క్షణాల వ్యవధిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకొన్నాం

ABN , First Publish Date - 2020-02-21T07:02:28+05:30 IST

ప్రమాదం జరగడానికి నాలుగు సెకన్ల ముందే దర్శకుడు శంకర్‌, ఛాయాగ్రాహకుడు క్రేన్‌ కూలిన స్థలం నుంచి వెళ్లిపోయారు. నేను, హీరోయిన్‌ కాజల్‌ అక్కడే ఉన్నాం. అయితే వెంట్రుక వాసిలో...

క్షణాల వ్యవధిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకొన్నాం

ప్రమాదం జరగడానికి నాలుగు సెకన్ల ముందే దర్శకుడు శంకర్‌, ఛాయాగ్రాహకుడు క్రేన్‌ కూలిన స్థలం నుంచి వెళ్లిపోయారు. నేను, హీరోయిన్‌ కాజల్‌ అక్కడే ఉన్నాం. అయితే  వెంట్రుక వాసిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకొన్నాం’ అని కమల్‌హాసన్‌ చెప్పారు.  లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ఇండియన్‌2’ సెట్స్‌లో క్రేన్‌ కూలిన ప్రమాదంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సహా ముగ్గురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. చెన్నై శివారు ప్రాంతం నజరత్‌పేటలోని ఈవీపీ ఎస్టేట్‌ వద్ద సంభవించిన ప్రమాదంలో మరణించిన ముగ్గురికి   కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌  నివాళులర్పించారు. చెన్నై కీల్పాక్కం ఆసుపత్రిలో ఉన్న భౌతికకాయాలకు కమల్‌హాసన్‌ గురువారం మధ్యాహ్నం అంజలి ఘటించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ సందర్భంగా మృతులు మధు, చంద్రన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ కుటుంబాలకు కోటి రూపాయల  పరిహారం ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఇది నా కుటుంబీకులకు జరిగిన ప్రమాదంగానే భావిస్తున్నాను. రెండ్రోజుల క్రితమే  సెట్స్‌లో చేరిన సాయికృష్ణ ఇప్పుడు ప్రాణాలతో లేడు. అన్ని రంగాల్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సినీ రంగం కూడా అందుకు మినహాయింపు కాదు. ప్రమాదాలకు డబ్బున్నోళ్లు, పేదోళ్లన్న తేడా తెలీదు. అయితే రూ.100 కోట్లు, రూ.200కోట్లు వసూళ్లు సాధించేలా అభివృద్ధి చెందిన మన సినీ పరిశ్రమలో కార్మికులకు తగినంత భద్రత కల్పించలేకపోవడం అవమానకరమైన విషయం. బాధిత కుటుంబాలకు ప్రకటించింది సాయం మాత్రమే, పరిహారం కాదు. బాధితుల శోకాన్ని దేనితోనూ పోగొట్టలేం. ఇకపై జరిగే సినిమా షూటింగ్‌ల్లో కార్మికులందరికీ భద్రత కల్పించాలి. బీమా ఉండాలి. సినీ పరిశ్రమ మొత్తం ఈ విషయంలో స్పందించాలి. ఇది నేను విజ్ఞప్తిగా చెప్పడం లేదు. ఎందుకంటే ఇది అందరి బాధ్యత’’ అని పేర్కొన్నారు. మరోవైపు, నిర్మాణ సంస్థ లైకా మృతులు ముగ్గురు కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున, క్షతగాత్రులకు మరో రూ.50లక్షలు మొత్తంగా రూ.2కోట్లు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదం కారణంగా ‘ఇండియన్‌2’ షూటింగ్‌ను రెండు వారాలపాటు రద్దు చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-02-21T07:02:28+05:30 IST