లచ్చ గుమ్మడి గుమ్మడిరా...

ABN , First Publish Date - 2020-10-30T07:30:39+05:30 IST

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్‌ ఇండియా’. ఈ సినిమాలోని ‘లచ్చ గుమ్మడి’ గీతాన్ని చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది...

లచ్చ గుమ్మడి గుమ్మడిరా...

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్‌ ఇండియా’. ఈ సినిమాలోని ‘లచ్చ గుమ్మడి’ గీతాన్ని చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. జానపదంలా సాగిపోయే ఈ పాట యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ సంపాదించింది. బాణీనే కాదు... సాహిత్యం కూడా ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరిస్తోంది. ఆ సాహిత్యం అందించింది ఎవరో కాదు... అతికొద్ది కాలంలోనే మంచి రచయితగా పేరు తెచ్చుకున్న త్రిపురనేని కల్యాణ చక్రవర్తి


‘లచ్చ గుమ్మడి...’ పాట వెనక కథ ఆయన మాటల్లోనే... 

ఇది ఒక సాధారణ కాలేజీ అమ్మాయి కథ. చదువు పూర్తయి కాలేజీ టూర్‌కు వెళుతుంది. కానీ అమ్మాయి తల్లితండ్రులకు అది ఇష్టం ఉండదు. ఆమె ఏది చేస్తానన్నా నిరుత్సాహపరుస్తుంటారు. తనలో అంత బాధను పెట్టుకుని కూడా చుట్టూ ఉన్నవారికి సంతోషం పంచుతుంది. ఆ సందర్భంలో రాసిందే ‘లచ్చ గుమ్మడి గుమ్మడిరా...’ పాట. దర్శకుడు నరేంద్రనాథ్‌ మంచి లైన్‌ చెప్పారు. లొకేషన్‌ చూపించారు. పాత్ర తీరు వివరించారు. తమన్‌ మంచి బాణీ ఇచ్చారు. కవిగా స్పందించడానికి ఇంతకంటే ప్రేరణ ఇంకేం కావాలి!  


పచ్చి పచ్చి మట్టి జాలే పుట్టుకొచ్చె ఈ వేళ 

గడ్డిపోచ గజ్జే కట్టి దమ్కులాడే ఈ నేల 

గట్టు దాటి పల్లే తేటి పాటే కట్టే బొంకల్లా 

పట్టలేని పోలికలోనా పడుసు నవ్వే తుమ్మెదలా... 

...అంటూ హీరోయిన్‌ పాత్రను ప్రతిబించేలా పాట మొదలవుతుంది. ఆ తరువాత చరణంలో... 

మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా... ఓ గోగుల గొంగడి రా 

ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా 

లచ్చ గుమ్మడి గుమ్మడి రా... ఏడు మల్లెల అందమురా 

ఈ ఒప్పుల కుప్పుకు మన్నూ మిన్నూ కన్నేరా... 


అంటూ సాగుతుంది పాట. సాధారణంగా ‘గొంగడి’ని నెగటివ్‌లో వాడేస్తుంటారు. అంటే అది గుచ్చుకుంటుందని. కానీ గొంగడి ఎంత గుచ్చుకొంటుందో అంతగా మనల్ని చలి నుంచి రక్షిస్తుంది. దర్శకుడు నరేంద్రనాథ్‌ అడిగారు... ‘ఇప్పుడు చాలామందికి నెగెటివ్‌గా ఆలోచించడం అలవాటైంది. అందుకే నెగెటివ్‌ నుంచి పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచించేలా పాట ఉండాలి’ అని! ఆ మాటలకు స్పందించి జొప్పించిన పదమే ‘గోగుల గొంగడి’. ఏదైనా మన ఆలోచనా విధానంలోనే ఉంటుందని చెప్పే ప్రయత్నం. ఇక్కడ హీరోయిన్‌ పాత్ర కూడా అలాంటిదే. ఆడపిల్ల అని అక్కర్లేని కట్టుబాట్లతో స్వేచ్ఛనివ్వరు ఆమె తల్లితండ్రులు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదం పక్కనే ప్రశాంతత ఉంటుంది. గెలుపు పక్కనే ఓటమి ఉంటుంది. అంతేకానీ గెలుపునకు ఓటమి వ్యతిరేక పదం కానేకాదని చెప్పడమే నా ఉద్దేశం. మధ్యలో ‘అనగననగ రాగమతిశయిల్లుచునుండు...’ అనే వేమన పద్యం స్ఫూర్తితో... ‘అనగా అనగా రాగమదే అవగా... తినగా తినగా చేదైన తీపిగా’ అంటూ రాశాను. నా పాటల్లో కొంత తర్కం కూడా ఉంటుంది. నీ దుఃఖానికి, సంతోషానికి ఎవరూ కారణం కాదు... నువ్వేనని ఆదిశంకరాచార్యులవారు చెప్పారు. దాన్నే నేను మరోలా... ‘నువ్వు చూసే లోకంలో ప్రతిచోటా నువ్వేలే... ఎదురయ్యే కన్నీళ్లే కంటుంది నీ కళ్లే’ అని పాటలా చెప్పాను. 


ఇక పల్లెటూరి గిరిజనులు పాడుకొనే పదాల్లో నుంచి తెచ్చిందే ‘లచ్చ గుమ్మడి’. అంటే లక్ష్మీదేవి అని. అలాగే ‘ఏడు మల్లెల అందంరా’ కూడా! పాటను అరకులో తీశారు. అక్కడి పల్లె పదాలు... ఆ మట్టి వాసనలు... ప్రతిదీ స్పృశించాను. ఏది రాసినా సాధ్యమైనంతవరకు అచ్చమైన తెలుగు పదాలు ఉండేలా చూసుకొంటాను.


భాషపై మమకారం, పట్టు నాకు పాఠశాలలోనే అబ్బాయి. మా నాన్నగారిది గుడివాడ దగ్గర అంగలూరు అయినా నేను పెరిగిందంతా కోదాడ పక్కన మేళ్లచెరువులో. మా తాతగారు త్రిపురనేని రామస్వామిచౌదరి గారు పండితులు. ఆ వంశంలో పుట్టినందుకు నాకు కూడా సాహిత్యంపై మక్కువ కలిగింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఫైనాన్స్‌లో ఎంబీయే అయిపోగానే ఐదేళ్లు ఎల్‌అండ్‌టీలో ఉద్యోగం చేశాను. తరువాత తెలంగాణ రెవెన్యూ విభాగంలో కొలువు. అయితే సినీరంగంపై ఆసక్తితో 2018లో ఉద్యోగం వదిలేశాను. నేను తొలి పాట రాసిన సినిమా ‘118’. ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు, తమన్‌గారు ఎంతో ప్రోత్సాహం అందించారు. అలా ఇప్పటికి యాభైకి పైగా పాటలు రాశాను. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో రాసిన టైటిల్‌ సాంగ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

Updated Date - 2020-10-30T07:30:39+05:30 IST