ముగింపు విషాదమా!? సుఖాంతమా!?

ABN , First Publish Date - 2020-12-01T06:48:11+05:30 IST

‘దుర్గామతి’, ‘ఇందూ కీ జవానీ’, ‘టోర్బాజ్‌’, ‘కూలీ నెం1’, ‘షకీలా’ - ఈ నెలలో విడుదల కానున్న హిందీ చిత్రాలు. ‘ఇందూ కీ జవానీ’, ‘షకీలా’ థియేటర్లలో విడుదల...

ముగింపు విషాదమా!? సుఖాంతమా!?

సినిమా అంతా ఒకెత్తు...

క్లైమాక్స్‌ మాత్రం మరో ఎత్తు!

క్లైమాక్స్‌ క్లిక్‌ అయితే సిన్మా హిట్టే!

హీరో నెక్ట్స్‌ సినిమా ఓపెనింగ్స్‌కి ఢోకా లేనట్టే!!

ఇండస్ట్రీతో 20-20మ్యాచ్‌ ఆడుకున్న 2020 క్లైమాక్స్‌కి వచ్చింది!

లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకూ 8 నెలలు కరోనా ఖాతాలో పడ్డాయి!

మరి, డిసెంబర్‌ ఎలా ఉంటుంది? సుఖాంతమా!? విషాదమా!?

డిసెంబర్‌లో విడుదలయ్యే హిందీ సినిమాల మీదే చూపులన్నీ నెలకొన్నాయి.

వీటి ఫలితాల మీదే 2021పై ఓ అంచనాకు రావొచ్చని వేచి చూస్తున్నారు.


‘దుర్గామతి’, ‘ఇందూ కీ జవానీ’, ‘టోర్బాజ్‌’, ‘కూలీ నెం1’, ‘షకీలా’ - ఈ నెలలో విడుదల కానున్న హిందీ చిత్రాలు. ‘ఇందూ కీ జవానీ’, ‘షకీలా’ థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటికి తోడు హాలీవుడ్‌ చిత్రం ‘టెనెట్‌’ ఉంది. దాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనువదించి థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇంగ్లిష్‌ వెర్షన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మిగతావి ఓటీటీ వేదికల్లో విడుదల కానున్నాయి. వీటికి ప్రేక్షకులు, వీక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకు అంటారా!?


కరోనా దెబ్బకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిందీలో కొందరు బుల్లితెర నటులు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు కూడా  పాల్పడ్డారు. ప్రస్తుతం సామాన్య జనజీవితం ఓ విధంగా సాధారణ స్థితికి వచ్చిందని చెప్పవచ్చు. కానీ, సినీ జీవితాలు మాత్రం  సాధారణ స్థితికి రాలేదు. కరోనా దెబ్బ నుంచి  భారతీయ సినిమా పరిశ్రమ పూర్తిగా కోలుకోలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ కష్టాలు ఇంకా తీరలేదు. థియేటర్లు తెరచుకున్నాయి. కానీ, సరైన బొమ్మ తెరపై పడలేదు. ఓటీటీ వేదికల్లోకి సినిమాలు వస్తున్నాయి. కానీ, బ్లాక్‌బస్టర్‌ అనదగ్గ విజయం ఏదీ నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో విడుదలయ్యే సినిమాల మీదే  ప్రతి ఒక్కరి దృష్టీ ఉంది.   ఇవి విజయాలు సాధిస్తే చిత్ర పరిశ్రమకు ఉత్సాహం వస్తుంది.


