వర్షాకాలంలో ‘సెట్‌’ కాదని కూల్చేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-05-27T05:35:59+05:30 IST

కరోనా తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో? మళ్లీ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో? ప్రస్తుతానికి తెలియని పరిస్థితి! ఒకవేళ మొదలైనా... అవుట్‌ డోర్‌లో షూటింగ్‌ చేసే పరిస్థితులు కనుచూపు మేరల్లో సుసాధ్యమయ్యేలా కనిపించడం లేదు...

వర్షాకాలంలో ‘సెట్‌’ కాదని కూల్చేస్తున్నారు!

కరోనా తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో? మళ్లీ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో? ప్రస్తుతానికి తెలియని పరిస్థితి! ఒకవేళ మొదలైనా... అవుట్‌ డోర్‌లో షూటింగ్‌ చేసే పరిస్థితులు కనుచూపు మేరల్లో సుసాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకని, అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా చంద్రప్రకాశ్‌ ద్వివేదీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చారిత్రక చిత్రం ‘పృధ్వీరాజ్‌’ కోసం వేసిన అవుట్‌ డోర్‌ సెట్‌ను కూల్చేయాలని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్ణయించింది. రానున్న వర్షాకాలం కూడా దీనికి ఓ కారణం. రెండు నెలలుగా షూటింగులు జరగని లాక్‌డౌన్‌ కాలంలోనూ యశ్‌ రాజ్‌ సంస్థ సెట్‌ను అలాగే ఉంచింది. అయితే వర్షాలు కురిస్తే సెట్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడానికి అయ్యే ఖర్చు కంటే, ఇండోర్‌ స్టూడియోలో సెట్‌ వేస్తే తక్కువ ఖర్చు అవుతుంది కనుక కూల్చేయడానికి సిద్ధమయ్యారని ముంబయ్‌ ఖబర్‌. లాక్‌డౌన్‌కి ముందు సినిమాలో చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే కూల్చేస్తున్న సెట్‌లో కొన్ని కీలక యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. ఇప్పుడు వాటినే ఇండోర్‌ సెట్‌లో, షూటింగులకు అనుమతులు వచ్చిన తర్వాత చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చని సమాచారం.


కరోనాపై అవగాహన కల్పించడం కోసం...

లాక్‌డౌన్‌లోనూ అక్షయ్‌కుమార్‌ షూటింగ్‌ చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆర్‌. బల్కి దర్శకత్వంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ రూపొందించిన చిత్రంలో ఆయన నటించారు. సుమారు 20మంది పరిమిత చిత్రబృందంతో నాలుగు గంటల్లో ముంబయ్‌ కమలిస్తాన్‌ స్టూడియోలో సోమవారం షూటింగ్‌ చేశారు. షూటింగ్‌ చేయడానికి ముందు అనుమతులు తీసుకోవడంతో పాటు సెట్‌ను శానిటైజ్‌ చేసి... సెట్‌లో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలన్నీ పాటిస్తూ చిత్రీకరణ పూర్తిచేశామని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2020-05-27T05:35:59+05:30 IST