‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించిన సంజన అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-08T17:10:36+05:30 IST

కర్ణాటకలో డ్రగ్స్ మాఫియా హడలెత్తిస్తోంది. ప్రస్తుతం సీసీబీ అదుపులో ఉన్న వారు ఎవరి పేర్లు బహిరంగం చేస్తారోననే...

‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించిన సంజన అరెస్ట్

బెంగళూరు: కర్ణాటకలో డ్రగ్స్ మాఫియా హడలెత్తిస్తోంది. ప్రస్తుతం సీసీబీ అదుపులో ఉన్న వారు ఎవరి పేర్లు బహిరంగం చేస్తారోననే గుబులు సినిమా, పారిశ్రామిక, రాజకీయ రంగాలను కుదిపేస్తోంది. శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ డ్రగ్స్ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) తాజాగా సినీ నటి సంజన గల్రానీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంజన బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించింది.


కన్నడ చిత్రం దండుపాళ్యంలో ఆమె పోషించిన పాత్రకు సంజన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ ఉదయం బెంగళూరులో ఆమె నివాసముంటున్న ఇందిరా నగర్ ఇంట్లో సీసీబీ సోదాలు నిర్వహించింది. అనంతరం.. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీసీబీ ఆఫీస్‌లో ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మాఫియాతో రాహుల్‌కు సంబంధాలున్నట్లు తేల్చారు.


రాహుల్ అరెస్ట్ అనంతరం.. సంజన కొందరు విమర్శకులకు ఘాటుగా సమాధానమిచ్చింది. డ్రగ్స్ మాఫియా, సినీ తారలపై గడచిన వారం రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగిపై సంజన విరుచుకుపడింది. సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సంజన.. ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌తో తనకు పరిచయం లేదని చెప్పింది.


ప్రశాంత్ సంబరగిని వీధికుక్కతో పోల్చుతూ ‘ఆయనను వదలద్దండి’ అంటూ విరుచుకుపడింది. డ్రగ్స్‌తో సంబంధం లేకున్నా తన పేరును తెరపైకి తెచ్చారని చెప్పుకొచ్చింది. సెలబ్రెటీ అయినందునే తనను టార్గెట్ చేశారని, అయితే సంబరగి మాత్రం చీర్‌గర్ల్ అంటూ ఆరోపించారని ఉద్వేగానికి లోనైన సంజనా కంటతడి పెట్టుకుంది. రాహుల్ తనకు సోదరుడు లాంటి వాడని ఆ విషయంలో వెనుకడుగే లేదన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే సంజనా కూడా అరెస్ట్ కావడం గమనార్హం.

Updated Date - 2020-09-08T17:10:36+05:30 IST