‘లవకుశ’ నాగరాజు ఇకలేరు

ABN , First Publish Date - 2020-09-08T06:05:40+05:30 IST

మహానటుడు ఎన్టీఆర్‌, అంజలీదేవి నటించిన మరుపురాని మధుర పౌరాణిక దృశ్యకావ్యం ‘లవకుశ’. గేవా కలర్‌లో రూపుదిద్దుకొన్న తొలి తెలుగు రంగుల చిత్రం ఇదే...

‘లవకుశ’ నాగరాజు ఇకలేరు

మహానటుడు ఎన్టీఆర్‌, అంజలీదేవి నటించిన మరుపురాని మధుర పౌరాణిక దృశ్యకావ్యం ‘లవకుశ’. గేవా కలర్‌లో రూపుదిద్దుకొన్న తొలి తెలుగు రంగుల చిత్రం ఇదే. ఇందులో లవకుశులుగా బాలనటులు నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. వీరిద్దరూ సినిమాకే హైలైట్‌గా నిలిచారు. ‘లవుడు’ అనపర్తి నాగరాజు సోమవారం ఉదయం హైదరాబాద్‌ గాంధీనగర్‌లో ఉన్న తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు 71 ఏళ్లు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్న ఆయనను ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల  చుట్టూ  తిప్పినా ఎవరూ చేర్చుకోలేదనీ, పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లారి కన్నుమూశారని నాగరాజు కుటుంబ సభ్యులు చెప్పారు. ‘నిజం చెప్పాలంటే సుబ్రహ్మణ్యం, నాగరాజులకు ‘లవకుశ’ తొలి చిత్రమే అయినా, విడుదలైన మొదటి సినిమా మాత్రం ‘సీతారామకల్యాణం’.


1959లో ప్రారంభమైన ‘లవకుశ’ 1963లో కానీ విడుదల కాలేదు. ఈ లోపు తన దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘సీతారామకల్యాణం’ (1961)లో వీళ్లిద్దరి చేత చిన్ననాటి రామలక్ష్మణుల పాత్రలు వేయించారు ఎన్టీఆర్‌. ‘లవకుశ’ తర్వాత కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించిన సుబ్రహ్యణ్యం ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి, దూరంగా వెళ్లిపోతే, నాగరాజు  మాత్రం నటననే నమ్ముకొని పరిశ్రమలోనే కొనసాగారు. ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో ‘శ్రీకృష్ణ సత్య’, ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రాల్లో లక్ష్మణుడి  పాత్రను పోషించారు. అలాగే శోభన్‌బాబు నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలోనూ లక్ష్మణుడిగా నటించారు. ఇవి కాకుండా ‘సిపాయి కూతురు’, ‘టైగర్‌ రాముడు’, ‘ఉమ్మడి కుటుంబం’ ‘భామావిజయం’ ‘బబ్రువాహన’ ‘అన్నదమ్ములు’, ‘లక్ష్మీకటాక్షం’, ‘భీష్మ’, ‘సత్యనారాయణ వ్రతమహాత్య్మం’, ‘అంతస్తులు’, ‘శ్రీకృష్ణావతారం’, ‘చక్రధారి’, ‘వినాయక విజయం’, ‘అష్టలక్షీవైభవం’ తదితర చిత్రాల్లో నటించారు. 18 ఏళ్ల క్రితమే చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిన నాగరాజు ‘పురాణగాధలు’, ‘కొమరం భీమ్‌’ తదితర టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు.

Updated Date - 2020-09-08T06:05:40+05:30 IST