ఈ భూమికి మనం ఇచ్చే ప్రత్యుపకారం అదే: చిరంజీవి

ABN , First Publish Date - 2020-07-27T01:46:01+05:30 IST

రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. రాజకీయ నాయకులు, సినీ సెల‌బ్రిటీలు గ్రీన్ ఇండియా

ఈ భూమికి మనం ఇచ్చే ప్రత్యుపకారం అదే: చిరంజీవి

రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. రాజకీయ నాయకులు, సినీ సెల‌బ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. వారి స్నేహితులను ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ నామినేట్ చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి నాయకత్వంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొని మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు దూసుకుపోతున్న మా హీరో రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. కరోనా వైరస్ వల్ల మానవ శరీరంలో మొదటగా దెబ్బ తినేది ఊపిరితిత్తులు. గాలి పీల్చుకోలేక మనిషి చనిపోతున్నారంటే.. ప్రాణవాయువు ఊపిరితిత్తులకు ఎంత ముఖ్యమో.. ఈ కరోనా సమయంలో సామాన్యులకు కూడా తెలిసి వచ్చింది. ఈ భూమి తల్లికి కూడా అడవులు, వృక్షాలు ప్రాణవాయువును అందిస్తాయి. భూమికి ఊపిరితిత్తులు చెట్లు. అలాంటి ప్రాణవాయువును అందించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు.


మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు మనం అందించే గొప్ప సంపద. మొక్కలు మనం ఇచ్చే కాలుష్యాన్ని పీల్చుకుని మనకు ప్రాణవాయువును అందిస్తాయి. దీనిని గుర్తించిన సంతోష్‌గారు గత మూడు సంవత్సరాల నుంచి ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గతంలో కూడా ఒకసారి నేను పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. జూబ్లీహిల్స్ సొసైటీ ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. వారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ కూడా మొక్కలు నాటాలి. అదే మనం ఈ భూమికి తిరిగి ఇచ్చే ప్రత్యుపకారం..’’ అని తెలిపారు.

Updated Date - 2020-07-27T01:46:01+05:30 IST

Read more