‘లూజర్‌’.. గెలిచాడు

ABN , First Publish Date - 2020-06-08T22:40:54+05:30 IST

భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు అలాగే కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ ‘జీ 5’. ఇందులో 100కు పైగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి. తెలుగు

‘లూజర్‌’.. గెలిచాడు

భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు అలాగే కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ ‘జీ 5’. ఇందులో 100కు పైగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో మంచి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ వీక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. లాక్‌డౌన్‌ స్పెషల్‌గా విడుదలైన ‘అమృతం ద్వితీయం’ నవ్వులు పంచుతోంది. ఇటీవల ‘జీ 5’లో విడుదలైన ‘లూజర్‌’కి సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది. వీక్షకులతో పాటు విమర్శకులను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా వీడియో కాలింగ్‌ ద్వారా డిజిటల్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌లో ‘జీ 5’ సౌతిండియన్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల సహా ‘లూజర్’ టీమ్‌ పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో ‘జీ 5’ సౌతిండియన్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ ‘జీ 5’లో విడుదల చేసిన వెబ్‌ సిరీస్‌లు అన్నిటిలో ‘లూజర్‌’ టాప్‌లో ఉంది. ‘జీ 5’లో మాత్రమే కాదు, సౌతిండియాలో విడుదలైన వెబ్‌ సిరీస్‌లలో ‘లూజర్‌’ వన్నాఫ్‌ ది బెస్ట్‌ సిరీస్‌గా నిలిచిందని గర్వంగా చెప్పగలను. అభిలాష్‌ కథ చెప్పినప్పుడు 1980 నేపథ్యంలో క్రికెట్‌, 1990 నేపథ్యంలో బ్యాడ్మింటన్‌, 2000లో రైఫిల్‌ షూటింగ్‌ను ఎలా కనెక్ట్‌ చేస్తాడని అనుకున్నా. కంప్లీట్‌ ఎపిసోడ్‌ డీటెయిల్స్‌తో చెప్పినప్పుడు ఇంకా చాలా బాగుంది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ప్రియదర్శిని చూసినప్పుడు... తమ్ముడిని కొట్టే సన్నివేశంలో నిజంగానే కొడుతున్నాడా? అనిపించింది. విల్సన్‌ డోర్‌ పగలకొట్టి లోపలకి వచ్చినప్పుడు కోమలీ ప్రసాద్‌ ఇచ్చిన టిపికల్‌ హౌస్‌వైఫ్‌ రియాక్షన్‌... ప్రతి ఇక్కరూ పాత్రల్లో జీవించారు. ఎప్పుడూ పాతబస్తీకి వెళ్లని యానీ, రూబీ పాత్రలో ఎంతో అద్భుతంగా చేసింది. ‘జీ 5’ ఫ్యామిలీ తరఫున అద్భుతంగా నటించిన ‘లూజర్‌’ నటీనటులకు, గొప్ప వెబ్‌ సిరీస్‌ అందించిన అభిలాష్‌, ఇతర టెక్నికల్‌ టీమ్‌, నాణ్యతతో కూడిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ అందించే అన్నపూర్ణ స్టూడియోస్‌కి థ్యాంక్స్‌. వెబ్‌ సిరీస్‌లో సాంగ్స్‌ అంటే కొంచెం డౌట్‌ ఉంటుంది. ఫార్వార్డ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ, అభిలాష్‌ తొలి పాట వినిపించినప్పుడు మిగతా రెండు పాటలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురు చూశా’’ అని అన్నారు.


‘లూజర్‌’ దర్శకుడు అభిలాష్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు స్నేహితుడు మీర్‌ కస్టమ్‌ ఆఫీసు నుండి ఒక ఎయిర్‌ రైఫిల్‌ గన్‌ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులకు క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ తెలుసు. ఎయిర్‌ రైఫిల్‌ గురించి తెలియదు. అందులో స్ట్రగుల్‌ గురించి స్నేహితుడి ద్వారా నాకు తెలిసింది. ఆ లైన్‌ తీసుకొని క్యారెక్టర్స్‌, కథ రాసి ‘జీ 5’ ప్రసాద్‌గారికి చెప్పా. ఆయన కథ బాగా నచ్చిందన్నారు. వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్‌ సుప్రియ మేడమ్‌కి చెప్పా. ఆవిడకూ కథ బాగా నచ్చింది. నటీనటులు, ఇతర బృందమంతా కథను నమ్మారు. ‘చాలామంది కథ రాయడానికి ఏడాది పట్టిందా?’ అని అడిగారు. మూడు నెలల్లో రాశామంతే! నాతో పాటు భరద్వాజ్‌, శ్రవణ్‌ కథపై వర్క్‌ చేశారు’’ అన్నారు.


సంగీత దర్శకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ‘‘అభిలాష్‌, జీ 5, అన్నపూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్రమ్‌ మీడియా నెట్‌వర్క్‌, నా మ్యూజిక్‌ టీమ్‌కి థ్యాంక్స్‌. ఇంత క్వాలిటీ మ్యూజిక్‌ వచ్చిందంటే కారణం వాళ్లే. పాటలకు బాణీలు కట్టడం ప్రారంభించడానికి ముందే నేను, అభిలాష్‌ గంటల తరబడి చర్చించుకునేవాళ్లం. పాటలు ఎక్కడ కావాలి? ఎక్కడ వద్దు? అని డిస్కస్‌ చేసుకున్నాం. తర్వాత పాటలకు బాణీలు అందించా. పదేళ్లుగా అభిలాష్‌ నాకు తెలుసు. తన టేస్ట్‌ తెలియడం, నటీనటులు అద్భుతంగా నటించడంతో నా పని ఈజీ అయింది’’ అని అన్నారు.

ఇంకా ‘లూజర్‌’ సినిమాటోగ్రాఫర్‌ నరేష్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రతినిధి–క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ మహేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-06-08T22:40:54+05:30 IST