లేడీ బ్రూస్‌లీ

ABN , First Publish Date - 2020-12-06T18:43:27+05:30 IST

వర్మ లేడీ బ్రూస్‌ల్లీ ఈ ‘లడ్కీ’.. మార్షల్‌ ఆర్ట్స్‌లో అందరిమెప్పును పొందిన పూజా భాలేకర్‌ ...

లేడీ బ్రూస్‌లీ

వర్మ లేడీ బ్రూస్‌ల్లీ ఈ ‘లడ్కీ’.. మార్షల్‌ ఆర్ట్స్‌లో అందరిమెప్పును పొందిన పూజా భాలేకర్‌ ... ఈ చిత్రంలో చేయని సాహసం లేదు...


బ్రూస్‌లీ ఈ భూమ్మీద జీవించింది 33 ఏళ్లే. ఆయన మరణించి కూడా 47 ఏళ్లవుతోంది. కానీ ఆయన అభిమానుల సంఖ్య నేటికీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. బ్రూస్‌లీ వీరాభిమానుల్లో రామ్‌గోపాల్‌వర్మ కూడా ఒకరు. బ్రూస్‌లీకి నివాళిగా ఆయన చాలా రోజుల నుంచీ ‘లడ్కీ’ చిత్రం తీస్తున్నారు. అందులో ప్రముఖ పాత్ర పోషిస్తోన్న పూజా భాలేకర్‌ను లేడీ బ్రూస్‌లీగా అందరూ ప్రశంసిస్తున్నారు...  మార్షల్‌ఆర్ట్స్‌తో సినిమా చేయడమే ఒక అద్భుతం. ఇండియాలో ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నం పూర్తిస్థాయిలో ఎవరూ చేయలేదు. ఈ చిత్రం ట్రయిలర్‌ చూసిన వాళ్లు... పూజ చేసిన విన్యాసాలకు ఆశ్చర్యపోతున్నారు.. 


 ఆర్జీవీ ఏం చేసినా ఓ సంచలనమే. బ్రూస్‌లీకి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ మాదిరిగా ‘ఎంటర్‌ ది లేడీ డ్రాగన్‌ (లడ్కీగా ఇటీవల పేరు మార్చారు)’ పేరుతో సినిమాను తీస్తున్నాడు. బ్రూస్‌లీని తలపించే హీరోయిన్‌ పాత్ర కోసం వేట సాగించాడు. ఆఖరుకు పూజా భాలేకర్‌ను ఎంపిక చేశాడు. కెమెరా జిమ్మిక్కులతో తెరపై ఎవరినైనా బ్రూస్‌లీలా చేయవచ్చనుకుంటే పొరపాటే. మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్లు కూడా బ్రూస్‌లీ లాంటి విన్యాసాలు చేయడం అసాధ్యం. కానీ పూజ ఎంతో పట్టుదలతో బ్రూస్‌లీని గుర్తుచేసేలా నటించింది. 


పుణెలో పుట్టి పెరిగిన మరాఠీ ముద్దుగుమ్మ పూజ భాలేకర్‌. పూజకు చిన్నప్పటి నుంచీ బ్రూస్‌లీ అంటే ఇష్టం. స్కూల్లో చదువుల కంటే మైదానాల్లో క్రీడలంటేనే ఆసక్తి. యోగా కూడా నేర్చుకుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో యోగాసన కార్యక్రమాల్లో పాల్గొంది. క్రమంగా ఆమె మనసు పరుగుపందాలపై పడింది. అథ్లెట్‌గా తనని తాను తీర్చిదిద్దుకుంది. 100 మీటర్ల పరుగు పందాల్లో మెడల్స్‌ గెలుచుకుంది. హై జంప్‌, 400 మీటర్ల హర్డిల్స్‌లో కూడా తన ప్రతిభను చాటింది. 


గోల్డ్‌ మెడలిస్ట్‌

ఓ రోజు కొందరు విద్యార్ధులు తెల్ల దుస్తులు వేసుకుని తైక్వాండో చేయడం చూసింది. అదో రకమైన మార్షల్‌ ఆర్ట్స్‌ అని తెలుసుకుంది. తనలో ఆలోచనలు మొదలయ్యాయి. తైక్వాండోనే జీవితంగా చేసుకోవాలి అనుకుంది. తన నిర్ణయాన్ని అమ్మకు చెప్పింది. కూతురు ఏం చేసినా ఆమెకు కొండంత అండగా నిలవాలన్నది ఆ తల్లి కృతనిశ్చయం. స్వతహాగా క్రీడాకారిణి అయిన పూజను మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆరితేరేలా చేసింది. యోగా వల్ల ఏకాగ్రతతో పాటు శరీరాన్ని ఏవిధంగానైనా వంచగల శక్తి చేకూరింది. ఆ సాధనే ఏడాది తిరిగేలోపే జాతీయ స్థాయి ఛాంపియన్‌గా ఆమెను నిలబెట్టింది. జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌, నేషనల్‌, ఇంటర్నేషనల్‌ స్థాయిలో అనేక తైక్వాండో టోర్నమెంట్స్‌లో పాల్గొనడమే కాకుండా పతకాలను సాధించింది. ఉత్తమ క్రీడాకారిణిగా మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డులనూ గెలుచుకుంది. ‘మార్షల్‌ ఆర్ట్స్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించిన క్షణాల్ని ఈనాటికీ మరచిపోలేను’ అంటుంది పూజ. 


