సుశాంత్ ఆత్మహత్యకు కారణమదేనా?

ABN , First Publish Date - 2020-06-15T00:12:28+05:30 IST

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ముంబైలోని తన నివాసంలో

సుశాంత్ ఆత్మహత్యకు కారణమదేనా?

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం నమ్మలేకపోతున్నామని బాలీవుడ్ షాక్ కి గురైంది. అలాగే.. ఇదో నమ్మలేని నిజంగా టాలీవుడ్ వ్యక్తం చేసింది. అయితే సుశాంత్ సింగ్  ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీవీ సీరియళ్లతో కెరీర్‌ స్టార్ట్ చేసి సినిమాలతో మంచి విజయవంతంగా దూసుకుపోతున్నారు సుశాంత్. ఇలాంటి సమయంలో సుశాంత్ ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తుంది. 


కాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 1986 జనవరి 21న పాట్నాలో జన్మించాడు. టీవీ సీరియల్స్‌ ద్వారా నటుడిగా పరిచయమైన సుశాంత్‌ ఆ తర్వాత డ్యాన్సర్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌ చిల్‌ షో నటుడిగా కెరీర్‌ ఆరంభించిన సుశాంత్ జీ టీవీలో పాపులర్‌ అయిన పవిత్ర రిస్థాకు అవార్డు కూడా అందుకున్నాడు. 


కాగా 2013లో కై పో చే సినిమాతో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా పరిచయమై ఆ తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్‌ సినిమాలో నటించాడు. డిటెక్టివ్‌ భ్యోమకేశ్‌ బక్షీలో డిటెక్టివ్‌ పాత్రతో అందరినీ ఆకట్టుకొనేలా  తన ప్రతిభను చాటాడు. అమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన పీకే సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌ లో కూడా మెరిశాడు. 


కాగా 2016లో వచ్చిన టీమిండియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బయోపిక్‌ ఎంఎస్‌ ధోని..ది అన్‌టోల్డ్‌ స్టోరీ లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. కేదార్‌నాథ్‌ చిత్రంలో లవర్‌బాయ్‌ పాత్రలో అందిరినీ అలరించిన సుశాంత్‌ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమ తీరని లోటుగా వెల్లడించింది. 


అయితే సుశాంత్‌ సింగ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత 6 నెలలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌ సన్నిహితులు కూడా అతను తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు వెల్లడిస్తున్నారు. కాగా  శనివారం రాత్రి తన బెష్ట్ ఫ్రెండ్స్ ని కలిసిన సుశాంత్..వారితో ఎటువంటి విషయాలు పంచుకోలేదు. మధ్యాహ్నాం వరకు కూడా సుశాంత్ బయటికి రాకపోవడంతో పనిమనిషికి డౌట్ వచ్చి వాళ్ల ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది. దీంతో స్నేహితులు వచ్చి తలుపులు బద్దలు కొట్టడంతో... సుశాంత్ అప్పటికే విగతజీవిగా పడి ఉన్నారు. కాగా ఆ మధ్య సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సేలియన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మానసిక వత్తిడికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియడం లేదు. ఆదిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-15T00:12:28+05:30 IST