అందుకే మా ప్రయత్నం

ABN , First Publish Date - 2020-12-24T06:24:14+05:30 IST

కొంతమంది తెలివైనోళ్లు, మిగిలినవాళ్లంతా పెళ్లైనోళ్లు అంటున్నారు హీరో సాయితేజ్‌. ఆయన కథానాయకుడుగా నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్‌’...

అందుకే మా ప్రయత్నం

కొంతమంది తెలివైనోళ్లు, మిగిలినవాళ్లంతా పెళ్లైనోళ్లు అంటున్నారు హీరో సాయితేజ్‌. ఆయన కథానాయకుడుగా నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా ఆ సినిమా విశేషాలను సాయితేజ్‌ పంచుకున్నారు. 


ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?

పిల్లలుగా ఉన్నప్పుడు మన ఫ్రీడమ్‌ మన పేరెంట్స్‌ చేతుల్లో ఉంటుంది. పెళ్లయ్యాక భార్య చేతిలో ఉంటుంది. పిల్లలు పుట్టాక వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఇలా మన ఫ్రీడమ్‌ ఎప్పుడూ మనచేతుల్లో ఉండదు. కానీ మన ఫ్రీడమ్‌, మన హ్యాపీనెస్‌ మన చేతుల్లోనే ఉండాలి, దాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఈ సినిమా బేసిక్‌ కాన్సెప్ట్‌.


హీరో తన ఫిలాసఫీని ఎంత స్ట్రాంగ్‌గా నమ్ముతాడు,  అతనికి ఎలాంటి బలమైన అడ్డంకులు వస్తాయి,  వాటినెలా అధిగమిస్తాడు అనేది సినిమాలో చూపించాం. 


పెళ్లి మీద మీది కూడా ఇదే అభిప్రాయమా? 

పెళ్లి విషయంలో మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, మనమీద అమ్మలు గెలుస్తారు. కాకపోతే మనం కొంతకాలం వాయిదా వేయగలుగుతాం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల నా పెళ్లిని ఏడాదిన్నర వాయిదా వేశాను. ఇప్పుడు మళ్లీ కొన్నాళ్లు వాయిదా వేయాలి. 


ఈ సినిమాలో మీకు నచ్చిన సాంగ్‌?

‘నో పెళ్లి’ సాంగ్‌... రోజూ వింటున్నాను.


ఇప్పుడున్న పరిస్థితుల్లో  మీ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం ఎంత వరకూ సేఫ్‌ అనుకుంటున్నారు?

సినిమా కంటెంట్‌ స్ట్రాంగ్‌గా ఉంది. మంచి ఎంటర్‌టైనర్‌. ఇప్పటిదాకా లాక్‌డౌన్‌ తర్వాత సరైన తెలుగు ఎంటర్‌టైనర్‌ రాలేదు. ఆ లోటును ఈ చిత్రం తీరుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కలసి సామాజిక దూరం పాటిస్తూ మా చిత్రం చూడాలని కోరుతున్నాను. ఓటీటీలో ఎన్ని సినిమాలు చూసినా థియేటర్‌లో సినిమా చూస్తే ఓ చిన్న రిలీఫ్‌ ఉంటుంది. మేనెల్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్‌ వల్ల డిసెంబర్‌లో విడుదలవుతోంది. గతేడాది ఇదే నెల్లో నా చిత్రం వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం వస్తోంది. అనుకోకుండా అలా కుదిరింది.


ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్షన్లు అంతగా రావు కదా?

నిజమే కానీ ప్రేక్షకుల ఆరోగ్యం మనకు ముఖ్యం. దాని తర్వాతే ఏదైనా. ఆల్‌రెడీ ప్రొడ్యూసర్స్‌  సేఫ్‌ అయిపోయారు. ప్రేక్షకులు సామాజిక దూరం పాటిస్తూ థియేటర్‌కు వస్తే చాలు. టెనెట్‌ సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్‌లో చీరల యాడ్‌ వేస్తే దానికి కూడా కేకలు ఈలలు వేస్తున్నారు. అదొక రిలీఫ్‌. ప్రేక్షకులకు థియేటర్‌లో సినిమా చూశాం అనే అనుభూతి ఇవ్వాలనేది నా కోరిక.

Updated Date - 2020-12-24T06:24:14+05:30 IST