తైక్వాండాలో ప్రదర్శనలే పూజను ఆర్జీవీ కళ్లలో పడేలా చేశాయి. ఓరోజు ముంబయిలోని ఆర్జీవీ ఆఫీసు నుంచి పూజకు ఫోన్‌ వచ్చింది ఓసారి వచ్చి కలవమని. ఆశ్చర్యంతో పొంగిపోయింది. అంత పెద్ద దర్శకుడిని కలిసే అవకాశం లక్షల్లో ఒకరికే వస్తుందని. తండ్రితో పాటు ముంబయి వెళ్లి రామ్‌గోపాల్‌ వర్మని కలుసుకుంది. ఆయన కొన్ని మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు చేయమని కోరాడు. బ్రూస్‌లీ కళ్లలోని కసి, మెరుపు పూజలో కన్పించాయి. తన చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసుకుంటున్నట్టుగా వెంటనే ఆర్జీవీ తెలియజేశాడు. ఎగిరి గంతేసింది పూజ. అయితే బ్రూస్‌ లీ స్టైల్‌ కి సంబంధించిన ‘జిట్‌ కున్‌ డో’ లో ప్రత్యేక శిక్షణ తీసుకోమని వర్మ సూచించారు. ఆనాటి నుంచి సీరియస్‌గా బ్రూస్‌లీ తరహా మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ‘ఈ ప్రపంచంలో ఎవ్వరూ బ్రూస్‌లీ స్థాయిని అందుకోలేరు కానీ బ్రూస్‌లీ అభిమానిగా ‘లడ్కీ’లో నటించడం గొప్ప అనుభూతి’ అని చెప్పే పూజ మాటల్లో నిజాయితీ కన్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘లడ్కీ’ చిత్ర ట్రైలర్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు అందరి ప్రశంసల్నీ అందుకుంటోంది. పాటలు, సంగీతం చిత్రంపై అంచనాలను పెంచేస్తున్నాయి. పోరాట సన్నివేశాలలో పూజ మెరిసింది. ఇరవై ఆరేళ్ల యువతి ఇతంటి కఠినమైన విన్యాసాలు చేయడం అసాధారణ విషయం.


వావ్‌ స్టంట్స్‌

వాట్‌ ఏ పవర్‌ఫుట్‌ ఉమెన్‌ యు ఆర్‌? నీలాగ చేయడం మరొకరికి అసాధ్యం. నీ అకుంఠిత దీక్ష, పట్టుదలకు జోహార్లు. నీ ఈ అనితరసాధ్యమైన ప్రయత్నాలకు అగ్నిపర్వతంలా ప్రశంసలు ఎగిరిపడతాయి, సిద్ధంగా ఉండు.


- సునిధి చౌహాన్‌ (గాయని)

ది గర్ల్‌ ఈజ్‌ డేంజరస్‌లీ ఫెంటాస్టిక్‌

- పూరి జగన్నాథ్‌


మొట్టమొదటి సారిగా ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ చిత్రంతో బ్రూస్‌లీ గురించి తెలిసింది. ఆయనకు పేద్ద అభిమానిగా మారాను. కలలాంటి మనిషి బ్రూస్‌లీ. నేను, నా లాంటి లక్షలాది మంది ఆయనలా ఉండాలని కోరుకుంటాం. ఆయన ఆర్ట్‌ని నేర్చుకుందామని ప్రయత్నించా, కానీ బ్రూస్‌లీ దరిదాపులకు కూడా వెళ్లడం అసాధ్యమని కొన్ని సెషన్స్‌ తరవాత అర్థమై విరమించా. మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌ కావాలన్న కలలని విడిచిపెట్టి, సులభమైన, శ్రమ తక్కువగా ఉండే ఫిల్మ్‌ మేకింగ్‌ను ఎంచుకున్నా. నాలా బ్రూస్‌లీ అంటే ఎంతో పిచ్చి ఉన్న ఓ యువతికి సంబంధించిన కథే ‘లడ్కీ’. నా ప్రతిష్ఠాత్మక చిత్రం. నిజమైన మార్షల్‌ ఆర్టిస్టే ఈ పాత్రలో నటించింది.


రామ్‌గోపాల్‌ వర్మ

Updated Date - 2020-12-06T18:43:27+05:30 IST