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. అయితే 25 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపలేం. మేమే కాదు తన సినిమాను పాతిక శాతం వసూళ్లతో ఆడడానికి ఏ నిర్మాతా ఒప్పుకోడు. అప్పుడు కొత్త సినిమాలు కాకుండా పాత సినిమాలు ప్రదర్శించాలి. వాటిని చూడడానికి ఎంతమంది జనం ముందుకు వస్తారు?  జనంలో  కరోనా అంటే చాలా భయం ఉంది. అత్యవసర పని అయితే తప్ప బయటకు రావడం లేదు. నా అభిప్రాయం ప్రకారం థియేటర్లు ఓపెన్‌ కావడానికి ఇంకో 45 రోజులు పడుతుంది. 

సునీల్‌ నారంగ్‌


దసరా నుంచి బెటర్‌

ఆగస్టు నుంచి కాకుండా అక్టోబర్‌ నుంచి పర్మిషన్‌ ఇస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. అక్టోబర్‌ ఫస్ట్‌ నుంచి దసరా సీజన్‌ మొదలవుతుంది. పండగ కనుక రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలవుతాయి. వాటికి లభించే ఆదరణను బట్టి మిగిలిన సినిమాలు విడుదల చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు నుంచి వాక్సిన్‌ వస్తుందంటున్నారు. అది వస్తే జనంలో భయంపోతుంది. అంతవరకూ కష్టమే. వీలున్నంతవరకూ ఇంటి దగ్గరే ఉండండి. అవసరమైతేనే బయటకు రండి అని ప్రభుత్వం అంటోంది. మరి సినిమా చూడడం అత్యంత అవసరం అనే భావన జనంలో ఉందని నేననుకోను.

‘అలంకార్‌’ ప్రసాద్‌, విజయవాడ

Updated Date - 2020-07-28T05:56:50+05:30 IST