ఎన్‌సీబీ విచారణకు రియా.. బాలీవుడ్‌కు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2020-09-08T20:18:42+05:30 IST

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణ ప్రస్తుతం చర్చనీయాంశంగా..

ఎన్‌సీబీ విచారణకు రియా.. బాలీవుడ్‌కు ఊహించని ట్విస్ట్..!

ముంబై: బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాంద్రా పోలీస్ స్టేషన్‌‌లో విచారణతో మొదలైన ఈ కేసు ఈడీ, ఎన్‌సీబీ, సీబీఐ దర్యాప్తు సంస్థల విచారణ వరకూ వెళ్లింది. తాజాగా.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ మృతి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తోంది. వరుసగా మూడో రోజు ఎన్‌సీబీ విచారణకు రియా హాజరైంది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ వినియోగం కూడా ఉందన్న కోణంలో రియాను ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. రియా కూడా సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు అంగీకరించడంతో.. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై ఎన్‌సీబీ దృష్టి సారించింది.


రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇచ్చిన సమాచారంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగి తేలే 25 మంది సెలబ్రెటీల జాబితాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధం చేసినట్లు తెలిసింది. రేపోమాపో వరుసగా.. వారికి విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపాలని ఎన్‌సీబీ నిర్ణయించింది. ఆ 25 మంది సెలబ్రెటీలు ఎవరనే విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బాలీవుడ్‌కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న, డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న 8 మందిని ఈ కేసులో ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఎన్‌సీబీ విచారణతో బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-09-08T20:18:42+05:30 IST