ఆమె నా భార్య కావడం నా అదృష్టం

ABN , First Publish Date - 2020-02-21T07:01:06+05:30 IST

నటి, దర్శకురాలు విజయనిర్మల 74వ జయంతి గురువారం నానక్‌రామ్‌గూడాలోని నివాసంలో జరిగింది. ఇందులో భాగంగా విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆవిష్కరించారు...

ఆమె నా భార్య కావడం నా అదృష్టం

నటి, దర్శకురాలు విజయనిర్మల 74వ జయంతి గురువారం నానక్‌రామ్‌గూడాలోని నివాసంలో జరిగింది. ఇందులో భాగంగా విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కృష్ణంరాజు, మహేశ్‌ విజయనిర్మలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి అవార్డును నందినీరెడ్డికి అందచేశారు. కృష్ణ మాట్లాడుతూ ‘‘ఐదారు సినిమాల్లో యాక్ట్‌ చేసిన తర్వాతే నేను డైరెక్ట్‌ చేస్తా అని విజయనిర్మల అనేది. తొందరపడొద్దని, వంద సినిమాల్లో నటించి ఓ అవగాహన వచ్చాక దర్శకత్వం చేస్తే బావుంటుందని చెప్పా. ఆ మాటను ఫాలో అయింది. ‘కవిత’, మీనా’ సినిమాల సక్సె్‌సతో వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తీసింది. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం’’ అని అన్నారు. మహేశ్‌ మాట్లాడుతూ ‘‘విజయనిర్మల గారు డైనమిక్‌ ఉమెన్‌. నా సినిమా విడుదల రోజు సినిమా చూసి మొదట నాన్న, ఆ తర్వాత విజయనిర్మల గారు ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌ తరువాత నాన్న తర్వాత ఆవిడ మాట్లాడబోతున్నారు అనుకొని వెంటనే రియలైజ్‌ అయ్యాను. ఆరోజు ఆ లోటు కనిపించింది’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘విజయనిర్మల పేరులోనే విజయం, నిర్మలత్వం ఉన్నాయి. నేను, కృష్ణ, విజయనిర్మల కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఆమె సాధించిన విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను. నరేశ్‌ తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం’’ అన్నారు. ‘‘అమ్మ పేరున ప్రతి ఏడాది నటీనటులకు అవార్డులు అందజేస్తాం’’అని నరేశ్‌ చెప్పారు.  

Updated Date - 2020-02-21T07:01:06+05:30 IST