థియేటర్లలో కూడా ‘వి’.. విడుదల ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2020-12-25T00:24:38+05:30 IST

నాని 25వ చిత్రం 'వి' థియేటర్లలో కూడా సందడి చేయబోతోంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓటీటీలో విడుదలైన స్టార్‌ హీరో సినిమాగా పేరున్న 'వి' చిత్రాన్ని థియేటర్లలో కూడా విడుదల

థియేటర్లలో కూడా ‘వి’.. విడుదల ఎప్పుడంటే..?

నాని 25వ చిత్రం 'వి' థియేటర్లలో కూడా సందడి చేయబోతోంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓటీటీలో విడుదలైన స్టార్‌ హీరో సినిమాగా పేరున్న 'వి' చిత్రాన్ని థియేటర్లలో కూడా విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌ రాజు రెడీ అయ్యారు. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీశ్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  చిత్రం‘వి’. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు‌. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టంతో సినిమాను అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుద‌ల చేశారు. సెప్టెంబర్ 5 న విడుద‌లైన ‘వి’ చిత్రాన్ని ఇప్పటికే దాదాపు అందరూ ఓటీటీలో చూసేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో.. అమెజాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సినిమాని కొత్త సంత్స‌రం 2021 జ‌న‌వ‌రి 1న థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నట్లుగా నిర్మాత‌లు తెలిపారు. 


ఈ సంద‌ర్భంగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ''నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి కాంబినేష‌న్‌లో మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేసిన ‘వి’ సినిమాను కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అమెజాన్‌లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూశారో.. అదే విధంగా ఆద‌రించారు. నాని 25వ సినిమా ఇది. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా, రిచ్‌గా తెర‌కెక్కించాం. కానీ థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేయ‌లేక‌పోయామ‌నే ఆలోచ‌న ఉండిపోయింది. ఇప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎంతో సంతోషించాల్సిన విష‌యం. ఈ నేప‌థ్యంలో రాబోయే కొత్త సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని, అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటూ జ‌న‌వ‌రి 1న వి సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఉండే ఫీల్ వేరుగా ఉంటుంది. అందరూ కోవిడ్‌ పట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. సినిమాని థియేటర్‌లో కూడా చూసి ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నాము..’’ అన్నారు.

Updated Date - 2020-12-25T00:24:38+05:30 IST