అన్‌లాక్‌ తర్వాత థియేటర్లు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ... థియేటర్లలో విడుదలైన తొలి  హిందీ చిత్రం ‘సూరజ్‌ పే మంగళ్‌ భరి’. నవంబర్‌ 15న విడుదలైంది. పంజాబీ గాయకుడు, కథానాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌, నటుడు మనోజ్‌ బాజ్‌పేయి, కథానాయిక ఫాతిమా సనా షేక్‌ నటించిన చిత్రమిది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. కానీ, థియేటర్లకు జనాలే ఆశించినంతగా రాలేదు. కొన్ని మెట్రో నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో 14 - 16 షోలు పడ్డాయి. భారీ విడుదల లభించింది. అయితే... మ్యాట్నీ, ఈవెనింగ్‌ షోలకు వచ్చిన ప్రేక్షకుల శాతం 20 - 25 మాత్రమే. ప్రభుత్వం 50 శాతం సామర్ధ్యంతో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సినిమా హాళ్లల్లో జనం సగం కూడా రాలేదంటే? వాళ్లలో పూర్తిగా కరోనా భయాలు తొలగిపోలేదని అనుకోవాలి. దీనికి ఓపెనింగ్‌ రోజున వసూళ్లు 60-65 లక్షలు వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. సాధారణ రోజుల్లో అయితే ఈ సినిమాకు రూ. 3 కోట్లు వచ్చేవట! ప్రస్తుతానికి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ‘ఇందూ కీ జవానీ’ విడుదలయ్యే సమయాని(ఈ నెల 11)కి మరింత మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. పైగా, ‘సూరజ్‌ పే మంగళ్‌ భరి’ తారాగణంతో పోలిస్తే... యువతలో ‘ఇందూ కీ జవానీ’లో ఇందూగా నటించిన కియారా అడ్వాణీకి ఎక్కువ క్రేజ్‌ ఉంది. గతేడాది ‘కబీర్‌ సింగ్‌’ వంటి విజయం ఆమె ఖాతాలో పడింది. అందువల్ల, ఈ సినిమాకి వచ్చే ప్రేక్షకుల శాతం పెరిగితే... థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి ముందుకొచ్చే వారి సంఖ్య పెరుగుతంది. 


‘ఇందూ కీ జవానీ’ విడుదలైన రెండు వారాలకు క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 25న దక్షిణాది శృంగారతార షకీలా జీవితం ఆధారంగా రూపొందిన ‘షకీలా’ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. షకీలాగా రిచా చద్దా నటించారు. సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్‌’కి బాలీవుడ్‌లో మాంచి స్పందన లభించింది. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. అదే విధంగా ‘షకీలా’ సక్సెస్‌ సాధిస్తే... జనవరిలో సినిమాలు విడుదల చేయాలనుకున్న దర్శక-నిర్మాతలు, కథానాయకులు ధైర్యంగా ముందుకొస్తారు. ‘టెనెట్‌’కి వచ్చే స్పందన బట్టి హాలీవుడ్‌ సినిమా రిలీజులు ప్లాన్‌ చేస్తారేమో! బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలకు హైదరాబాద్‌ మంచి మార్కెట్‌. ‘సూరజ్‌ పే మంగళ్‌ భరి’ విడుదలైనప్పుడు తెలంగాణలో థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఇక్కడ వాటికి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమే.


ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలవుతున్న చిత్రాలకు వసూళ్లు, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల శాతంతో సంబంధం లేదు. అందుకని, ఆ చిత్రాల మార్కెట్‌కి ఎటువంటి ఢోకా ఉండదని భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలైన హిందీ చిత్రాలను పరిశీలిస్తే... బడా స్టార్లు నటించినవేవీ విజయాలు సాధించలేదు. ఉదాహరణకు... సంజయ్‌దత్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ నటించిన ‘సడక్‌ 2’, అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన ‘లక్ష్మీ’, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ‘డ్రైవ్‌’. వీక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సామర్థ్యం లేని చిత్రాలను బాలీవుడ్‌ పెద్దలు ఓటీటీకి ఇస్తున్నారనే విమర్శలు ఓ వైపు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోట్లకు కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త చిత్రాలను కొనడానికి ఓటీటీ వేదికలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ కొన్నవి త్వరలో విడుదల కానున్నాయి. అనుష్క హిట్‌ సినిమా ‘భాగమతి’ రీమేక్‌ ‘దుర్గామతి’గా  ఈ నెల 11న ఓటీటీలోకి వస్తోంది. వరుణ్‌ ధావన్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన ‘కూలీ నెం.1’ క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 25న ఓటీటీలో విడుదల కానుంది. ఈ రెండూ విజయం సాధిస్తేనే... ఓటీటీల్లో విడుదలయ్యేవి ఫ్లాప్‌ చిత్రాలు కాదనే భావన వీక్షకుల్లో తొలగుతుంది. కరోనా కాలంలో ఏర్పడిన ఓటీటీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించాలని అనుకొనే  వాళ్లకు మార్గం సుగుమం అవుతుంది. ఈ క్లైమాక్స్‌లో రిజల్ట్స్‌ను బట్టి నెక్ట్స్‌ ఇయర్‌ ఓపెనింగ్స్‌ ఉంటాయి. అదీ సంగతి!! 

Updated Date - 2020-12-01T06:48:11+05:30 IST

Read more