మోహన్‌బాబు నా గాడ్‌ఫాదర్‌!

ABN , First Publish Date - 2020-02-14T08:59:07+05:30 IST

‘‘ఒంటరి మనిషి రథాన్ని లాగలేడు. ఈ సినిమాకి మోహన్‌బాబు సార్‌ వంటి బలమైన నటుడు అవసరం. ఈ సినిమాలో ఆయన నాకు గాడ్‌ఫాదర్‌. మా ఇద్దరి కాంబినేషన్‌లో ...

మోహన్‌బాబు నా గాడ్‌ఫాదర్‌!

‘ఆకాశమే నీ హద్దురా’ పాట ఆవిష్కరణ వేడుకలో సూర్య  ఫ తొలిసారిగా గగనతలంలో వేడుక


‘‘ఒంటరి మనిషి రథాన్ని లాగలేడు. ఈ సినిమాకి మోహన్‌బాబు సార్‌ వంటి బలమైన నటుడు అవసరం. ఈ సినిమాలో ఆయన నాకు గాడ్‌ఫాదర్‌. మా ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి’’ అన్నారు నటుడు సూర్య. డెక్కన్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత జీఆర్‌ గోపినాథ్‌ జీవితకథతో సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలోని ఒక పాటను గురువారం మధ్యాహ్నం ఎగురుతున్న విమానంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ చరిత్రలోనే గగనతలంలో పాటను విడుదల చేయడం ఇదే తొలిసారి. స్పైస్‌ జెట్‌ బోయింగ్‌ 737 విమానంలో జరిగిన ఈ వేడుకలో సూర్య నిర్వహిస్తున్న అగరం ఫౌండేషన్‌కు సంబంధించిన 70 మంది చిన్నారులు కూడా పాల్గొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆ చిన్నారులకు విమానం ఎక్కాలన్న కలను సూర్య ఈ వేడుక ద్వారా నెరవేర్చారు. స్పైస్‌జెట్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌సింగ్‌, తెలుగు నట దిగ్గజం మోహన్‌బాబు, సీనియర్‌ నటుడు శివకుమార్‌, దర్శకురాలు సుధ కొంగర, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, సూర్య క్రమశిక్షణ కలిగిన నటుడని, ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందని అన్నారు. తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సూర్య మాట్లాడుతూ, ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన చెన్నై విమానాశ్రయ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన జీఆర్‌ గోపినాథ్‌ పాత్రలో నటించడం గౌరవంగా ఉందని, ఈ చిత్రాన్ని దర్శకుడు సుధ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. ముఖ్యంగా తెలుగు స్టార్‌ మోహన్‌బాబుతో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని సూర్య తెలిపారు.


Updated Date - 2020-02-14T08:59:07+05:30 IST