మరోసారి అలాంటి సినిమా చేయను: నాగశౌర్య

ABN , First Publish Date - 2020-02-08T03:19:55+05:30 IST

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష ముల్పూరి నిర్మించిన ‘అశ్వథ్థామ’ చిత్రం జనవరి 31న విడుదలై మంచి టాక్‌ని

మరోసారి అలాంటి సినిమా చేయను: నాగశౌర్య

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష ముల్పూరి నిర్మించిన ‘అశ్వథ్థామ’ చిత్రం జనవరి 31న విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. రమణతేజ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ సమర్పించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘‘తాను రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాననీ, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు శౌర్య చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. ఇందులో శౌర్య ఎవర్ని కొడుతున్నా, వాళ్లని అలాగే కొట్టాలనిపించింది. తను కథను బాగా రాసుకున్నాడు. కొడుకుతో హిట్ కొడితే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నిర్మాతల ముఖాల్లో తెలుస్తోంది’’ అని అన్నారు.


హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మౌత్ టాక్ వ్యాప్తి చెయ్యడం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్టయింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు చాలా థ్యాంక్స్. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చేయను. డైరెక్టర్ రమణతేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు చాలా బాగా ఈ సినిమా తీశాడు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ వేరే లెవల్లో కెమెరా పనితనం చూపించాడు. ఈ సినిమా పూర్తయ్యాక 7 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తిచేసి ఇచ్చిన జిబ్రాన్‌కు థ్యాంక్స్. స్టోరీలోని ఇంటెన్సిటీకి తగ్గట్లు అన్బరివు బ్రదర్స్ యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు. ఈ సినిమాలో విలన్‌గా చేసిన బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తా టాలీవుడ్‌లో సెటిలవుతారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.

Updated Date - 2020-02-08T03:19:55+05:30 IST