ఓటీటీలో జేమ్స్‌ బాండ్‌?

ABN , First Publish Date - 2020-10-28T07:03:22+05:30 IST

మనకు దీపావళి, దసరా సీజన్‌ ఉన్నట్లే- హాలీవుడ్‌లో ప్రతి క్రిస్ట్‌మస్‌కు అనేక బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. కోవిడ్‌ రావటంతో...

ఓటీటీలో జేమ్స్‌ బాండ్‌?

మనకు దీపావళి, దసరా సీజన్‌ ఉన్నట్లే- హాలీవుడ్‌లో ప్రతి క్రిస్ట్‌మస్‌కు అనేక బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. కోవిడ్‌ రావటంతో ఇప్పటికే విడుదల కావాల్సిన చిత్రాలు పెండింగ్‌లో పడిపోయాయి. అమెరికాలోను, యూరప్‌లోను కోవిడ్‌ తగ్గిందని ధియేటర్లను తెరవటం ప్రారంభించారు. కానీ మళ్లీ కోవిడ్‌ 2 విజృంభిస్తోందనే వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ క్రిస్టమస్‌ సీజన్‌లో విడుదలయ్యే చిత్రాలు కూడా వాయిదా పడే అవకాశముంది. దీనితో అనేక హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థలు తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘నో టైమ్‌ టూ డై’ను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. 


జేమ్స్‌ బాండ్‌ చిత్రం వచ్చిదంటే ప్రేక్షకులకు పండగ.  జేమ్స్‌ బాండ్‌ చేసే ఛేజ్‌లు, ఫైట్లు, రొమాన్స్‌- ఇవన్నీ పెద్ద స్ర్కీన్‌పై చూస్తే వచ్చే మజానే వేరనేది అనేక మంది అభిప్రాయం. అయితే ఈ సినిమాను కోవిడ్‌ పెద్ద దెబ్బ కొట్టింది. దీనితో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేస్తామని ఈ సినిమా నిర్మాణ సంస్థ ఎంజీఎం ప్రకటించింది. 25 కోట్ల డాలర్లతో (రూ. 1750 కోట్లు) నిర్మించిన ఈ సినిమా విడుదలలో జాప్యం జరగటం వల్ల ఎంజీఎం సంస్థకు రోజు రోజుకు నష్టాలు పెరిగిపోతున్నాయి. విడుదలలో జరిగిన జాప్యాల వల్ల ఇప్పటికే ఈ సంస్థ 2.5 కోట్ల డాలర్లు (రూ. 175 కోట్లు) నష్టపోయిందని పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో అనుకున్నట్లు విడుదల కాకపోతే ఈ నష్టాలు మరింతగా పెరిగే అవకాశముంది. దీనిని ఒక అవకాశంగా తీసుకున్న- నెట్‌ఫ్లిక్స్‌, యాపిల్‌ కంపెనీలు తమ ద్వారా ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఎంజీఎం సంస్థను కోరి.. చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎంజీఎం ఈ చిత్రానికి 60 కోట్ల డాలర్లు (రూ. 4200 కోట్లు) అడుగుతోందని.. అంత మొత్తం ఇవ్వటానికి ఈ సంస్థలు సిద్ధంగా లేవని హాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ వరకూ ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే మాత్రం- బాండ్‌ కూడా ఓటీటీకి రాకతప్పకపోవచ్చు. 


ఇప్పటికే..

ఎంజీఎం సంస్థ ఓటీటీలో తమ చిత్రాన్ని విడుదల చేయటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటే- ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న టెనెట్‌ చిత్రాన్ని అమెరికాలో గత నెల 3వ తేదీనే విడుదల చేశారు. వాస్తవానికి ఈ చిత్రం- అమెరికాతో పాటుగా భారత్‌లో కూడా విడుదలవ్వాల్సి ఉంది. కానీ మన దేశంలో ధియేటర్లు తెరవకపోవటం వల్ల దీనిని విడుదల చేయలేదు. అయితే విడుదలయిన యూరప్‌, అమెరికాలలో మాత్రం టెనెట్‌ ఇప్పటి దాకా 33.4 కోట్ల డాలర్లు (రూ. 2228 కోట్లు) వసూలు చేసింది. అయితే ఈ వసూళ్లు అంత సంతృప్తికరంగా లేవని.. టెనెట్‌కు ఉన్న క్రేజ్‌కు ఇంకా సొమ్ము రావాల్సి ఉందనేది విమర్శకులు భావన. అయితే ఎక్కువ వసూళ్లు రాకపోయినా పర్వాలేదని.. ఇప్పుడప్పుడే కోవిడ్‌ తగ్గే అవకాశం లేదనేవారు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే  యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ ‘ద ఇన్‌విజిబుల్‌ మ్యాన్‌ అండ్‌ ఎమ్మా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేసింది. అలాగే మరో భారీ చిత్రం ‘ములన్‌’ చిత్రనిర్మాతలు  కూడా థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచన మానుకొని  డిస్నీ ప్లస్‌లో సెప్టెంబర్‌లో విడుదల చేశారు. అదే బాటలో నడుస్తూ జూలైలో ‘హామిల్టన్‌’ చిత్రాన్నీ ఓటీటీలో విడుదల చేశారు. మరో హాలీవుడ్‌ చిత్రం ‘సోల్‌’ డిసెంబర్‌లో డిజిటల్‌ మీడియా ద్వారానే విడుదల కానుంది. 


త్వరలోనే ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు..

డెత్‌ ఇన్‌ ది నైల్‌

మర్డర్‌ ఇన్‌ ది ఓరియంటల్‌ ఎక్స్‌ప్రెస్‌ సినిమాకు సీక్వెల్‌గా రానున్న చిత్రం ఇది. గాల్‌ గోడెట్‌, ఆర్ని హేమర్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం కోసం అనేక మంది హాలీవుడ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


వండర్‌ ఉమెన్‌

గాల్‌ గోడెట్‌, క్రిస్‌డైన్‌లు నటించిన ఈ చిత్రం మహిళలను కొత్త కోణం నుంచి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు. 


డ్యూన్‌

ఫ్రాండ్‌ హెబర్ట్‌ అనే రచయిత రాసిన నవల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. దీనిపై కూడా అనేక అంచనాలున్నాయి. 

Updated Date - 2020-10-28T07:03:22+05:30 IST