ఇక.. హాలీవుడ్‌ ధనుష్‌...!

ABN , First Publish Date - 2020-12-27T19:04:02+05:30 IST

కరోనా కాలంలో ఎక్కువమంది తెలుగువాళ్లు చూసిన తమిళ చిత్రం ‘అసురన్‌’.

ఇక.. హాలీవుడ్‌ ధనుష్‌...!

కరోనా కాలంలో ఎక్కువమంది తెలుగువాళ్లు చూసిన తమిళ చిత్రం ‘అసురన్‌’. అందులో అతని సహజనటనను ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి వైవిధ్యభరిత పాత్రల్ని పోషించే ధనుష్‌కు... హాలీవుడ్‌లో మరోసారి మెరిసే అవకాశం వచ్చింది. ‘అవెంజర్స్‌’ తీసిన రూసో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్న ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు ధనుష్‌... 


ధనుష్‌ అసలు పేరు వెంకటేశ్‌ ప్రభు కస్తూరి రాజా. సినిమాల్లోకి రావాలని తను ఎప్పుడూ అనుకోలేదు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి చెఫ్‌గా సెటిల్‌ అవ్వాలని అనుకునేవాడు. కాకపోతే తండ్రి కస్తూరి రాజా దర్శక నిర్మాత. అన్నయ్య సెల్వరాఘవన్‌కి సినిమా క్రాఫ్ట్‌ అంటే ఇష్టం. అందుకే హీరో అవ్వాలని తమ్ముడిని ప్రోత్సహించే వాడు. ఆఖరుకు నాన్న దర్శకత్వంలోనే 2002 లో అంటే పంతొమ్మిదేళ్లకే తెరంగేట్రం చేశాడు. అప్పటికే సినిమాల్లో ప్రభు, ప్రభుదేవా ఉండడంతో తన పేరును ధనుష్‌గా మార్చుకున్నాడు. ఆ మరుసటి ఏడాది సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కాదల్‌ కొండేన్‌’ ద్వారా ధనుష్‌కి మంచి పేరొచ్చింది. మానసికంగా స్థిమితంగా లేని యువకుడిగా ధనుష్‌ నటన ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఇరవై ఏళ్లలో యాభై చిత్రాలకి చేరువయ్యాడు.


వైవిధ్యభరిత పాత్రలు చేస్తూ...

తమిళంలో ప్రధానంగా చేసినా ధనుష్‌ దక్షిణాదిలో బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు. అతడి ప్రతి సినిమా తెలుగులోకి డబ్‌ అవుతోంది. మూడు జాతీయ అవార్డులూ గెలుచుకున్నాడు. రజనీకాంత్‌ని సూపర్‌స్టార్‌గా, కమల్‌హాసన్‌ని ఉలగనాయగన్‌గా, విజయ్‌ని దళపతిగా, అజిత్‌ని తలాగా అభిమానులు పిలుచుకోవడం తమిళనాడులో పరిపాటి. ధనుష్‌ పేరు పక్కన మాత్రం అటువంటివి లేవు. అందుకే అతడు ఓ చట్రంలో బిగుసుకుపోలేదు. రొమాంటిక్‌, మాస్‌ మసాలా, ఎమోషనల్‌, సైకలాజికల్‌ డ్రామాలు.. ఇలా అన్నీ చేస్తూ వైవిధ్యభరితమైన నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. కమర్షియల్‌ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘పుదుపెట్టయి’, ‘ఆడుకాలమ్‌’, ‘వాడ చెన్నై’ మంచి పేరుతెచ్చాయి. ఈ వైవిధ్యమే అతడిని బాలీవుడ్‌లోకీ తీసుకువెళ్లింది. ‘రాంఝానా’ తొలి హిందీ చిత్రం.  రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం విజయం సాధించి వంద కోట్ల రూపాయల క్లబ్బులో చేరింది. ఆ తరవాత అమితాబ్‌ బచ్చన్‌తో పోటాపోటీగా ‘షమితాబ్‌’లో నటించాడు. ‘చూడడానికి సాధారణంగా ఉండే నేను చక్కగా నటించాల్సిందే, నన్ను నేను మెరుగులు దిద్దుకోవాల్సిందే, మరో మార్గం లేదం’టాడు ధనుష్‌  .



‘అసురన్‌’ ఒక్కటి చాలు..

ధనుష్‌ కెరీర్‌లో ‘అసురన్‌’ ఒక ప్రత్యేకమైన చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమాలో విశ్వరూపాన్ని చూపించాడు. ప్రస్తుతం రూసో బ్రదర్స్‌తో ప్రతిష్టాత్మక చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితమే ‘ఏన్‌ ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ధనుష్‌, రజనీకాంత్‌ల జీవితాల్లో సారూపత్యలు ఉన్నాయి. ఇద్దరూ సామాన్యుల లాగానే కన్పిస్తారు. తెరపై ఎంత పెద్ద హీరోలైనా బయట ఎలాంటి భేషజాలు ఉండవు. ముప్ఫై ఏడేళ్ల ధనుష్‌ భవిష్యత్తులో మరెన్నో విజయాలని సాధిస్తాడని ఆశిద్దాం.


