మా తుఝే సలాం...

ABN , First Publish Date - 2020-12-29T09:54:52+05:30 IST

ఆస్కార్‌ పురస్కార గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మాతృమూర్తి కరీనా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు...

మా తుఝే సలాం...

ఆస్కార్‌ పురస్కార గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మాతృమూర్తి కరీనా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అదే రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరగడమే మరణానికి కారణమని ప్రాథమిక సమాచారం. కరీనా బేగం భర్త ఆర్‌.కె. శేఖర్‌ సైతం సంగీత దర్శకులే. ఆయన 1976లో మరణించారు. ఆర్‌.కె. శేఖర్‌, కరీనా దంపతులకు ఓ కుమారుడు ఏఆర్‌ రెహమాన్‌, ముగ్గురు కుమార్తెలు ఏఆర్‌ రిహానా, ఇష్రత్‌ ఖాద్రీ, ఫతిమా శేఖర్‌. భర్త మరణం తర్వాత నలుగురు పిల్లల్నీ కరీనా బేగం పెంచి పెద్ద చేశారు. రెహమాన్‌ సంగీత దర్శకుడు కాగా, రిహానా గాయని. చెన్నైలో ఫాతిమా సంగీత పాఠశాల, ఇష్రత్‌ సంగీత స్టూడియో నెలకొల్పారు. పలు సందర్భాలలో తమ తల్లి ఒంటరిగా తమను ఎలా పెంచిందీ పిల్లలు చెప్పుకొచ్చారు. తల్లి గొప్పతనాన్ని వివరించారు. సంగీత ప్రపంచంలో తాము ఈ స్థాయికి రావడానికి కారణం తమ తల్లే కారణమని, ఈ ఘనత అంతా ఆమెదేనని వెల్లడించారు. కరీనా మనవడు, రిహానా కుమారుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీత దర్శకుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. అతని సోదరి భవానీ శ్రీ తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నారు. వెబ్‌ సిరీస్‌, చిత్రాలు చేస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కజిన్స్‌ రహీమా, ఖతీజ, అమీన్‌ రెహమాన్‌ మ్యుజిషియన్స్‌. కరీనా బేగం మరణంతో కుటుంబమంతా శోక సంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్‌ సహా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.


మేరే పాస్‌ మా హై

తల్లి అంటే రెహమాన్‌కు ఎంతో ప్రేమ. ఆస్కార్‌ పురస్కారం వరించినప్పుడు, అంతకు ముందు సూపర్‌హిట్‌ ‘వందేమాతం’ ఆల్బమ్‌లో బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘మా తుఝే సలాం...’ బాణీ వెనుక సంగతులు చెప్పేటప్పుడు ఆయన తల్లిని గుర్తు చేసుకున్నారు. ఆమె గురించి గొప్పగా చెప్పారు. సినిమా ప్రపంచంలో చాలామంది ఆస్కార్‌ను ఆత్యున్నత పురస్కారంగా భావిస్తారు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికి ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో 2009లో రెహమాన్‌కు ఆస్కార్‌ లభించింది. వేదికపై అవార్డు అందుకున్న తర్వాత ‘‘ఓ హిందీ సినిమాలో ‘మేరే పాస్‌ మా హై’ అని డైలాగ్‌ ఉంది. దాని అర్థం ఏమిటంటే... ‘నా దగ్గర ఏమీ లేదు. కానీ, అమ్మ ఉంది’ అని! అలాగే అమ్మ నా దగ్గర ఉంది. ఆమె ఆశీస్సులు నాతో ఉన్నాయి’’ అని తల్లిపై తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని రెహమాన్‌ చాటుకున్నారు. ఒక సందర్భంలో ‘మా తుఝే సలాం...’ పాట గురించి ఆయన వివరిస్తూ... ‘‘మన అందరి జీవితాల్లో ఓ కామన్‌ ఫ్యాక్టర్‌ ఏంటంటే... మనం దైవాన్ని చూడలేం. అయితే... తల్లితండ్రుల ద్వారా భూమ్మీదకు వస్తాం. మనకు జన్మనిచ్చేది తల్లి. అది నా దృష్టిలో ఉంది. దేశభక్తి మీద పాటలు ఆదరణ పొందుతాయా? లేదా? అని మీమాంస ఓవైపు ఉంది. అప్పుడు దేశం గురించి మర్చిపోదాం. తల్లి కోసం ఓ పాట చేద్దామని ‘మా తుఝే సలాం...’ చేశా’’ అని పేర్కొన్నారు. తల్లితో ఎక్కువ సమయం గడపటం కోసం కొన్నేళ్లుగా విదేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు చేయడం తగ్గించారని చెన్నై వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-12-29T09:54:52+05:30 IST