కోటీటీ!
ABN , First Publish Date - 2020-10-05T08:06:25+05:30 IST
బీటౌన్ బడా హీరోలు ఓసారి ‘కో’ అంటే చాలు... కోట్లకు కోట్ల రూపాయలే! ‘ఓటీటీ’ చిత్రాలు చేయడానికి...

బీటౌన్ బడా హీరోలు
ఓసారి ‘కో’ అంటే చాలు...
కోట్లకు కోట్ల రూపాయలే!
‘ఓటీటీ’ చిత్రాలు చేయడానికి
వాళ్లు ‘ఓ యస్’ అంటే చాలు...
కోట్లు కుమ్మరించడానికి సిద్ధమే!
వెండితెర నుంచి డిజిటల్ తెరకు తారలు దిగి వస్తున్నారు.. అదే సమయంలో పారితోషికాలు మాత్రం దిగి రావడం లేదు! వెండితెర తారాలోకాన్ని డిజిటల్ తెరకు తీసుకురావడానికి పారితోషికాల రూపంలో కోట్లు కుమ్మరించడానికి ఓటీటీ వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ వెండితెర చిత్రాలకు మాత్రమే పరిమితమైన స్టార్లు, డిజిటల్ తెర కోసం రూపొందే చిత్రాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ తదితర స్టార్లు ఓటీటీ చిత్రాలకు ‘ఓ యస్’ అనేశారు. షారుఖ్ ఖాన్‌తో ఓటీటీ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. వీళ్లందరూ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘ఓటీటీ’ (ఓవర్ ద టాప్) చిత్రాలకు పారితోషికాలు అందుకుంటున్నారని ముంబై ఖబర్.
తమిళ కథానాయకుడు సూర్య నటించిన ‘అకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని హిందీలో షారుఖ్ ఖాన్‌తో రీమేక్ చేయాలని నిర్మాతలలో ఒకరైన గునీత్ మోంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, థియేటర్లలో విడుదల చేయడానికి కాకుండా ఓటీటీ కోసం చేద్దామని హీరోని సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సఫలీకృతం అయితే షారుఖ్ కూడా డిజిటల్ తెరపైకి వస్తారు. అజయ్ దేవగణ్‌తో ఓటీటీ కోసం హాట్‌స్టార్ ఓ ప్రాజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని సమాచారం.
‘సెక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ... ‘ద ఫ్యామిలీ మ్యాన్’తో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి ‘బ్రీత్’తో మాధవన్ ఓటీటీలో విజయాలు అందుకున్నారు. ‘బ్రీత్: ఇన్‌టు ద షాడోష్’తో అభిషేక్ బచ్చన్ సైతం డిజిటల్ తెరపైకి వచ్చారు. వీళ్లెవరికీ అగ్ర కథానాయకులకు అందిన స్థాయిలో పారితోషికాలు అందలేదట!
అక్షయ్ కుమార్ - రూ. 90 కోట్లు
హిందీలో అత్యధిక పారితోషికం అందుకొనే కథానాయకుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఒక్కో చిత్రానికి దగ్గర దగ్గరగా వంద కోట్లు తీసుకుంటారని వినికిడి. వెబ్ సిరీస్ కోసమూ ఆయన అదే స్థాయిలో తీసుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఆయనో సిరీస్ ‘ద ఎండ్’ (వర్కింగ్ టైటిల్) చేస్తున్న సంగతి తెలిసిందే. మండే అగ్నిగోళం తరహాలో దుస్తులకు మంటలు అంటించుకుని సిరీస్ ప్రకటించిన రోజున వేదికపై సాహసానికి ఒడిగట్టారు. ‘ద ఎండ్’కి అక్షయ్ రూ. 90 కోట్లు తీసుకుంటున్నారని టాక్.
షాహిద్ కపూర్ - రూ.100 కోట్లు
హిందీలో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి షాహిద్ కపూర్ భారీ విజయం అందుకున్నారు. దాంతో క్రేజ్ పెరిగింది. అతని దగ్గరకు నెట్‌ఫ్లిక్స్ వెళ్లి రూ. 100 కోట్లు ఆఫర్ చేసింది. అయితే, రూ. 100 కోట్లూ ఒక్క సిరీస్ కోసం కాదని సమాచారం. ఓ సిరీస్ సహా కొన్ని ప్రాజెక్టులు చేయాలనే ప్రతిపాదన ముందుంచిందట. అందుకు షాహిద్ ‘సరే’ అన్నారని
తెలిసింది. ‘కబీర్ సింగ్’కి విజయం తర్వాత ఒక్కో చిత్రానికి అతను రూ. 35 - 40 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ముంబై వర్గాలు అంటున్నాయి. అంతకు ముందు తక్కువే ఉండేది.
ఫిల్మ్ సిరీస్ బడ్జెట్ -రూ. 200 కోట్లు
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. అందులోని రెండు చిత్రాల్లో కట్రీనా కైఫ్ కథానాయికగా నటించారు. ఇప్పుడు ఆమెతో అలీ అబ్బాస్ జాఫర్ ఓ సూపర్‌హీరో ఫిల్మ్ సిరీస్ చేస్తున్నారు. సుమారు రూ. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రెండు చిత్రాల సిరీస్‌గా ఓటీటీ కోసం చేస్తున్నారట. కట్రీనా కైఫ్‌కి ఎంతిస్తున్నారనేది బయటకు రాలేదు కానీ ఓ చిత్రానికి తీసుకొనే దానితో పోలిస్తే ఎక్కువే
ముట్టజెబుతారని అంటున్నారు.
హృతిక్ రోషన్ - రూ.75-80 కోట్లు
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ కోసం హృతిక్ రోషన్ ఓ వెబ్ సిరీస్ చేయనున్నారు. హాలీవుడ్ సిరీస్ ‘ద నైట్ మేనేజర్’కి రీమేక్ అట. అందులో టామ్ హిడిల్‌స్టన్ పోషించిన పాత్రలో హృతిక్ కనిపించనున్నారు. దీనికి ఆయన రూ. 75-80 కోట్లు తీసుకుంటున్నట్టు వినికిడి. ‘వార్’ చిత్రానికి హృతిక్ రూ. 50 కోట్లు తీసుకున్నారట. వెబ్ సిరీస్‌కి ఎక్కువ కాల్‌షీట్లు కేటాయించాలి కనుక పారితోషికం పెరిగిందనీ, ప్రేక్షకుల్లో హృతిక్ క్రేజ్ దృష్ట్యా ఓటీటీ వేదిక అంత ఇవ్వడానికి ముందుకొచ్చిందనీ సమాచారం.
Read more