టీటీడీ ఆస్తుల అమ్మకంపై మనోజ్ ట్వీట్
ABN , First Publish Date - 2020-05-25T22:19:14+05:30 IST
టీటీడీ ఆస్తుల అమ్మకంపై మంచు మనోజ్ తన ట్విట్టర్‌లో ఓ లెటర్‌ను విడుదల చేశారు. ఎందుకు అమ్ముతున్నారో? వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని ఆయన

టీటీడీ ఆస్తుల అమ్మకంపై మంచు మనోజ్ తన ట్విట్టర్‌లో ఓ లెటర్‌ను విడుదల చేశారు. ఎందుకు అమ్ముతున్నారో? వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని ఆయన తన లెటర్‌లో టీటీడీ పాలక మండలిని కోరారు. దేవుడేమన్నా చెప్పాడా? అడిగే హక్కు నాకుంది కాబట్టే అడుగుతున్నానంటూ.. ధైర్యంగా మంచు మనోజ్ ఓ అడుగు ముందుకేశారు. దీంతో మంచు మనోజ్‌పై .. ‘రియల్ హీరోకి అర్థం చెప్పారు’’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ మనోజ్ విడుదల చేసిన లెటర్‌లో ఏముందంటే..
‘‘ఓం నమో వేంకటేశాయ
టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మందిని, సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి. కొండపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయి అంటే ‘గోవిందా గోవిందా’ అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది. మోసం జరగట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే. ఏమీ లేదు సార్. ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే. జై హింద్..
మీ
మనోజ్ మంచు’’
Read more