కిరాక్ ఆర్పీ దర్శకత్వంలో నూతన చిత్రం ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-23T21:28:35+05:30 IST
జబర్థస్త్ కామెడీ షోతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమెడియన్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారబోతున్నాడు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కోవూరు

జబర్థస్త్ కామెడీ షోతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమెడియన్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారబోతున్నాడు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్పీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రొడక్షన్ నెం 1 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను జె.డి. చక్రవర్తి పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ మూవీ ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమానికి వెండితెర, బుల్లితెర రంగాలకి చెందిన పలువురు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిలో జె.డి. చక్రవర్తితో పాటు, మెగా బ్రదర్ నాగబాబు, జబర్ధస్త్ కామెడీ షోకి చెందిన ఆర్టిస్టులు ఉన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా జబర్థస్త్ కామెడీ షో ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను. నా మీద నమ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలంగారు సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా, నా డైరక్షన్‌లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జె.డి. చక్రవర్తి కీలక పాత్ర పోషించడానికి అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జె.డి. పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది. జె.డి. చక్రవర్తితో పాటు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, జబర్థస్త్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.