చాలా కష్టపడ్డాను

‘నాకు ఇంగ్లిష్‌ అంతగా వచ్చేది కాదు. ఇరవై రెండేళ్ల పాటు తమిళం మాత్రమే మాట్లాడుతూ పెరిగిన వాణ్ని. నా తొలి సినిమా విడుదలైనప్పుడు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని అంతగా అనుకోలేదు. కానీ 2005లో మాత్రం ఆంగ్లాన్ని ఎలాగైనా నేర్చుకోవాలని తీర్మానించుకున్నాను. ఇంగ్లిష్‌ పుస్తకాలు పెద్ద ఎత్తున చదవడం మొదలుపెట్టాను. కానీ ఓ చాఫ్టర్‌ పూర్తికాకముందే నిద్ర కమ్మేసింది. ఇలా కాదని నవలలు చదవడం మొదలుపెట్టాను. అవెంతో ఆసక్తికరంగా అన్పించి పూర్తయ్యేదాకా కునుకే లేకుండా చేశాయి. జెఫ్రీ ఆర్చర్‌, కామ్‌ ఇగ్గుల్‌డెన్‌ నా ఫేవరెట్‌ రచయితలు అయిపోయారు. ఇన్నేళ్లూ వారి రచనలు చదవకుండా ఎంత జీవితం వేస్ట్‌ చేసుకున్నాననే భావం కలిగిందంటాడు’ ధనుష్‌ వివిధ సందర్భాలలో.


ఫాలోవర్స్‌లో టాప్‌...


క్రీడలు: స్నూకర్‌, టేబుల్‌ టెన్నిస్‌

వ్యాపకాలు: నవలలు చదవడం అంటే ఇష్టం, రచనలు చేస్తుంటాడు.

కుటుంబం: భార్య ఐశ్వర్య, కొడుకులు యాత్రా, లింగ. 

ఆరాధించే దైవం: శివుడు

నటులు: మోహన్‌లాల్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, టామ్‌ హాంక్స్‌

రంగు: నలుపు

ట్విట్టర్‌: 4 మిలియన్‌ ఫాలోవర్లను అందుకున్న మొదటి దక్షిణాది నటుడు

పాటగాడు: ధనుష్‌ రచించి, పాడిన ‘కొలవరి డి’ మిలియన్‌ వ్యూస్‌ అందుకున్న తొలి భారతీయ వీడియో. ఈ సూపర్‌ డూపర్‌ పాటను ఆరు నిమిషాల్లో రాశాడట. 

రౌడీ బేబీ: ధనుష్‌ రచించి, పాడిన ఈ పాట యూట్యూబ్‌లో బిలియన్‌ మార్క్‌ను అందుకున్న దక్షిణ భారతీయ పాటగా రికార్డుకెక్కింది. 

అవార్డులు: ఇరవై ఆరేళ్లకే జాతీయ అవార్డును పొందిన అతి పిన్న వయసు నటుడిగా రికార్డు నెలకొల్పాడు.

వెజిటేరియన్‌: జంతు సంరక్షణ సంస్థ ‘పెటా’కు ప్రచారకర్త. హాటెస్ట్‌ వెజిటేరియన్‌గా ఆ సంస్థ అవార్డునూ పొందాడు.


పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం

అది 2003... ధనుష్‌ ‘కాదల్‌ కొండేన్‌’ సినిమా విడుదలైంది. అప్పుడే ఐశ్వర్యకు ధనుష్‌ను పరిచయం చేశారెవరో. ఆ చిత్రంలో ధనుష్‌ నటనను ఐశ్వర్య మెచ్చుకుంది. ఆ మరుసటి రోజు అతనికి ఓ బొకే పంపించింది. ఇక అంతే వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని గాసిప్స్‌ మొదలయ్యాయి. అలాంటిదేమీ లేదని ధనుష్‌ ప్రకటించాడు కూడా. అయితే ఈలోపు ఇరు కుటుంబాల వారికీ ఓ ఆలోచన వచ్చి ఇద్దరూ కలుసుకునే ఏర్పాటుచేశారు. ఓ ఆరు నెలల తరవాత వీళ్ల పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమనే చెబుతారు.. అప్పుడు ధనుష్‌కి 21, ఐశ్వర్యకి 23. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. ఒకరి ఇష్టాల్ని మరొకరి మీద రుద్దకుండా ఎదుటి వ్యక్తికి కావలసినంత స్పేస్‌ ఇస్తాం.. అదే బంధాన్ని గట్టిగా నిలుపుతోంది అంటుంది ఐశ్వర్య. తను ధనుష్‌ కంటే రెండేళ్లు పెద్దది.

Updated Date - 2020-12-27T19:04:02+05:30 IST