విజ‌య‌శాంతి ‘క‌ర్త‌వ్యం’కు అరుదైన గుర్తింపు

ABN , First Publish Date - 2020-03-08T19:05:24+05:30 IST

మూడు ద‌శాబ్దాల తర్వాత ‘క‌ర్త‌వ్యం’ సినిమాకు మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజున నేష‌న‌ల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా(ఎన్.ఎఫ్‌.ఎ.ఐ) ఈ సినిమా తెలుగు, హిందీ పోస్ట‌ర్స్‌ను ట్వీట్ చేశారు.

విజ‌య‌శాంతి ‘క‌ర్త‌వ్యం’కు అరుదైన గుర్తింపు

లేడీ సూప‌ర్‌స్టార్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ విజ‌య‌శాంతి. 90వ ద‌శ‌కంలో మ‌హిళా ప్రాధాన్య‌తా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు విజ‌య‌శాంతి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల‌ను సాధించిన‌వే. అలా విజ‌య‌శాంతి న‌టించిన చిత్రాల్లో ఎవ‌ర్‌గ్రీన్ మూవీ ‘క‌ర్త‌వ్యం’. మోహ‌న్‌గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో విజయశాంతి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. 


 ‘క‌ర్త‌వ్యం’ చిత్రంలో.. దుర్మార్గుల భ‌ర‌తం ప‌ట్టిన వైజ‌యంతీ అనే ఫ‌వ‌ర్‌ఫుల్ లేడీ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విజ‌య‌శాంతి చూపించిన అసామాన్య‌మైన న‌ట‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. చాలా మంది మ‌హిళ‌లు ఈ ‘క‌ర్త‌వ్యం’ సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయ్యారంటే సినిమా ఎలాంటి ప్ర‌భావం చూపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గానే కాదు.. అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రానికిగానూ విజ‌య‌శాంతి జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డుతో పాటు ఫిలింఫేర్‌, నంది అవార్డులు కూడా ఆమె సొంత‌మ‌య్యాయి. 


మూడు ద‌శాబ్దాల తర్వాత ‘క‌ర్త‌వ్యం’ సినిమాకు మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజున నేష‌న‌ల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా(ఎన్.ఎఫ్‌.ఎ.ఐ) ఈ సినిమా తెలుగు, హిందీ పోస్ట‌ర్స్‌ను ట్వీట్ చేసింది. ‘క‌ర్త‌వ్యం’ సినిమా 1990లో విడుద‌లైతే.. 1994లో దీన్ని హిందీలో ‘తేజ‌స్విని’ పేరుతో రీమేక్ చేశారు. హిందీలోనూ ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. వైజయంతి ఐపీఎస్ పేరుతో తమిళంలోకి అనువదిస్తే.. అక్కడా అఖండ విజయం సాధించింది.   


ముప్పై ఏళ్ల‌లో ఎన్నో మ‌హిళా ప్రాధాన్య‌తా చిత్రాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ‘క‌ర్త‌వ్యం’ సినిమా పోస్టర్స్‌ను ఎన్.ఎఫ్‌.ఎ.ఐ పోస్ట్ చేయ‌డం తెలుగు సినిమాకు ద‌క్కిన అరుదైన గుర్తింపుగా భావించాలి.   


Updated Date - 2020-03-08T19:05:24+05:30 IST