ఇది నాకెంతో సంతోషం

ABN , First Publish Date - 2020-02-26T05:39:19+05:30 IST

నాలుగు వందలకుపైగా చిత్రాలలో పాత్ర పోషణ చేసిన నటుడిగా, పత్రికా సంపాదకుడిగా, రచయితగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రావి కొండలరావు...

ఇది నాకెంతో సంతోషం

నాలుగు వందలకుపైగా చిత్రాలలో పాత్ర పోషణ చేసిన  నటుడిగా,  పత్రికా సంపాదకుడిగా,  రచయితగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రావి కొండలరావు. ఆయనపై ‘ప్రత్యేక పోస్టల్‌ కవర్‌’ తాజాగా విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌ అబిడ్స్‌ తపాలా కార్యాలయంలో ఆ కవర్‌ను తెలంగాణా సర్కిల్‌ ఛీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ సంధ్యారాణి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కె.వి.రమణాచారి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  రావి కొండలరావు మాట్లాడుతూ ‘‘మా నాన్న తపాలాశాఖలో పనిచేశారు. నేను ఆడిన నాటకాలు ఆయన చూసేవారు. కానీ ఆ సమయంలో నేను ఎంచుకున్న దారి ఆయనకు నచ్చేది కాదు. ఓసారి మా ఊళ్లో నాటకం ఆడుతుంటే అందులో నన్ను గుర్తించక ‘ఈ కుర్రాడు ఎవరో బాగా చేస్తున్నాడు’ అని స్నేహితుడితో అన్నారట. ‘మీ కొండలరావే’ అని ఆయన చెప్పగా స్టేజ్‌ మీదకు వచ్చి తల మీద మొట్టికాయలు వేస్తూ ఇంటికి తీసుకెళ్లారు. నాపై ఇవాళ ఓ ప్రత్యేక తపాలా కవర్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని భావోద్వేగంతో అన్నారు. తెలంగాణా సర్కిల్‌ ఛీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ సంధ్యారాణి మాట్లాడుతూ  ‘‘రావి కొండలరావుగారి తండ్రి చిదంబరం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి 1940లో రిటైర్‌ అయ్యారు. కొండలరావు మా తపాలా కుటుంబ సభ్యుడే’’ అని చెప్పారు. ‘‘రావి కొండలరావు నాటకాలు చూసి స్ఫూర్తి పొందేవాణ్ణి. ఆయన రాసిన ఎన్నో కథలు చదివా. ఆయన రచనా శైలి ఎంతోమందికి స్ఫూర్తి. ఏ రంగంలో అయినా ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి బతికుండగా అవార్డులు ఇస్తే వారి ఆయుర్దాయం  పెరుగుతుంది’’ అని .రమణాచారి అన్నారు. ‘‘భార్యాభర్తలు కలిసి సినిమాల్లో నటించడం అరుదుగా జరుగుతుంది. రావి కొండలరావు దంపతులు నిజ జీవితంలో కలిసి జీవిస్తూ, సినిమాల్లో కూడా  నటించి అలరించారు. ఆయనపై మిత్రులు ఓ ప్రత్యేక కవర్‌ రూపొందించి, తపాలా శాఖ ద్వారా విడుదల చేయడం  ఆనందంగా వుంది’’ అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మోహన్‌ కందా కొనియాడారు. రావికొండలరావు స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.       

ఆంధ్రజ్యోతి, అబిడ్స్‌

Updated Date - 2020-02-26T05:39:19+05:30 IST