టాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ 'శివ'కి 31 ఏళ్లు

ABN , First Publish Date - 2020-10-05T17:29:17+05:30 IST

తెలుగు ప్రేక్షకుడు మరచిపోలేని సినిమా 'శివ'. నాగార్జున అక్కినేని హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన ఈ చిత్రాన్నిఅన్నపూర్ణ స్టూడియోస్‌, ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు.

టాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ 'శివ'కి 31 ఏళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన, మరుపురాని చిత్రాలు రూపొందాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే తెలుగు సినీ గమనాన్ని మలుపు తిప్పిన చిత్రాలుగా నిలిచిపోయాయి. అలాంటి వాటిలో తెలుగు ప్రేక్షకుడు మరచిపోలేని సినిమా 'శివ'.  నాగార్జున అక్కినేని హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన ఈ చిత్రాన్నిఅన్నపూర్ణ స్టూడియోస్‌, ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. ఆర్జీవీ తొలి చిత్రమిది. 1989 అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం నేటికి 31 వసంతాలను పూర్తి చేసుకుంది. సౌండ్‌కు తెలుగు సినిమాలో మరింత ప్రాధాన్యతను పెంచిన చిత్రమిది. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్‌.గోపాల్‌ రెడ్డి  సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రంతో నాగార్జున అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. బాలీవుడ్ లోనూ క్రేజ్ ను సంపాదింకున్నారు నాగ్. 




విజయవాడలో చదువుకున్న రామ్‌గోపాల్‌ వర్మ తన కాలేజీ లైఫ్‌లో చూసిన, విన్న కాలేజీ గొడవలను ఆధారంగా చేసుకుని 'శివ' చిత్రాన్ని తెరకెక్కించారు. 55 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాడు ఆర్జీవీ. ఇందులో మూడు రోజులను మాత్రమే చెన్నైలో చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్‌ అంతా తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరించారు. 22 సెంటర్స్‌లో శత దినోత్సవాన్ని, ఐదు సెంటర్స్‌లో సిల్వర్‌ జూబ్లీని జరుపుకుందీ చిత్రం. పలు అంతర్జాతీయ చిత్రత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి బెస్ట్‌ మూవీగా ఫిలింఫేర్‌ అవార్డ్‌తో పాటు బెస్ట్‌ ఫస్ట్‌ ఫిలిం, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ డైలాగ్స్ కేటగిరీల్లో సినిమాకు నంది అవార్డులు కూడా వచ్చాయి. శివ సినిమా అనగానే నాగార్జునే కాదు, విలన్‌గా నటించిన రఘువరన్, అమల పాత్రలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలో చిత్రీకరించిన ఫైట్స్‌, సౌండ్‌, పాటలను మనమింకా మరచిపోలేదంటే.. ఆ సినిమా చూపిన ఇంపాక్ట్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా 1990లో రీమేక్‌ చేస్తే..హిందీలో సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. 




Updated Date - 2020-10-05T17:29:17+05:30 IST